Pyre Movie Casting Story: సినిమా అంటే కోట్ల బడ్జెట్, విలాసవంతమైన సెట్లు, గ్లామరస్ స్టార్స్ మాత్రమే కాదు... మట్టి వాసనతో కూడిన పచ్చి నిజాలను చూపించడమే నిజమైన సినిమా అని నిరూపిస్తున్నారు దర్శకుడు వినోద్ కాప్రీ. ఆయన తెరకెక్కించిన 'పైర్' (Pyre) అనే హిందీ చిత్రం ప్రస్తుతం అంతర్జాతీయ చలనచిత్ర వేదికలపై సంచలనం సృష్టిస్తోంది.
కెమెరా ముఖం చూడని సాధారణ మనుషులు

ఈ పైర్ సినిమాలో నటించిన ప్రధాన పాత్రధారులిద్దరూ ఎప్పుడూ కెమెరా ముఖం చూడని సాధారణ గ్రామస్థులు కావడం విశేషం. 80 ఏళ్ల పదం సింగ్ కాప్రీ, 70 ఏళ్ల హీరా దేవి ఈ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు. ఏకంగా 18 అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్న ఈ చిత్రం వెనుక ఎంతో ఆసక్తికరమైన కథ ఉంది.
ఉత్తరాఖండ్ కుమావూ ప్రాంతంలో సాగే ఈ కథ, నేటి గ్రామీణ భారతదేశంలో నెలకొన్న తీవ్రమైన వలసల సమస్యను స్పృశిస్తుంది. పల్లెల నుంచి యువత ఉద్యోగాల కోసం నగరాలకు వెళ్లిపోతుంటే, కన్నవాళ్లు సొంతూళ్లలోని ఇళ్లల్లో ఒంటరితనంతో ఎలా రగిలిపోతున్నారో ఈ సినిమా ఆవిష్కరించింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జిల్లాల నుంచి ఉపాధి కోసం మైగ్రేట్ అవుతున్న నేటి కుటుంబాల వ్యధకు కూడా ఈ చిత్రం అద్దం పడుతుంది. 2018లో మున్సియారీ వెళ్లినప్పుడు ఒక వృద్ధ దంపతులను చూసిన వినోద్ కాప్రీకి ఈ కథ ఆలోచన వచ్చింది. మొదట ఆ నిజమైన దంపతులతోనే షూటింగ్ చేయాలని భావించినా, కెమెరా ముందు సహజంగా నటించడం వారికి సాధ్యపడలేదు. దాదాపు రెండేళ్ల పాటు 60 మందికి పైగా ఆడిషన్స్ చేసినా సరైన నటులు దొరకలేదు.
నసీరుద్దీన్ షా ఇచ్చిన ఉచిత సలహా.. మలుపు తిరిగిన కథ!
నటీనటుల వేట ఫలించకపోవడంతో వినోద్ కాప్రీ బాలీవుడ్ దిగ్గజ నటులు నసీరుద్దీన్ షా, రత్నా పాఠక్ షాలను సంప్రదించారు. కథ విన్న నసీరుద్దీన్ షా ఎంతో ముచ్చటపడ్డారు. అయితే, ఆయన ఒక నిజాయితీగల ప్రశ్నే వేశారు. "కథ ఎంతో బాగుంది, కానీ ఆ కొండ ప్రాంతపు యాస, జీవన విధానం మాకు వస్తాయా? మేము ఆ పాత్రలకు న్యాయం చేయగలమా అని ఆలోచించండి" అని వినోద్ కాప్రీకి సలహా ఇచ్చారు.
{{/usCountry}}నటీనటుల వేట ఫలించకపోవడంతో వినోద్ కాప్రీ బాలీవుడ్ దిగ్గజ నటులు నసీరుద్దీన్ షా, రత్నా పాఠక్ షాలను సంప్రదించారు. కథ విన్న నసీరుద్దీన్ షా ఎంతో ముచ్చటపడ్డారు. అయితే, ఆయన ఒక నిజాయితీగల ప్రశ్నే వేశారు. "కథ ఎంతో బాగుంది, కానీ ఆ కొండ ప్రాంతపు యాస, జీవన విధానం మాకు వస్తాయా? మేము ఆ పాత్రలకు న్యాయం చేయగలమా అని ఆలోచించండి" అని వినోద్ కాప్రీకి సలహా ఇచ్చారు.
{{/usCountry}}పైగా శ్వాసకోశ సమస్యల వల్ల హిమాలయాల్లో షూటింగ్ చేయడం తనకు సాధ్యపడదని చెప్పారు. ఆ మాటలతో స్థానికత, సహజత్వం ఉన్న వ్యక్తులనే నటులుగా మార్చాలని వినోద్ నిర్ణయించుకున్నారు.
తీరా చూస్తే, ఆయన వెతుకుతున్న కథానాయకుడు సొంత ఇంట్లోనే దొరికారు. 2022 జులైలో వినోద్ కాప్రీ తండ్రి 80వ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఆ వేడుకకు వచ్చిన ఆయన బాబాయ్, రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ పదం సింగ్ (77) తాను నటిస్తానని ముందుకొచ్చారు.
సరదాగా చెబుతున్నారనుకున్న వినోద్, పరీక్షించాలనే ఉద్దేశంతో పైర్ సినిమాలో అత్యంత కష్టమైన సన్నివేశాన్ని మొబైల్‌లో రికార్డ్ చేశారు. ఆయన అద్భుతమైన హావభావాలు చూసి వినోద్ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత 15 రోజులు ప్రత్యేక శిక్షణ ఇచ్చి, పదం సింగ్‌నే కథానాయకుడిగా ఖరారు చేశారు.
గడ్డి మోపుతో వచ్చిన అవ్వ.. ఒక్కసారిగా హీరోయిన్‌గా!
నాయకుడి పాత్ర దొరికినా, ఆయనకు జోడీగా నటించే కథానాయిక వేట సవాలుగా మారింది. ఢిల్లీ తిరుగు ప్రయాణంలో దారి పక్కన తలపై కట్టెల మోపుతో వెళ్తున్న ఒక అవ్వను చూసి వినోద్ కాప్రీ కారు ఆపారు. అయితే తమను అటవీ శాఖ అధికారులనుకుని ఆ అవ్వ భయపడి గ్రామంలోకి పరుగెత్తింది. దర్శకుడి బృందం ఆమెను అనుసరిస్తూ గ్రామానికి వెళ్లి, తాము సినిమా కోసం నటిని వెతుకుతున్నామని ఊరి జనానికి వివరించారు.
అప్పుడే పక్కనే ఉన్న చేనులో గడ్డి మోపు భుజాన వేసుకుని వెళ్తున్న 70 ఏళ్ల హీరా దేవి ఆ మాటలు విన్నారు. హీరో పక్కన నటించే నటి కావాలని తెలిసి, ధైర్యంగా ముందుకు వచ్చారు. తనకు హిందీ రాదని, కుమావూ యాసలోనే మాట్లాడతానని చెప్పి ఒక సీన్ చేసి చూపించారు.
ఆమె ఆత్మవిశ్వాసానికి ముగ్ధుడైన దర్శకుడు వెంటనే ఆమెను ఎంపిక చేశారు. అయితే "సినిమాల్లో నటించడం మా ఊరి ఆచారాలకు విరుద్ధం, పరాయి పురుషుడితో నటించడం కుదరదు" అని హీరా దేవి మొదట నిరాకరించారు. ఆమె కుమారుడు వినోద్ కాప్రీ పని గురించి తెలిసి ఉండటంతో, తల్లికి నచ్చజెప్పి ఒప్పుకునేలా చేశారు. అలా 'తులసి' పాత్రలోకి హీరా దేవి ప్రవేశించారు.
ముంబై స్క్రీనింగ్‌లో కంటతడి పెట్టిన దిగ్గజ నటుడు!
సినిమా పూర్తయ్యాక ముంబైలో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. నసీరుద్దీన్ షా, రత్నా పాఠక్ షా ఈ చిత్రాన్ని తిలకించారు. 80 ఏళ్ల తాత, 70 ఏళ్ల అవ్వ వెండితెరపై ఒలికించిన సహజ నటన చూసి నసీరుద్దీన్ షా భావోద్వేగానికి లోనయ్యారు.
"మేము ఎంత ప్రయత్నించినా ఈ స్థాయి పెర్ఫార్మెన్స్ ఇవ్వలేము. వీరిద్దరి అభినయం అద్భుతం" అని నసీరుద్దీన్ షా ఆ ఇద్దరు కొత్త నటులను గుండెలకు హత్తుకుని ప్రశంసించారు.
స్టార్ పవర్ కంటే మనసును తాకే కథనం
వినోద్ కాప్రీ, సురేష్ జోషి, అరవింద్ రాయ్ చౌదరి సంయుక్తంగా నిర్మించిన ఈ 'పైర్' చిత్రం అక్టోబర్ 30న హిందీతో పాటు మలయాళంలోనూ థియేటర్లలో విడుదలైంది. స్టార్ పవర్ కంటే మనసును తాకే కథనం, నటన మాత్రమే ప్రేక్షకులను మెప్పిస్తాయని ఈ చిత్రం స్పష్టం చేస్తోంది.