Welcome To The Jungle Review: వెల్‌కమ్ టు ది జంగిల్ రివ్యూ- 34 మంది స్టార్స్, 2 వేల కోట్ల ఫ్లాప్ తీసే ప్లాన్ ఎలా ఉందంటే?
Welcome To The Jungle Review In Telugu: స్టార్ హీరో అక్షయ్ కుమార్, సునీల్ శెట్టితోపాటు 34 మంది స్టార్స్ నటించిన క్రేజీ కామెడీ సినిమా వెల్‌కమ్ టు ది జంగిల్ నేడు థియేటర్లలోకి వచ్చేసింది. పాత వింటేజ్ కామెడీని గుర్తుచేస్తూ సాగిన ఈ చిత్రం ఏ మేరకు నవ్వించిందో వెల్‌కమ్ టు ది జంగిల్ రివ్యూలో చూద్దాం.
Welcome To The Jungle Movie Review In Telugu: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో విభిన్న జోనర్ల చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి. ఒకవైపు దేశ విభజన నాటి ప్రేమకథలు, మరోవైపు రొమాంటిక్ కామెడీలు, ఇంకోవైపు హారర్ చిత్రాలు థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తున్నాయి.

వెల్‌కమ్ సిరీస్‌లో మూడో సినిమా
ఇలాంటి తరుణంలో ప్రేక్షకులకు పక్కా వినోదాన్ని పంచేందుకు ఒక క్రేజీ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్ తోడైతే ఆ మజానే వేరు. బాలీవుడ్ సూపర్ హిట్ ఫ్రాంచైజీ 'వెల్‌కమ్' సిరీస్‌లో వచ్చిన మూడో చిత్రం 'వెల్‌కమ్ టు ది జంగిల్' (Welcome To The Jungle) నేడు (జూన్ 26) ప్రేక్షకులను పలకరించింది.
గతంలో వచ్చిన ‘వెల్‌కమ్’ (2007) చిత్రం సోషల్ మీడియాలో మీమ్స్ పరంగా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన ‘వెల్‌కమ్ బ్యాక్’ ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. దాంతో, ఈ మూడో భాగంతో హీరో అక్షయ్ కుమార్ తిరిగి వచ్చినప్పటికీ అంచనాలు కాస్త తక్కువగానే ఉన్నాయి.
34 మంది స్టార్స్
దివంగత రచయిత నీరజ్ వోరా అందించిన కథ ఆధారంగా దర్శకుడు అహ్మద్ ఖాన్ వెల్‌కమ్ టు ది జంగిల్ చిత్రాన్ని తెరకెక్కించారు. 34 మంది స్టార్స్ నటించిన ఈ సినిమా ఎలా ఉందో నేటి వెల్‌కమ్ టు ది జంగిల్ రివ్యూలో తెలుసుకుందాం.
రూ. 2000 కోట్ల బడ్జెట్.. ప్లాప్ సినిమా.. అసలు కథేంటంటే?
సిన్హా (జాకీర్ హుస్సేన్) అనే ఒక అండర్ వరల్డ్ వ్యాపారవేత్త తన వద్ద ఉన్న రూ. 2,000 కోట్ల బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చాలని ప్లాన్ చేస్తాడు. అందుకోసం సినిమా దర్శకుడు దాస్ (పరేష్ రావల్) ను సంప్రదించి, భారీ బడ్జెట్‌తో ఒక సినిమా తీయమంటాడు. అయితే, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ప్లాప్ అవ్వాలి అని కండిషన్ కూడా పెడతాడు.
మరోవైపు ఈ సినిమా అవకాశాన్ని వాడుకుని, ఎలాగైనా మళ్లీ హీరోగా నిలదొక్కుకోవాలని చూస్తున్న పాతకాలపు యాక్షన్ స్టార్ రాజీవ్ (అక్షయ్ కుమార్)ను దాస్ హీరోగా పెడతాడు. ఈ క్రమంలోనే ఈ కథలోకి ఉదయ్, మజ్నూ సోదరులైన యెడ అన్నా (సునీల్ శెట్టి), రోమియో (అర్షద్ వార్సి) లతో పాటు రాజీవ్ మాజీ గర్ల్‌ఫ్రెండ్ నాడియా (దిశా పటాని), సిన్హా కూతురు జెన్నీ (జాక్వెలిన్ ఫెర్నాండెజ్) ప్రవేశిస్తారు.
వీరి సినిమా షూటింగ్ ఆజాద్‌పూర్ అనే గ్రామంలో జరుగుతుంది. అక్కడ ఉండే జోయా (రవీనా టాండన్) తో పాటు గ్రామస్తులంతా ఈ సినిమా యూనిట్‌ను.. తమను ఉగ్రవాది జతారా (జాకీ ష్రాఫ్) నుంచి రక్షించడానికి వచ్చిన ఇండియన్ ఆర్మీ అధికారులుగా పొరపాటుబడతారు. ఆ తర్వాత ఏమైంది? ఆ సినిమా పూర్తి అయిందా? ఆజాద్‌పూర్ గ్రామస్థుల పరిస్థితి ఏమైంది? వంటి అంశాలు ఎలా నవ్వించాయన్నదే ఈ సినిమా.
ఫస్టాఫ్ నవ్వుల జాతర.. సెకండాఫ్ కాస్త ల్యాగ్!
సినిమా ప్రారంభం నుంచే దర్శకుడు, నటీనటులు ఒకే వేవ్ లెంగ్త్‌లో ప్రయాణించారు. లాజిక్కులకు తావులేని పక్కా ఓవర్ ది టాప్ కామెడీతో సినిమాను నడిపించారు. ముఖ్యంగా ప్రథమార్ధంలో పరేష్ రావల్, రాజ్‌పాల్ యాదవ్‌ల కామెడీ టైమింగ్, ఫర్హాద్ సామ్జీ రాసిన పంచ్ డైలాగులు థియేటర్లలో నవ్వులు పూయించాయి. అద్భుతమైన ప్రొడక్షన్ వాల్యూస్ తో ఫస్టాఫ్ చాలా వేగంగా సాగిపోతుంది.
ద్వితీయార్ధం కూడా మంచి నోట్‌తోనే ప్రారంభమైనప్పటికీ, క్లైమాక్స్ వైపు వెళ్లేకొద్దీ సినిమా కాస్త సాగదీసినట్లు అనిపిస్తుంది. ముగింపులో కామెడీ డోస్ తగ్గి, కథనం నెమ్మదించింది. హీరోయిన్లు రవీనా టాండన్ మినహా మిగిలిన వారికి పెద్దగా ప్రాధాన్యం లేదు. దిశా పటాని, జాక్వెలిన్ పాత్రలను కేవలం గ్లామర్ కోసమే వాడుకున్నారు.
క్లైమాక్స్‌లో వచ్చే ఒక బోల్డ్ సీన్ కథకు ఎలాంటి హెల్ప్ అవ్వలేదు. విక్రమ్ మాంట్రోస్, ఆనంద్ రాజ్ ఆనంద్ అందించిన సంగీతం ఆకట్టుకోలేకపోయింది. కానీ, 'ఘిస్ ఘిస్' పాటలో అక్షయ్ కుమార్, అక్షర సింగ్‌ల మాస్ స్టెప్పులు థియేటర్లలో విజిల్స్ వేయించాయి.
పాత కాంబినేషన్ మ్యాజిక్ రిపీట్
ఈ సినిమాను నిలబెట్టింది మాత్రం నటీనటుల పర్ఫార్మెన్స్ అనే చెప్పాలి. 'హేరా ఫేరి' కాంబినేషన్ అయిన అక్షయ్ కుమార్, పరేష్ రావల్, సునీల్ శెట్టి, రాజ్‌పాల్ యాదవ్‌ల మధ్య కెమిస్ట్రీ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. అర్షద్ వార్సి పాత్ర నిడివి తక్కువే అయినా ఉన్నంతలో నవ్వించాడు. బడి బీ పాత్రలో ఫరిదా జలాల్, మురాద్ చాచాగా కిరణ్ కుమార్ అద్భుతమైన కామెడీ టైమింగ్ ప్రదర్శించారు.
చాలా కాలం తర్వాత అక్షయ్ కుమార్ సరసన కనిపించిన రవీనా టాండన్ తన సీనియారిటీని నిరూపించుకున్నారు. ఒక సీన్‌లో అక్షయ్, రవీనా మధ్య వచ్చే డైలాగులు వారి పాత వింటేజ్ కెమిస్ట్రీని గుర్తుచేస్తాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో పూర్తి స్థాయి సినిమా వస్తే బాగుంటుంది అనే భావన ప్రేక్షకుల్లో కలుగుతుంది.
ఫైనల్‌గా చెప్పాలంటే.. క్లైమాక్స్ కాస్త సాగదీసినట్లు అనిపించినప్పటికీ, వీకెండ్‌లో సరదాగా నవ్వుకోవడానికి 'వెల్‌కమ్ టు ది జంగిల్' ఒక మంచి ఆప్షన్ అవుతుంది.
రేటింగ్: 3/5
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


