రాత్రిపూట ఆలస్యంగా తింటున్నారా? మీ కాలేయం ప్రమాదంలో పడ్డట్లే.. డాక్టర్ మాట ఇది

రాత్రి ఆలస్యంగా తినే అలవాటు కాలేయ ఆరోగ్యంపై, జీవక్రియలపై తీవ్ర ప్రభావం చూపుతుందని సికింద్రాబాద్ యశోద హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, హెపటాలజిస్ట్ డాక్టర్ డి. చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరిస్తున్నారు. హెచ్‌టీ తెలుగు (HT Telugu) పాఠకుల కోసం ప్రత్యేకంగా అందించిన విశ్లేషణ.

Published on: Oct 23, 2026, 16:49:48 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

మారుతున్న జీవనశైలి, బిజీ ఉద్యోగాలు, నైట్ షిఫ్ట్‌ల కారణంగా చాలామందికి రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయడం లేదా పడుకునే ముందు ఏదో ఒకటి తినడం అలవాటుగా మారింది. అప్పుడప్పుడు ఆలస్యంగా తింటే పర్వాలేదు కానీ, రోజూ పడుకునే సమయానికి తింటే శరీర జీవక్రియలు (Metabolism) దెబ్బతిని కాలేయ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని ప్రముఖ వైద్యులు హెచ్చరిస్తున్నారు.

సీనియర్ కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, హెపటాలజిస్ట్ డాక్టర్ డి. చంద్రశేఖర్ రెడ్డి
సీనియర్ కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, హెపటాలజిస్ట్ డాక్టర్ డి. చంద్రశేఖర్ రెడ్డి

కాలేయంపై ఆలస్యపు భోజనం ప్రభావం

మనం తినే ఆహారంలోని పోషకాలను ప్రాసెస్ చేయడం, రక్తంలో చక్కెర (గ్లూకోజ్) స్థాయిలను నియంత్రించడం, కొవ్వును నిల్వ చేయడం, ఉపయోగించడం వంటి కీలక బాధ్యతలను కాలేయం (Liver) నిర్వహిస్తుంది. మన శరీరంలో సహజంగా ఉండే జీవ గడియారం (Circadian Rhythm) ఆధారంగా ఈ ప్రక్రియలన్నీ నడుస్తాయి.

శరీరం విశ్రాంతి తీసుకోవాల్సిన రాత్రి వేళల్లో ఆహారం తీసుకోవడం వల్ల గ్లూకోజ్, కొవ్వులను ప్రాసెస్ చేసే వేగం తగ్గిపోతుంది. తరచూ రాత్రివేళల్లో ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారం తింటే బరువు పెరగడం, ఇన్సులిన్ నిరోధకత (Insulin Resistance) ఏర్పడటంతో పాటు కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది. అయితే కేవలం తినే సమయమే కాకుండా, మనం తీసుకునే ఆహార నాణ్యత, పరిమాణం, శారీరక శ్రమ, నిద్ర విధానాలు కూడా కాలేయ ఆరోగ్యాన్ని నిర్దేశిస్తాయి.

ఫ్యాటీ లివర్, గ్యాస్ సమస్యల ముప్పు

కాలేయంలో అధికంగా కొవ్వు చేరడాన్ని 'ఫ్యాటీ లివర్' (MASLD) అంటారు. ఊబకాయం, టైప్-2 మధుమేహం, ఇన్సులిన్ నిరోధకత ఉన్నవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. రాత్రివేళల్లో అమితంగా భోజనం చేయడం వల్ల క్యాలరీలు పెరిగి జీవక్రియ సమస్యలు వస్తాయి. కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం ఎక్కువైతే వాపు వచ్చి లివర్ దెబ్బతింటుంది. ముదిరితే 'సిర్రోసిస్' (Cirrhosis) అనే ప్రమాదకర పరిస్థితికి దారితీస్తుంది. కొన్ని తీవ్ర సందర్భాల్లో ఇది లివర్ క్యాన్సర్‌కు కూడా కారణమవుతుంది. అంతేకాకుండా రాత్రి ఆలస్యంగా తినడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్ (GERD), కడుపులో మంట, అజీర్తి వంటి సమస్యలు వస్తాయి.

ఎవరు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి?

జీవక్రియ సంబంధిత సమస్యలు ఉన్నవారు ఆహార నియమావళిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

అధిక బరువు ఉన్నవారు: శరీరంలో కొవ్వు శాతం ఎక్కువ ఉంటే కాలేయంలోనూ కొవ్వు చేరే ప్రమాదం పెరుగుతుంది.

టైప్-2 మధుమేహ బాధితులు: ఇన్సులిన్ నిరోధకత వల్ల గ్లూకోజ్, కొవ్వులను ప్రాసెస్ చేయడం శరీరానికి కష్టమవుతుంది.

శారీరక శ్రమ లేనివారు: వ్యాయామం చేయకపోవడం వల్ల బరువు పెరిగి జీవక్రియలు మందగిస్తాయి.

నైట్ షిఫ్ట్ ఉద్యోగులు: వేళాపాళ లేని నిద్ర, భోజనం వల్ల శరీర సహజ జీవ గడియారం దెబ్బతింటుంది.

ప్రాసెస్డ్ ఫుడ్స్ తినేవారు: స్వీట్లు, వేపుళ్లు, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువ తింటే క్యాలరీలు పెరిగి ప్రమాదం పొంచి ఉంటుంది.

కాలేయాన్ని ఎలా కాపాడుకోవాలి?

కొన్ని చిన్న మార్పులతో కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

ముందే డిన్నర్ పూర్తి చేయండి: పడుకోవడానికి కనీసం 2-3 గంటల ముందే రాత్రి భోజనం పూర్తి చేయడం మంచిది.

సమతుల్యాహారం: రోజూ తినే ఆహారంలో కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, ప్రొటీన్లు ఉండేలా చూసుకోవాలి.

హెవీ ఫుడ్ వద్దు: పడుకునే ముందు నూనె పదార్థాలు, క్యాలరీలు ఎక్కువ ఉన్న ఆహారం తింటే అజీర్తి, ఎసిడిటీ వస్తాయి.

వ్యాయామం: క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల బరువు అదుపులో ఉండి జీవక్రియలు సరిగ్గా సాగుతాయి.

మద్యపానానికి దూరం: మద్యం, చక్కెర పానీయాలు ఎక్కువ తీసుకుంటే కాలేయం త్వరగా పాడవుతుంది.

అప్పుడప్పుడు రాత్రిపూట తిన్నంత మాత్రాన కాలేయం పాడైపోదు. భయపడాల్సిన పనిలేదు. అయితే సిర్రోసిస్ వంటి తీవ్ర కాలేయ సమస్యలు ఉన్నవారు ఆహార వేళలు మార్చే ముందు తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించాలి.

వ్యాసకర్త:

డాక్టర్ డి. చంద్రశేఖర్ రెడ్డి

సీనియర్ కన్సల్టెంట్,

గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, హెపటాలజిస్ట్ అండ్ థెరప్యూటిక్ ఎండోస్కోపిస్ట్,

యశోద హాస్పిటల్స్

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More