...
...
Next Story

దీర్ఘకాలిక దగ్గును నిర్లక్ష్యం చేయవద్దు: ఊపిరితిత్తుల సమస్యలపై వైద్యుల హెచ్చరిక

దీర్ఘకాలిక దగ్గును సాధారణ అలెర్జీ లేదా వాతావరణ మార్పుగా భావించి సొంత వైద్యం చేసుకోవడం తీవ్ర ముప్పు తెచ్చిపెడుతుందని హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మోనాలజిస్ట్ డాక్టర్ కె. యుగవీర్ గౌడ్ స్పష్టం చేస్తున్నారు. ఈ కథనంలో ఆయన అందించిన కీలక సూచనలు.

Published on: Sep 24, 2026, 17:01:50 IST
Advertisement

మారుతున్న వాతావరణం, అలర్జీలు లేదా ఇన్ఫెక్షన్ల వల్ల వచ్చే దగ్గును చాలామంది చిన్న సమస్యగానే పరిగణిస్తారు. అయితే, వారాల తరబడి వేధించే దీర్ఘకాలిక దగ్గు (Chronic Cough) వెనుక అనేక రకాల శ్వాసకోశ సమస్యలు ఉండే అవకాశముంది. లక్షణాలు ఒకేలా అనిపించినప్పటికీ, వ్యాధి తీవ్రత వేర్వేరుగా ఉండవచ్చు. సరైన కారణాన్ని గుర్తించకుండా అంచనాలతో సొంత వైద్యం చేసుకోవడం వల్ల అసలు జబ్బు తీవ్రమై, ప్రాణాల మీదికి తెచ్చే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఒకే దగ్గు.. వేర్వేరు కారణాలు

దీర్ఘకాలిక దగ్గును నిర్లక్ష్యం చేయవద్దు: ఊపిరితిత్తుల సమస్యలపై వైద్యుల హెచ్చరిక
దీర్ఘకాలిక దగ్గును నిర్లక్ష్యం చేయవద్దు: ఊపిరితిత్తుల సమస్యలపై వైద్యుల హెచ్చరిక

ఊపిరితిత్తులు, శ్వాసనాళాల సమస్యల వల్ల మాత్రమే కాకుండా, శరీరంలోని ఇతర భాగాల్లో తలెత్తే అనారోగ్యాల వల్ల కూడా దగ్గు రావచ్చు.

ఆస్తమా (Asthma): దగ్గుతో పాటు పిల్లికూతలు (Wheezing), ఛాతీలో బిగుతుగా ఉండటం, ఆయాసం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రాత్రి వేళల్లో లేదా నిర్దిష్ట పరిస్థితుల్లో ఈ సమస్య మరింత ఎక్కువవుతుంది.

సిఓపిడి (COPD): నిరంతరం తగ్గని దగ్గు, కఫం పడటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండటం సీవోపీడీ సంకేతం. ముఖ్యంగా పొగతాగే అలవాటు ఉన్నవారిలో, కాలుష్యానికి గురయ్యేవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.

బ్రోంకియెక్టాసిస్ (Bronchiectasis): శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు పదేపదే రావడం, ఎక్కువ మొత్తంలో కఫంతో కూడిన దీర్ఘకాలిక దగ్గు ఉండటం దీని ముఖ్య లక్షణం.

శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు: వైరల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు తగ్గిన తర్వాత కూడా కొన్ని వారాల పాటు దగ్గు కొనసాగవచ్చు.

సిడ్ రిఫ్లక్స్ (GERD): కడుపులోని యాసిడ్ తిరోగమనం చెంది అన్నవాహిక ద్వారా గొంతులోకి చేరినప్పుడు కూడా దగ్గు వస్తుంది. చాలామందికి గుండెల్లో మంట లేకపోయినా ఈ రకమైన దగ్గు రావచ్చు.

పోస్ట్-నాసల్ డ్రిప్: ముక్కు లేదా సైసస్ భాగాల నుంచి శ్లేష్మం గొంతులోకి కారడం వల్ల కూడా నిరంతరం దగ్గు వస్తుంటుంది.

సొంత వైద్యం ఎందుకు ప్రమాదకరం?

వైద్యులు రోగి దగ్గు తీవ్రత, అది ఎంతకాలంగా ఉందో పరిశీలిస్తారు. అలాగే ధూమపానం, కాలుష్యానికి గురికావడం వంటి అంశాలను, ఇతర అనారోగ్య చరిత్రను సమీక్షించిన తర్వాతే ఎక్స్-రే, సిటీ స్కాన్ లేదా లంగ్ ఫంక్షన్ టెస్ట్‌లు (PFT) అవసరమో లేదో నిర్ధారిస్తారు.

వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి?

క్రింది లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా నిపుణులైన పల్మోనాలజిస్ట్‌ను సంప్రదించాలి.

  • దగ్గు సుదీర్ఘకాలం పాటు మానకుండా ఉండటం లేదా పదేపదే రావడం
  • దగ్గుతో పాటు ఆయాసం, పిల్లికూతలు ఉండటం
  • విపరీతంగా లేదా నిరంతరం కఫం రావడం
  • ఛాతీ నొప్పితో పాటు అకస్మాత్తుగా బరువు తగ్గిపోవడం
  • దగ్గుతున్నప్పుడు రక్తం పడటం
  • నిద్రకు లేదా రోజువారీ పనులకు తీవ్ర అంతరాయం కలగడం
  • సాధారణ చికిత్సలు తీసుకున్నా దగ్గు తగ్గకపోవడం

కాబట్టి దీర్ఘకాలిక దగ్గును అలెర్జీ లేదా అసిడిటీగా సొంతంగా నిర్ధారించుకోకూడదు. సరైన సమయంలో స్పందించి డాక్టర్‌ను సంప్రదిస్తే ముందస్తుగా వ్యాధిని గుర్తించి, తగిన చికిత్స ద్వారా సమస్యను త్వరగా నయం చేసుకోవచ్చు.

రచయిత పరిచయం:

ఈ విశ్లేషణాత్మక వ్యాసాన్ని డాక్టర్ కె. యుగవీర్ గౌడ్ అందించారు. ఆయన హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్స్‌లో కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మోనాలజిస్ట్‌గా (Consultant Interventional Pulmonologist, Yashoda Hospitals) సేవలందిస్తున్నారు.

డాక్టర్ కె. యుగవీర్ గౌడ్
 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

SHARE THIS ARTICLE ON