దగ్గు సిరప్‌లపై కేంద్రం కొరడా: డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే అమ్మకాలు
దేశంలో దగ్గు సిరప్‌ల విక్రయాలపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఆంక్షలు విధించింది. డ్రగ్స్ రూల్స్ నిబంధనలలో మార్పులు చేస్తూ, సిరప్‌లను ఓటీసీ (OTC) జాబితా నుండి తొలగించింది. ఇకపై డాక్టర్ రాసిన చీటీ ఉంటేనే మెడికల్ షాపులు వీటిని విక్రయించాల్సి ఉంటుంది.
వైద్యుడి ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాపుల్లో నేరుగా దగ్గు సిరప్‌లు కొనుగోలు చేసే రోజులకు కేంద్ర ప్రభుత్వం ముగింపు పలికింది. ఇకపై ఎలాంటి సిరప్ ఆధారిత మందులనైనా కొనుగోలు చేయాలంటే డాక్టర్ రాసిన చీటీ తప్పనిసరిగా ఉండాల్సిందే. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 'డ్రగ్స్ (ఐదవ సవరణ) నిబంధనలు, 2026'ను నోటిఫై చేసింది. డ్రగ్స్ రూల్స్, 1945లోని 'షెడ్యూల్ కె' మినహాయింపుల జాబితా నుండి 'సిరప్స్'ను తొలగిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.

డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్, 1940లోని సెక్షన్లు 12, 33 ప్రకారం లభించిన అధికారాలను ఉపయోగించి కేంద్ర ప్రభుత్వం ఈ సవరణలు చేసింది. ఈ కొత్త నిబంధనలు అధికారిక గెజెట్‌లో ప్రచురితమైన తేదీ నుండి అమలులోకి వస్తాయి. డ్రగ్స్ రూల్స్, 1945లోని షెడ్యూల్ కె లోని ఐటమ్ నంబర్ 7 (క్లాస్ ఆఫ్ డ్రగ్స్) నుండి 'సిరప్స్' అనే పదాన్ని తొలగించారు. ఇప్పటివరకు ఈ షెడ్యూల్ కింద ఉన్న మందుల తయారీ, విక్రయాలు, పంపిణీకి కొన్ని ప్రత్యేక నిబంధనల నుండి మినహాయింపులు ఉండేవి. తాజా సవరణతో దగ్గు సిరప్‌లు ఓవర్-ది-కౌంటర్ (OTC) మందుల హోదాను కోల్పోయాయి.
ఐదేళ్ల లోపు పిల్లలకు మరింత ప్రమాదం
కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసిన 'నేషనల్ ఫార్ములరీ ఆఫ్ ఇండియా (NFI) 2026' ముసాయిదా ప్రకారం, రెండేళ్ల లోపు పిల్లలకు దగ్గు, జలుబు మందులను ఎట్టి పరిస్థితుల్లోనూ సిఫార్సు చేయకూడదని, మెడికల్ షాపుల వారు ఇవ్వకూడదని స్పష్టం చేశారు. ఐదేళ్ల లోపు పిల్లలకు కూడా అత్యవసర వైద్య పరిస్థితి ఉంటే తప్ప, ఇలాంటి మందులను వాడకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ వాడినా వైద్యుల పర్యవేక్షణలోనే వాటిని ఉపయోగించాలని నిరంతరం పర్యవేక్షించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
ప్రాణాలు తీసిన కల్తీ సిరప్‌లు: రంగంలోకి ఎన్‌హెచ్ఆర్‌సీ
గత ఏడాది అక్టోబర్‌లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో కల్తీ దగ్గు సిరప్ తాగి పలువురు చిన్నారులు మరణించినట్లు వార్తలు వచ్చాయి. మధ్యప్రదేశ్‌లో 12 మంది, రాజస్థాన్‌లో మరికొందరు పిల్లలు ప్రాణాలు కోల్పోవడంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) తీవ్రంగా స్పందించింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ఆరోగ్య శాఖకు, నియంత్రణ సంస్థలకు నోటీసులు జారీ చేసి తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించింది.
"చిన్నారుల మరణాలు ఔషధాల భద్రత, నియంత్రణ, పర్యవేక్షణలో ఉన్న తీవ్రమైన లోపాలను స్పష్టం చేస్తున్నాయి. ఇది ప్రజల జీవించే హక్కును, ఆరోగ్య హక్కును ఉల్లంఘించడమే" అని జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) పేర్కంది.
మానవ హక్కుల పరిరక్షణ చట్టం, 19 93 నిబంధనల ప్రకారం ఎన్‌హెచ్ఆర్‌సీ సభ్యుడు ప్రియాంక్ కానూంగో నేతృత్వంలోని బెంచ్ ఈ విచారణకు ఆదేశించింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలు తక్షణమే విచారణ జరిపించాలని ఆదేశించారు. అనుమానాస్పద దగ్గు సిరప్ శాంపిల్స్ సేకరించి పరీక్షించాలని, నకిలీ లేదా నాణ్యత లేని మందుల అమ్మకాలను అడ్డుకోవడానికి కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం సిరప్‌ల విక్రయాలపై కఠినమైన నిబంధనలు తీసుకువచ్చింది.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


