డయాబెటిస్ బాధితుల్లో గుండెపోటు ముప్పు: నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం

డయాబెటిస్ కేవలం రక్తంలో చక్కెర స్థాయిలకే పరిమితం కాదు.. ఇది గుండె ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. షుగర్ నియంత్రణలో లేకపోతే రక్తనాళాలు దెబ్బతిని హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటి సమస్యలకు దారితీస్తుందని మణిపాల్ హాస్పిటల్స్ కార్డియాలజీ విభాగం కన్సల్టెంట్ డాక్టర్ ఎన్. మురళీకృష్ణ వివరించారు.

Published on: Feb 3, 2026, 12:53:00 IST
By , Vijayawada
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

డయాబెటిస్‌కు, గుండె జబ్బులకు మధ్య విడదీయలేని సంబంధం ఉంది. షుగర్ ఉన్నవారిలో సాధారణ వ్యక్తులతో పోలిస్తే గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం చాలా ఎక్కువ. రక్తంలో చక్కెర స్థాయిలు నిరంతరం ఎక్కువగా ఉండటం వల్ల గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాలు, ఆ పనితీరును నియంత్రించే నరాలు క్రమంగా బలహీనపడతాయి.

షుగర్ నియంత్రణలో లేకపోతే రక్తనాళాలు దెబ్బతిని హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటి సమస్యలకు దారితీస్తుంది
షుగర్ నియంత్రణలో లేకపోతే రక్తనాళాలు దెబ్బతిని హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటి సమస్యలకు దారితీస్తుంది

గుండెపై డయాబెటిస్ ప్రభావం ఎలా ఉంటుంది?

రక్తనాళాల్లో అడ్డంకులు: రక్తంలో అధిక చక్కెర వల్ల రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ త్వరగా పేరుకుపోతుంది. దీనివల్ల ధమనులు ఇరుకుగా మారి రక్తం సరఫరా తగ్గుతుంది. ఫలితంగా హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

ఇన్సులిన్ రెసిస్టెన్స్: టైప్-2 డయాబెటిస్ ఉన్నవారిలో ఇన్సులిన్ సరిగా పని చేయదు. దీనివల్ల శరీరంలో వాపు (Inflammation) పెరిగి రక్తనాళాల ఫ్లెక్సిబిలిటీ తగ్గుతుంది.

అదనపు ముప్పులు: డయాబెటిస్ ఉన్నవారికి సాధారణంగా బీపీ, అధిక బరువు, కొలెస్ట్రాల్ సమస్యలు కూడా తోడవుతాయి. ఇవన్నీ కలిసి గుండెపై అదనపు భారాన్ని మోపుతాయి.

ముందస్తు సంకేతాలను గుర్తించండి డయాబెటిస్ ఉన్నవారు చిన్నపాటి మార్పులను కూడా గమనిస్తూ ఉండాలి. ముఖ్యంగా:

  • కారణం లేకుండా విపరీతమైన అలసట రావడం.
  • నడుస్తున్నప్పుడు లేదా పని చేస్తున్నప్పుడు ఛాతిలో నొప్పి.
  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం.
  • కాళ్లలో వాపు రావడం. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే కార్డియాలజిస్ట్‌ను సంప్రదించాలి.

రక్షణ మార్గాలు

ఇవి పాటిస్తే గుండె పదిలం డయాబెటిస్ ఉన్నప్పటికీ కొన్ని జాగ్రత్తలతో గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

షుగర్ నియంత్రణ: రక్తంలో చక్కెర స్థాయిలను డాక్టర్ సూచించిన పరిమితిలో ఉంచుకోవాలి.

క్రమం తప్పని వ్యాయామం: ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల నడక లేదా వ్యాయామం గుండెకు బలాన్నిస్తుంది.

ఆరోగ్యకరమైన ఆహారం: పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి, ఉప్పు, తీపి తగ్గించాలి.

పొగతాగడం వద్దు: ధూమపానం వల్ల రక్తనాళాలు త్వరగా మూసుకుపోతాయి, కాబట్టి దీనికి దూరంగా ఉండాలి.

నిద్ర, ఒత్తిడి: సరిపడా నిద్ర (7-8 గంటలు) లేకపోవడం వల్ల షుగర్ స్థాయిలు పెరుగుతాయి. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకుని ప్రశాంతంగా ఉండాలి.

సరైన సమయంలో చికిత్స, క్రమబద్ధమైన జీవనశైలిని పాటిస్తే డయాబెటిస్ బాధితులు కూడా సాధారణ వ్యక్తుల్లాగే ఆరోగ్యంగా, చురుగ్గా జీవించవచ్చు.

- డాక్టర్ ఎన్. మురళీకృష్ణ,

కన్సల్టెంట్, కార్డియాలజీ విభాగం

మణిపాల్ హాస్పిటల్స్, విజయవాడ

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More