నెయ్యితో భోజనం, షుగర్ టీ ఆరోగ్యానికి డేంజరే.. 25 ఏళ్ల అనుభవం గల డాక్టర్ హెచ్చరిక
దక్షిణాసియా ప్రాంతంలో గుండె జబ్బులు, మెటబాలిక్ రుగ్మతలు తక్కువ వయసులోనే రావడానికి గల కారణాలను డాక్టర్ ముబిన్ సయ్యద్ వివరించారు. ముఖ్యంగా అధికంగా నెయ్యితో చేసిన ఆహారాలు, చక్కెర అధికంగా ఉన్న టీ, తెల్ల బియ్యం, శారీరక శ్రమ లేకపోవడం వంటి అలవాట్లపై ఆయన హెచ్చరించారు.
25 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న వాస్కులర్, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్, న్యూరోరేడియాలజిస్ట్ అయిన డాక్టర్ ముబిన్ సయ్యద్, డిసెంబర్ 7న తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ప్రజలు విస్మరించకూడని 5 ముఖ్యమైన ఆరోగ్య సూత్రాలను పంచుకున్నారు.
నెయ్యితో భోజనం, షుగర్ టీ ఆరోగ్యానికి డేంజరే.. 25 ఏళ్ల అనుభవం గల డాక్టర్ హెచ్చరిక
1. తెల్ల బియ్యంతో ప్రమాదమే
“తెల్ల బియ్యంలో అధిక కార్బొహైడ్రేట్లు ఉంటాయి. పూర్వీకులు పొలాల్లో శ్రమించడం ద్వారా వారికి ముప్పు తప్పింది. కానీ మీరు ఫైబర్, ప్రొటీన్ లేని శుద్ధి చేసిన పిండి పదార్థాన్ని (refined starch) తింటున్నారు. శారీరక శ్రమ లేదు. ఈ కారణంగా చక్కెర స్థాయిలు పెరగడం అనేది ఊహించదగిన పరిణామమే.. ఈ అలవాటు మంచిది కాదు” అని డాక్టర్ సయ్యద్ హెచ్చరించారు.
2. రాత్రి భోజనం తర్వాత నడక ఎందుకంత ముఖ్యం?
“రాత్రి భోజనం తర్వాత 15 నిమిషాల నడక చాలా ముఖ్యం. మీకు ఇన్సులిన్ నిరోధకత ఉంటే, నడక ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చని చెప్పారు. భోజనం తర్వాత కదలిక ఎంత ముఖ్యమో ఆయన నొక్కి చెప్పారు.
3. సన్నగా ఉన్నంత మాత్రాన ఆరోగ్యంగా ఉన్నట్లా?
“‘నేను అధిక బరువు లేను’ అంటే సురక్షితంగా ఉన్నట్లు కాదు. మీరు సన్నగా కనిపించినా, కాలేయంలో కొవ్వు, వాపు పేరుకుపోవచ్చు. సన్నగా ఉన్నప్పటికీ శారీరక శ్రమ, కదలిక చాలా అవసరమని డాక్టర్ సూచించారు.
4. తరాల అలవాట్లను ఎలా బ్రేక్ చేయాలి?
“తరతరాలుగా వస్తున్న అలవాట్లను పునరావృతం చేస్తూ ఆరోగ్య సమస్యల చక్రం నుంచి బయటపడలేరు. అధిక నెయ్యితో కూడిన భోజనాలు, అధిక చక్కెరతో కూడిన టీ, కాఫీలు మీకు చేటు చేస్తాయి. రోజువారీ ఆహారాన్ని జాగ్రత్తగా ఎంచుకోవాలని అని ఆయన గట్టిగా కోరారు.
5. చాయ్ తాగితే హైడ్రేషన్ అయినట్టా?
“చాయ్ అనేది హైడ్రేషన్ కోసం ఎంచుకునే పానీయం కాదు. సోడా, లస్సీ కూడా హైడ్రేషన్ ఇవ్వవు. ఇవన్నీ మీ కిడ్నీలకు భారంగా మారుతాయి. హైడ్రేషన్ కోసం నీరు బాగా తీసుకోవడం ముఖ్యం” అని డాక్టర్ సయ్యద్ సూచించారు.
(గమనిక: ఈ కథనం కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే.. ఇది వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఏదైనా వైద్య సమస్యకు సంబంధించి మీ డాక్టర్‌ను సంప్రదించడం ఉత్తమం. ఈ సమాచారం సోషల్ మీడియాలో యూజర్ పంచుకున్న కంటెంట్ ఆధారంగా రూపొందించింది. ఇందులో పేర్కొన్న విషయాలను హిందుస్తాన్ టైమ్స్ స్వతంత్రంగా ధృవీకరించలేదు.)