వయసు పెరుగుతున్న కొద్దీ మతిమరుపు, డిమెన్షియా, అల్జీమర్స్ వంటి సమస్యల గురించి చాలామందిలో ఆందోళన పెరుగుతోంది. అల్జీమర్స్‌ను పూర్తిగా నివారించే మార్గం ఇప్పటివరకు లేకపోయినా, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు జ్ఞాపకశక్తి తగ్గే ప్రమాదాన్ని కూడా గణనీయంగా తగ్గించవచ్చని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. దీనిపై విజయవాడ మణిపాల్ హాస్పిటల్, న్యూరాలజీ కన్సల్టెంట్ డాక్టర్ మురళి వివరాలు వెల్లడించారు.

వ్యాయామం కేవలం శరీరాన్ని ఫిట్‌గా ఉంచడానికే కాదు, మెదడుకూ ఎంతో మేలు చేస్తుంది. వ్యాయామం వల్ల మెదడుకు రక్తప్రసరణ మెరుగుపడుతుంది. దీంతో మెదడుకు అవసరమైన ఆక్సిజన్, పోషకాలు సక్రమంగా అందుతాయి. అంతేకాదు, మెదడులో కొత్త కణాలు ఏర్పడటానికి కూడా ఇది సహాయపడుతుంది. నరాల కణాలను రక్షించి, మెదడులోని వివిధ భాగాల మధ్య సమాచార మార్పిడిని మెరుగుపరిచే కొన్ని ప్రత్యేక ప్రోటీన్ల ఉత్పత్తిని కూడా వ్యాయామం ప్రోత్సహిస్తుంది. ఇవన్నీ చురుగ్గా నేర్చుకునే సామర్థ్యానికి, జ్ఞాపకశక్తికి చాలా అవసరం.
జీవితాంతం శారీరకంగా చురుకుగా ఉండే వారిలో అల్జీమర్స్, డిమెన్షియా వంటి సమస్యలు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాదు, జన్యుపరంగా అల్జీమర్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నవారిలో కూడా, వ్యాయామం వల్ల అల్జీమర్స్ లక్షణాలు ఆలస్యంగా కనిపించేలా చేయడంలో సహాయపడవచ్చు.
వ్యాయామం ఇంత ప్రభావవంతంగా ఉండటానికి మరో ముఖ్య కారణం, డిమెన్షియాకు దారితీసే అనేక ప్రమాద కారకాలను ఇది నియంత్రించడమే. వ్యాయామం వల్ల బీపీ, రక్తంలో షుగర్ లెవెల్స్ , కొలెస్ట్రాల్, అధిక బరువు (ఊబకాయం) నియంత్రణలో ఉంటాయి. శరీరంలో వాపు సమస్యలు కూడా తగ్గుతాయి. అలాగే మంచి నిద్రకు సహాయపడటంతో పాటు ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్‌ను తగ్గిస్తుంది. ఇవన్నీ దీర్ఘకాలంలో మెదడు పనితీరుపై ప్రభావం చూపే అంశాలే.
ఈ ప్రయోజనాల కోసం మారథాన్లు పరిగెత్తాల్సిన అవసరం లేదు. వారానికి కనీసం 150 నిమిషాలు ఒక మోస్తరు స్థాయిలో వ్యాయామం చేస్తే సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. వేగంగా నడవడం, సైక్లింగ్, ఈత, డ్యాన్స్, గార్డెనింగ్ వంటి కార్యకలాపాలు కూడా మెదడు ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. వీటితో పాటు వారానికి రెండు నుంచి మూడు సార్లు కండరాల బలం పెంచే వ్యాయామాలు, బ్యాలెన్స్, ఫ్లెక్సిబిలిటీ మెరుగుపరిచే వ్యాయామాలు చేయడం ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి దోహదపడుతుంది.
{{/usCountry}}ఈ ప్రయోజనాల కోసం మారథాన్లు పరిగెత్తాల్సిన అవసరం లేదు. వారానికి కనీసం 150 నిమిషాలు ఒక మోస్తరు స్థాయిలో వ్యాయామం చేస్తే సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. వేగంగా నడవడం, సైక్లింగ్, ఈత, డ్యాన్స్, గార్డెనింగ్ వంటి కార్యకలాపాలు కూడా మెదడు ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. వీటితో పాటు వారానికి రెండు నుంచి మూడు సార్లు కండరాల బలం పెంచే వ్యాయామాలు, బ్యాలెన్స్, ఫ్లెక్సిబిలిటీ మెరుగుపరిచే వ్యాయామాలు చేయడం ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి దోహదపడుతుంది.
{{/usCountry}}వ్యాయామంతో పాటు మరికొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను కూడా పాటించడం చాలా ముఖ్యం. పోషకాలతో నిండిన సమతులాహారం తీసుకోవడం, తగినంత నిద్రపోవడం, పజిల్స్ వంటి మెదడుకు వ్యాయామం ఇచ్చే పనులు చేయడం, కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి మెలిసి ఉండడం, రెగ్యులర్ హెల్త్ చెకప్‌లు చేయించుకోవడం వంటి అంశాలు మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి.
వ్యాయామం అల్జీమర్స్‌ను పూర్తిగా అడ్డుకోలేకపోయినా, వయసు పెరిగే కొద్దీ మెదడు పనితీరుని మెరుగుపరచడంలో, జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రమాదాన్ని తగ్గించడంలో అత్యంత ప్రభావవంతమైన లైఫ్‍స్టైల్ మార్పుల్లో ఇది ఒకటి. చిన్న వయసు నుంచే వ్యాయామం మొదలుపెడితే మంచిది. అయితే ఇంగ్లీషులో చెప్పినట్టు, బెటర్ లేట్ దెన్ నెవర్... ఏ వయసులో ప్రారంభించినా ఆలస్యం కాదు. ఈరోజు మీరు వేసే ప్రతి అడుగు, భవిష్యత్తులో ఆరోగ్యకరమైన మెదడు కోసం మీరు పెట్టే పెట్టుబడిగా అనుకోవచ్చు.
డాక్టర్ మురళి, న్యూరాలజీ కన్సల్టెంట్
విజయవాడ మణిపాల్ హాస్పిటల్