కిడ్నీ వ్యాధిగ్రస్తులా? ‘హెల్దీ ఫుడ్స్’ విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి

కిడ్నీ జబ్బులు ఉన్నవారికి సాధారణ ఆరోగ్యకరమైన ఆహార నియమాలు అన్ని వేళలా సరిపోవు. పొటాషియం, ఫాస్ఫరస్, సోడియం, ప్రొటీన్ల పరిమితులపై యశోద హాస్పిటల్స్ సీనియర్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ దిలీప్ ఎం. బాబు అందించిన విలువైన సూచనలు ఇవే.

Published on: Oct 1, 2026, 14:27:05 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి (సీకేడీ) ఉన్నవారు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే సాధారణ ప్రజలకు ఆరోగ్యకరంగా భావించే ప్రతీ ఆహార పదార్థం కిడ్నీ బాధితులకు అదే పరిమాణంలో సరిపోకపోవచ్చు. కిడ్నీల పనితీరు తగ్గుతున్న కొద్దీ శరీరంలో పేరుకుపోయే అదనపు సోడియం, పొటాషియం, ఫాస్ఫరస్‌లను బయటకు పంపడం కష్టమవుతుంది. ఈ నేపథ్యంలో ఏ ఆహారం ఎంత పరిమాణంలో తీసుకోవాలో తెలుసుకోండి.

కిడ్నీ వ్యాధిగ్రస్తులా? ‘హెల్దీ ఫుడ్స్’ విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి
కిడ్నీ వ్యాధిగ్రస్తులా? ‘హెల్దీ ఫుడ్స్’ విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి
  • పండ్లు, కూరగాయలు, నట్స్, డైరీ ఉత్పత్తులు, తృణధాన్యాలు పోషకాలతో నిండినవే అయినప్పటికీ, వీటిలో కొన్నింటిలో పొటాషియం లేదా ఫాస్ఫరస్ స్థాయులు ఎక్కువగా ఉంటాయి.
  • అరటిపండ్లు, నారింజ, బంగాళాదుంపలు, టమోటాలు, పాలకూరల్లో పొటాషియం అధికంగా ఉంటుంది.
  • పాలు, పిండి పదార్థాలు, నట్స్, కొన్ని రకాల తృణధాన్యాల్లో ఫాస్ఫరస్ ఎక్కువ మొత్తంలో లభిస్తుంది.
  • నట్స్, విత్తనాలు శరీరానికి మంచి కొవ్వులు, ప్రొటీన్లు అందించినప్పటికీ, ఫాస్ఫరస్, పొటాషియం స్థాయులను బట్టి వీటిని పరిమితంగానే తీసుకోవాలి.
  • ప్రాసెస్ చేసిన ఆహారాలలో ఫాస్ఫేట్ అడిటివ్స్, అధిక పరిమాణంలో సోడియం ఉంటాయి.

అయితే సీకేడీ బాధితులందరూ ఈ ఆహారాలను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని, రక్త పరీక్షల నివేదికలు, వ్యక్తిగత అవసరాల ఆధారంగానే వీటిపై నిపుణులు ఆంక్షలు విధిస్తారు.

ప్రొటీన్ పరిమాణంపై ప్రత్యేక దృష్టి

కండరాల బలానికి, కణజాల మరమ్మతుకు ప్రొటీన్ చాలా అవసరం. అయితే అధిక పరిమాణంలో, ముఖ్యంగా జంతు సంబంధిత ప్రొటీన్లు తీసుకోవడం వల్ల కిడ్నీలపై భారం పెరుగుతుంది. అలాగని ప్రొటీన్‌ను పూర్తిగా తగ్గించేస్తే కండరాల క్షీణత, బలహీనత ఏర్పడతాయి. అందుకే ప్రొటీన్ ఆహారాన్ని సమతుల్యంగా తీసుకోవాలి. చేపలు, కోడి మాంసం, కోడిగుడ్డు తెల్లసొన, సోయా ఉత్పత్తులు (టోఫు), చిక్కుళ్ళు వంటి వృక్ష సంబంధిత ప్రొటీన్లను తగిన పరిమాణంలో ఎంచుకోవచ్చు. డయాలసిస్ పొందుతున్న పేషెంట్లకు ప్రొటీన్ అవసరాలు వేరుగా ఉంటాయి.

సోడియం, ద్రవాహార నియమాలు

అధిక సోడియం (ఉప్పు) వల్ల శరీరంలో నీరు చేరి, రక్తపోటు పెరుగుతుంది. ఇది కిడ్నీలపై అదనపు ఒత్తిడిని తెస్తుంది. ప్యాక్ చేసిన ఆహారాలు, ఇన్‌స్టంట్ నూడుల్స్, క్యాన్డ్ సూప్‌లు, ఊరగాయలు, ఉప్పు స్నాక్స్, రెస్టారెంట్ భోజనాలలో సోడియం ఎక్కువగా ఉంటుంది. వంటల్లో ఉప్పు తగ్గించి వెల్లుల్లి, నిమ్మరసం, మూలికలు (హెర్బ్స్) వాడటం మంచిది.

అలాగే వ్యాధి ప్రారంభ దశలో ఉన్నవారికి నీరు, ద్రవాహార పరిమితులు అవసరం లేకపోవచ్చు. కానీ వ్యాధి ముదిరిన కొద్దీ శరీరంలో వాపులు రావడం, మూత్రం పరిమాణం తగ్గడం వంటి సమస్యలు ఉంటే ద్రవాల వినియోగాన్ని నియంత్రించాలి. నీరు, సూప్‌లు, ఐస్, గది ఉష్ణోగ్రత వద్ద ద్రవంగా మారే పదార్థాలన్నీ ద్రవాహారం కిందకే వస్తాయి.

వ్యక్తిగత ఆహార ప్రణాళికే కీలకం

కిడ్నీ బాధితులందరికీ ఒకే రకమైన డైట్ సరిపోదు. మధుమేహం, రక్తపోటు, డయాలసిస్ పొందుతున్న తీరు ఆధారంగా ఆహార నియమాలు మారుతుంటాయి. ఆరోగ్యకరమైన ప్రతి ఆహారాన్ని పూర్తిగా పక్కన పెట్టడం లక్ష్యం కాదని, వ్యాధి ఏ దశలో ఉంది, ఏ ఆహారం ఎంత పరిమాణంలో తీసుకోవాలో తెలుసుకోవడమే కీలకం.

వ్యాసకర్త:

డాక్టర్ దిలీప్ ఎం. బాబు,

సీనియర్ కన్సల్టెంట్,

నెఫ్రాలజిస్ట్ అండ్ ట్రాన్స్‌ప్లాంట్ ఫిజిషియన్

యశోద హాస్పిటల్స్, హైదరాబాద్‌

డాక్టర్ దిలీప్ ఎం. బాబు
డాక్టర్ దిలీప్ ఎం. బాబు
  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More