పండుగ వేళ అప్పులు.. ఖర్చుకు, పొదుపునకు సమతూకం ఎలా?

పండుగల సీజన్‌లో గృహోపకరణాలు, వాహనాల కొనుగోలుకు రుణాల వినియోగం భారీగా పెరుగుతోంది. సెప్టెంబర్ 2026 నాటికి దేశ రిటైల్ రుణ మార్కెట్ రూ.185.2 లక్షల కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో క్రెడిట్ స్కోర్ కాపాడుకుంటూ బాధ్యతాయుతంగా అప్పులు ఎలా తీసుకోవాలో క్రిఫ్ నిపుణులు విశ్లేషించారు.

Published on: Nov 24, 2026, 08:36:34 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

భారతీయ కుటుంబాల్లో పండుగల సీజన్ అంటే కేవలం వేడుకలు మాత్రమే కాదు, పెద్ద ఎత్తున కొనుగోళ్లకు శుభముహూర్తం. ఇంటి ఆధునికీకరణ (హోమ్ రెనోవేషన్), కొత్త గృహోపకరణాల కొనుగోలు, వాహనాలు ఇంటికి తెచ్చుకోవడం వంటి కీలక నిర్ణయాలన్నీ పండుగల చుట్టే తిరుగుతాయి. అయితే, ఈ ఆశయాలను నెరవేర్చుకునే క్రమంలో భారతీయ కుటుంబాలు డబ్బు, అప్పుల గురించి ఆలోచించే తీరులో వేగంగా మార్పు వస్తోంది. గతంతో పోలిస్తే అధికారిక రుణ వ్యవస్థ (ఫార్మల్ క్రెడిట్) ఇప్పుడు సామాన్యులకు మరింత చేరువైంది. బ్యాంకు రుణాలు, క్రెడిట్ కార్డుల సాయంతో ప్రజలు తమ భారీ ఖర్చులను పక్కా ప్రణాళికతో ఆర్థిక నిర్ణయాలుగా మలుచుకుంటున్నారు.

పండుగ వేళ అప్పులు.. ఖర్చుకు, పొదుపునకు సమతూకం ఎలా?
పండుగ వేళ అప్పులు.. ఖర్చుకు, పొదుపునకు సమతూకం ఎలా?

ఈ పరిణామాలపై 'క్రిఫ్' (CRIF) ఇండియా, దక్షిణాసియా రీజినల్ మేనేజింగ్ డైరెక్టర్ సచిన్ సేథ్ కీలక విశ్లేషణ చేశారు. తాజా గణాంకాల ప్రకారం.. సెప్టెంబర్ 2026 నాటికి భారత రిటైల్ రుణ మార్కెట్ రూ.185.2 లక్షల కోట్లకు చేరుకుంది. వార్షిక ప్రాతిపదికన ఇది 18.8 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ వృద్ధిలో బంగారం రుణాలు 60.6 శాతం విస్తరణతో అగ్రస్థానంలో నిలవగా, కన్స్యూమర్ డ్యూరబుల్ రుణాలు 44.5 శాతం, వాహన రుణాలు 18.2 శాతం చొప్పున పెరిగాయి. ఇక మొత్తం రిటైల్ రుణ పోర్ట్‌ఫోలియోలో 25.1 శాతం వాటాతో గృహ రుణాలు అతిపెద్ద విభాగంగా కొనసాగుతున్నాయి.

రుణాల కూర్పు చెబుతున్న వాస్తవాలివే..

కేవలం అంకెల వృద్ధి మాత్రమే కాకుండా, ప్రజలు తీసుకుంటున్న రుణాల స్వభావం భారత క్రెడిట్ మార్కెట్ పరిణామ క్రమాన్ని స్పష్టం చేస్తోంది. బంగారం రుణాలు, ఇతర తనఖా ఆధారిత (సెక్యూర్డ్) రుణాలు భారీగా పెరగడం వల్ల ఆస్తుల హామీతో తీసుకునే అప్పులకు ఇప్పటికీ ఉన్న ప్రాధాన్యం తెలుస్తోంది. మరోవైపు గృహోపకరణాలు, వాహనాలు, ఇతర వినియోగ ఆధారిత విభాగాల్లో రుణాలు పెరగడం చూస్తుంటే, కుటుంబాల విభిన్న అవసరాలను తీర్చడంలో అధికారిక రుణ సంస్థల పాత్ర ఎంతగా విస్తరించిందో అర్థమవుతుంది.

అయితే, రుణాలు సులభంగా దొరుకుతున్న కొద్దీ వాటిని ప్రజలు ఎలా వినియోగిస్తున్నారన్నదే అసలైన ప్రశ్న. ఉదాహరణకు పండుగ వేళ ఇంటికి కొత్త రూపు తీసుకురావాలని ఎవరైనా భావిస్తే, ఆర్థిక ప్రణాళిక అనేది రుణం ఎంచుకోవడానికి లేదా క్రెడిట్ కార్డు స్వైప్ చేయడానికి చాలా ముందే ప్రారంభం కావాలి. సాధారణంగా 750 లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉండటాన్ని బలమైన స్థితిగా పరిగణిస్తారు. రుణ సంస్థల నిబంధనలను బట్టి, మెరుగైన క్రెడిట్ స్కోర్ ఉంటే తక్కువ వడ్డీ రేట్లు, అనుకూలమైన నిబంధనలతో రుణం లభించే అవకాశం ఉంటుంది. ఇంటి మరమ్మతులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, వాహనాల వంటి భారీ కొనుగోళ్ల విషయంలో మెరుగైన క్రెడిట్ ఆరోగ్యం రుణ అర్హతను, దానిపై అయ్యే ఖర్చును నిర్దేశిస్తుంది.

ఆకర్షణీయ ఆఫర్ల మాయలో పడొద్దు

భారీ పండుగ ఖర్చులకు సిద్ధమయ్యే ముందే ప్రతి ఒక్కరూ తమ క్రెడిట్ రిపోర్టును క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. ఇప్పటికే ఉన్న రుణాలు, తిరిగి చెల్లింపుల చరిత్ర (రీపేమెంట్ హిస్టరీ), క్రెడిట్ కార్డు వినియోగం, మొత్తం అప్పుల వివరాలను చూసుకుంటే, కొత్తగా ఎంతవరకు భారం మోయగలమో ఒక అంచనా వస్తుంది. పండుగల సీజన్‌లో ఆకర్షణీయమైన డిస్కౌంట్ ఆఫర్లు, తక్షణ రుణ ఆమోదాలు (ఇన్‌స్టంట్ అప్రూవల్స్), సులభమైన వాయిదాలు (ఈఎంఐలు) ప్రతి వస్తువునూ అందుబాటు ధరలోనే ఉన్నట్లు భ్రమ కల్పిస్తాయి.

కానీ, కొత్తగా కట్టబోయే ఒక నెల ఈఎంఐని మాత్రమే విడిగా చూసి నిర్ణయం తీసుకోకూడదు. ఇప్పటికే ఉన్న రుణ వాయిదాలు, క్రెడిట్ కార్డు బకాయిలు, సాధారణ ఇంటి ఖర్చులు, రాబోయే ఆదాయంతో ఆ కొత్త ఈఎంఐని పోల్చి చూసుకోవాలి. "అప్పులకు పూర్తిగా దూరంగా ఉండటం లక్ష్యం కాదు; రేపటి ఆర్థిక వెసులుబాటుకు ఆటంకం కలగకుండా రుణాలను వాడుకోవడమే అసలైన విజ్ఞత. బాధ్యతాయుతంగా వాడుకుంటే పొదుపు మొత్తాన్ని కరిగించకుండానే కుటుంబ అవసరాలను, ఆశయాలను రుణాలు నెరవేరుస్తాయి" అని సచిన్ సేథ్ పేర్కొన్నారు. నేటి సౌకర్యం రేపటి ఆర్థిక స్వేచ్ఛను హరించకుండా చూసుకోవడమే ఇక్కడి అసలు సవాలు.

కొత్త రుణగ్రహీతలకు క్రమశిక్షణే శ్రీరామరక్ష

ప్రస్తుతం చాలామంది వినియోగదారులు ఒకేసారి పలు క్రెడిట్ కార్డులు, వేర్వేరు రుణాలను నిర్వహిస్తున్నారు. అందుకే కొత్త లోన్ కోసం దరఖాస్తు చేసినప్పుడు మాత్రమే కాకుండా, క్రమం తప్పకుండా క్రెడిట్ ఆరోగ్యాన్ని తనిఖీ చేసుకోవడం ఒక అలవాటుగా మార్చుకోవాలి. చెల్లించాల్సిన బకాయిలు, వాయిదాల గడువు తేదీలు, క్రెడిట్ వినియోగ పరిమితిని ఎప్పటికప్పుడు గమనిస్తుంటే ఆర్థిక ఒత్తిడిని ముందే పసిగట్టవచ్చు. తొలిసారి అప్పు తీసుకునే వారికి ఈ క్రమశిక్షణ మరింత అవసరం. మొదటి రుణం మీ క్రెడిట్ ప్రొఫైల్‌కు పునాది వేస్తుంది. దానిని సకాలంలో చెల్లిస్తేనే భవిష్యత్తులో ఇతర ఆర్థిక అవసరాలకు తలుపులు తెరుచుకుంటాయి.

పండుగ ముగిసిన తర్వాత కూడా ఆర్థిక బాధ్యత కొనసాగుతుంది. భారీ ఖర్చుల తర్వాత కుటుంబాలు తమ మిగులు బకాయిలను సమీక్షించుకుని, సకాలంలో చెల్లించడానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. క్రెడిట్ కార్డు బిల్లులు పెరిగిపోతే, వాటిని క్రమంగా తగ్గించుకుంటూ వస్తే తిరిగి ఆర్థిక వెసులుబాటు దక్కుతుంది. అలా కాకుండా పాత బకాయిలను కట్టడానికి మళ్లీ కొత్త అప్పులు చేస్తే ఆర్థిక భారం మరింత పెరిగిపోతుంది.

పెరుగుతున్న క్రమశిక్షణ.. బలపడుతున్న వ్యవస్థ

భారత రుణ మార్కెట్ వృద్ధిలో మరో సానుకూల కోణం కూడా కనిపిస్తోంది. అధికారిక రుణాలు సామాన్యులకు విస్తృతంగా అందుబాటులోకి వచ్చినంత మాత్రాన రుణ నాణ్యత దెబ్బతినాల్సిన అవసరం లేదని గణాంకాలు నిరూపిస్తున్నాయి. పలు ప్రధాన వినియోగ రుణ విభాగాల్లో మొండిబకాయిలు (డెలింక్వెన్సీ) స్థిరంగా ఉండటం లేదా మరింత తగ్గడం గమనార్హం. రిటైల్ రుణ మార్కెట్ విస్తరణతో పాటు వినియోగదారుల్లో తిరిగి చెల్లింపుల క్రమశిక్షణ, రుణ సంస్థల్లో ఆధునిక రిస్క్ మదింపు విధానాలు బలపడుతున్నాయని ఇది స్పష్టం చేస్తోంది.

రుణ సంస్థలు తమ సేవలను విస్తరిస్తూనే, బాధ్యతాయుతమైన మదింపు (అండర్‌రైటింగ్), వినియోగదారుల ఆర్థిక స్థితిగతులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. మరోవైపు వినియోగదారులు సౌకర్యంతో పాటు తమ మొత్తం ఆర్థిక బాధ్యతలపై స్పష్టమైన అవగాహనతో మెలగాలి. అప్పుడే రుణ లభ్యతకు, బాధ్యతాయుత రుణ వితరణకు మధ్య సమతూకం దెబ్బతినకుండా మార్కెట్ విస్తరిస్తుంది.

బలమైన ఆర్థిక గుర్తింపు దిశగా..

భారత రిటైల్ రుణ వృద్ధి తదుపరి దశ అనేది, విస్తృత రుణ లభ్యతను శాశ్వత ఆర్థిక బలంగా ఎంత సమర్థంగా మార్చుకున్నామన్న దానిపైనే ఆధారపడి ఉంటుంది. మెరుగైన డేటా విశ్లేషణ, క్రమం తప్పని క్రెడిట్ తనిఖీలు, సందర్భోచిత రుణ నిర్ణయాల వల్ల వినియోగదారులు కేవలం అవసరానికి అప్పు చేసే స్థాయి నుంచి అవగాహనతో రుణాలను వాడుకునే స్థాయికి ఎదుగుతారు. పండుగ రుణాలు ఇంటి మరమ్మతులు, వాహన కొనుగోళ్ల వంటి నేటి ఆశయాలకు ఊతమిస్తాయి. అయితే, ఆ తర్వాత వాటిని ఎంత బాధ్యతాయుతంగా నిర్వహిస్తామన్నదే అత్యంత కీలకం.

"బలమైన క్రెడిట్ ప్రొఫైల్ కొత్త అవకాశాలను సృష్టిస్తుంది. క్రమశిక్షణతో కూడిన రుణ వినియోగం దానిని కాపాడుతుంది. సకాలంలో వాయిదాలు చెల్లించడం భవిష్యత్తులో దానిని మరింత బలోపేతం చేస్తుంది" అని సచిన్ సేథ్ స్పష్టం చేశారు. రుణ లభ్యత, ఆర్థిక అవగాహన, చెల్లింపుల క్రమశిక్షణ కలిసి ముందుకు సాగినప్పుడు అప్పు అనేది కేవలం ఖర్చులకు సాధనంగా మిగిలిపోదు. అది కుటుంబ ఆర్థిక పునాదులను బలోపేతం చేసి, పరిణతి చెందిన రిటైల్ రుణ వ్యవస్థకు, విశ్వసనీయ ఆర్థిక గుర్తింపునకు బాటలు వేస్తుంది.

ABOUT THE AUTHOR

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.