భారత్‌లో తదుపరి రుణ విప్లవం: తొలిసారి రుణాలు తీసుకునేవారే కీలకం

భారతదేశ బ్యాంకింగ్ రంగంలో తదుపరి రుణ వృద్ధి తొలిసారి రుణాలు తీసుకునే వారితోనే సాధ్యమని సీఆర్‌ఐఎఫ్ నివేదిక స్పష్టం చేస్తోంది. సాంకేతికత ఆధారిత ప్రత్యామ్నాయ డేటాతో వీరిని ఆదుకోవడం రుణ సంస్థలకు అత్యంత అవసరం. CRIF ఇండియా, దక్షిణ ఆసియా ప్రాంతీయ మేనేజింగ్ డైరెక్టర్ సచిన్ సేథ్ అందిస్తున్న విశ్లేషణ.

Published on: Jul 28, 2026, 11:58:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దేశీయ ఆర్థిక వ్యవస్థలో ఇటీవల కాలంలో రిటైల్ రుణాలు, చిన్న వ్యాపార (MSME) రుణాలు వేగంగా పెరుగుతున్నాయి. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు కూడా తమ రుణ పోర్ట్‌ఫోలియోను పెంచుకోవడంపైనే ప్రధానంగా దృష్టి సారించాయి. అయితే, దేశీయ జీడీపీలో గృహ రుణాల వాటా కేవలం 41-42 శాతంగానే ఉండిపోయింది. అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న ఇతర దేశాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ పరిమాణం. ఆర్థిక వ్యవస్థలోని మొత్తం రుణ డిమాండ్ బయటకు వస్తోందా లేక కేవలం సులభంగా అంచనా వేయగల విభాగాలకే రుణాలు పరిమితమవుతున్నాయా అనే ప్రశ్నకు ఇవి సంకేతంగా నిలుస్తున్నాయి.

భారత్‌లో తదుపరి రుణ విప్లవం: తొలిసారి రుణాలు తీసుకునేవారే కీలకం
భారత్‌లో తదుపరి రుణ విప్లవం: తొలిసారి రుణాలు తీసుకునేవారే కీలకం

పాత పద్ధతులపైనే ఆధారపడటం సరికాదు

సీఆర్‌ఐఎఫ్ హై మార్క్ (CRIF High Mark) తాజా నివేదిక ప్రకారం, భారతదేశంలో రిటైల్ రుణాలు ఏటా 14 శాతం వృద్ధి నమోదు చేస్తున్నాయి. అయితే, ఆర్థిక సంస్థలు ఇప్పటికీ స్థిరమైన జీతం, సరైన ఆదాయ ఆధారాలు, మెరుగైన క్రెడిట్ హిస్టరీ ఉన్న పాత కస్టమర్లకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. రుణ ఉత్పత్తుల డిజైన్, ఆవిష్కరణలు కూడా వీరి చుట్టూనే తిరుగుతున్నాయి.

ప్రస్తుతం ఇస్తున్న కొత్త రుణాల్లో కేవలం 17.8 శాతం మాత్రమే తొలిసారి రుణాలు తీసుకునేవారికి (First-time borrowers) దక్కుతున్నాయి. మన దేశంలో జెన్ జీ (Gen Z), జెన్ ఆల్ఫా (Gen Alpha) జనాభా ప్రపంచంలోనే అత్యధికంగా ఉంది. అయినప్పటికీ, కొత్తగా రుణాలందుకుంటున్న వారిలో వీరి వాటా 41 శాతానికే పరిమితమైంది. ఇంటి నుంచే వ్యాపారాలు చేసే మహిళలు, స్వయం ఉపాధి పొందుతున్న చిన్న వ్యాపారులు, డిజిటల్ వ్యవస్థలో భాగమైన నిరుద్యోగులు ఇంకా బ్యాంకింగ్ రుణ వ్యవస్థకు దూరంగానే ఉన్నారు.

క్రెడిట్ హిస్టరీ లేకపోవడంతో వీరంతా స్థానిక వడ్డీ వ్యాపారులు, బంధువులపైనే ఆధారపడుతున్నారు. సంపాదన, చెల్లించే సామర్థ్యం ఉన్నప్పటికీ, సాంప్రదాయ రికార్డులు లేకపోవడంతో ఆర్థిక సంస్థలు వీరిని 'థిన్-ఫైల్' లేదా 'న్యూ టూ క్రెడిట్' వర్గంలోనే ఉంచుతున్నాయి.

డిజిటల్ ఆధారాలతో మారుతున్న చిత్రం

సాంప్రదాయ క్రెడిట్ స్కోర్లు, పాత రికార్డులు మాత్రమే కాకుండా రుణగ్రహీతల ప్రస్తుత ఆర్థిక ప్రవర్తనను సరిగ్గా అర్థం చేసుకోవాల్సిన సమయం వచ్చింది. భారత్‌లో శరవేగంగా విస్తరించిన డిజిటల్ విప్లవం ఇందుకు కొత్త మార్గాలు చూపుతోంది.

స్మార్ట్‌ఫోన్ల వాడకం, డిజిటల్ చెల్లింపులు, ఈ-కామర్స్, జీఎస్టీ, ఈ-ఇన్‌వాయిసింగ్, అకౌంట్ అగ్రిగేటర్ల ద్వారా చిన్న వ్యాపారులు, వ్యక్తుల ఆర్థిక లావాదేవీలకు సంబంధించి విలువైన డేటా రూపొందుతోంది. గతంలో బ్యాంకింగ్ పరిధిలో లేనివారు కూడా ఇప్పుడు డిజిటల్ ఆధారాలు (Digital Footprints) కలిగి ఉంటున్నారు. పాత రికార్డులపైనే ఆధారపడకుండా, వీరి రోజువారీ వ్యాపార లావాదేవీలు, క్యాష్ ఫ్లో ఆధారంగా రుణాలు మంజూరు చేసే అవకాశాలు మెరుగయ్యాయి.

భవిష్యత్తు బ్యాంకింగ్‌లో నూతన శకం

రాబోయే రోజుల్లో రుణ వృద్ధి కేవలం నగరాలు, పాత కస్టమర్లకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాలు, చిన్న రంగాలు, కొత్త కస్టమర్ల వైపు వేగంగా విస్తరించనుంది. ఫైనాన్షియల్ సంస్థలు తమ రిస్క్ అసెస్‌మెంట్ (Risk Assessment) పద్ధతులను మార్చుకోవాల్సిన అవసరం పెరిగింది.

సాంకేతికత, డేటా అనలిటిక్స్ ద్వారా కస్టమర్ల నిజమైన రుణ అర్హతను, తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని అంచనా వేయవచ్చు. సంప్రదాయ రికార్డులు లేవనే కారణంతో పక్కన పెట్టకుండా, అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ డేటా ఆధారంగా కొత్త ప్రాసెస్ (Underwriting) అందుబాటులోకి తీసుకురావాలి. ఈ మార్పులను వేగంగా పుణికిపుచ్చుకునే బ్యాంకింగ్ సంస్థలే భవిష్యత్తు మార్కెట్‌లో వృద్ధి అవకాశాలను అందుకోగలుగుతాయి.

వ్యాసకర్త:

సచిన్ సేథ్,

రీజనల్ మేనేజింగ్ డైరెక్టర్,

CRIF ఇండియా, దక్షిణ ఆసియా

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More