Credit score tips : క్రెడిట్​ స్కోర్ ఎలా పెంచుకోవాలి? మిలీనియల్స్, జెన్​-జీలు.. ఇది మీకోసమే!

How to improve credit score : నేటి కాలంలో పర్సనల్ లోన్, హోమ్ లోన్ లేదా క్రెడిట్ కార్డ్ పొందడానికి మంచి క్రెడిట్ స్కోర్ ఎంతో ముఖ్యం. ముఖ్యంగా మిలీనియల్స్, జెన్-జీ యువత తక్కువ వడ్డీకే రుణాలు పొందేందుకు, తమ క్రెడిట్ స్కోర్‌ను ఎలా పెంచుకోవాలో ఈ కథనంలో చూడండి..

Published on: Jun 7, 2026, 09:09:00 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మనం జీవిస్తున్న ఈ ఆధునిక కాలంలో తీసుకునే ప్రతి ఆర్థిక నిర్ణయం మన కుటుంబాల భవిష్యత్తును నిర్దేశిస్తుంది. ఒక్క చిన్న నిర్ణయం కూడా మన దీర్ఘకాలిక ఆర్థిక అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే నేడు పర్సనల్ ఫైనాన్స్ ప్లానింగ్‌లో క్రెడిట్ హెల్త్ (ఆర్థిక క్రమశిక్షణ) అనేది ఒక బలమైన స్తంభంగా నిలిచింది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్న యువత, కొత్తగా అప్పులు తీసుకునేవారు, వ్యాపారవేత్తలు, ఇన్వెస్టర్లకు బలమైన క్రెడిట్ స్కోర్, క్లీన్ క్రెడిట్ ప్రొఫైల్ కలిగి ఉండటం అనేది కేవలం తక్కువ వడ్డీకి రుణాలు పొందడానికి మాత్రమే పరిమితం కాలేదు. అది ఒక వ్యక్తి ఆర్థిక స్థిరత్వాన్ని, క్రెడిట్ అర్హతను, వారి నమ్మకత్వాన్ని ప్రతిబింబించే కొలమానంగా మారింది.

మిలీనియల్స, జెన్​-జీలు.. ఇది మీకోసమే!
మిలీనియల్స, జెన్​-జీలు.. ఇది మీకోసమే!

మంచి క్రెడిట్ స్కోర్ ఉండటం వల్ల బ్యాంకుల నుంచి మెరుగైన ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చు. ఇది భవిష్యత్తులో సంపదను సృష్టించుకోవడానికి ఒక బలమైన పునాదిగా ఉపయోగపడటమే కాకుండా, అప్పు తీసుకునే ప్రక్రియను మరింత సులభతరం చేస్తుంది.

"భారతీయ యువతకు, క్రెడిట్ (రుణం) వినియోగానికి మధ్య ఉన్న సంబంధంలో ఇప్పుడు ఒక గొప్ప మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు అప్పును కేవలం అవసరానికి తీసుకునే సాధనంగా మాత్రమే చూసేవారు. కానీ నేడు దానిని మొత్తం ఆర్థిక ఆరోగ్యానికి ఒక ముఖ్యమైన సూచికగా గుర్తిస్తున్నారు. మిలీనియల్స్ సొంత ఇల్లు, దీర్ఘకాలిక సంపద సృష్టి వంటి తమ జీవిత లక్ష్యాలను సాధించడానికి క్రెడిట్ ప్రొఫైల్‌ను చురుగ్గా బలోపేతం చేసుకుంటున్నారు. మరోవైపు జెన్-జీ వయసు వారు తమ ఆర్థిక ప్రయాణంలో చాలా ముందుగానే క్రెడిట్ స్కోర్‌పై అవగాహన పెంచుకుంటున్నారు," అని ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ ఒలివ్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ రోహిత్ గార్గ్ వివరించారు.

ఆయన మాట్లాడుతూ.. "క్రెడిట్ హెల్త్‌పై చూపిస్తున్న ఈ ఆసక్తి, యువతలో పెరిగిన ఆర్థిక అవగాహనకు నిదర్శనం. ట్రాన్స్‌యూనియన్ సిబిల్ నివేదిక ప్రకారం.. భారతదేశంలో సుమారు 18.3 కోట్ల మంది ప్రజలు తమ క్రెడిట్ స్కోర్‌లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇందులో జెన్-జీ యువత వాటానే దాదాపు 29 శాతంగా ఉంది! ఈ గణాంకాలను చూస్తే, నేటి యువత తమ క్రెడిట్ స్కోర్‌ను క్రమంగా ట్రాక్ చేస్తూ, మెరుగుపరుచుకుంటూ తమ ఆర్థిక భవిష్యత్తుపై ఎంత బాధ్యతగా ఉంటున్నారో అర్థమవుతుంది. ఆర్థిక ఉత్పత్తులు డిజిటల్‌గా మారి సులభంగా అందుబాటులోకి వస్తున్న తరుణంలో, బలమైన క్రెడిట్ స్కోర్ అనేది కేవలం అప్పు కోసం మాత్రమే కాదు.. భవిష్యత్తులో వచ్చే మరిన్ని అవకాశాలకు, ఆర్థిక వెసులుబాటుకు ఒక బలమైన పునాదిగా మారుతోంది," అని పేర్కొన్నారు.

క్రెడిట్ అవగాహన ఎందుకు ముఖ్యం?

ఈ పరిణామాలు మిలీనియల్స్, జెన్-జీ యువతలో క్రెడిట్‌పై పెరుగుతున్న అవగాహనను స్పష్టంగా చూపిస్తున్నాయి. భవిష్యత్తులో పర్సనల్ లోన్, హోమ్ లోన్, క్రెడిట్ కార్డ్ లేదా మరేదైనా రుణం తీసుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ మంచి క్రెడిట్ స్కోర్ నిర్వహించడం చాలా అవసరం. సాధారణంగా 750 కంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉండటం వల్ల బ్యాంకులు మీ ప్రొఫైల్‌ను ఉత్తమమైనదిగా గుర్తిస్తాయి.

క్రెడిట్ మార్కెట్​లోకి అడుగుపెడుతున్న యువత, అప్పులకు సంబంధించిన నిబంధనలు, పద్ధతులను సులభంగా అర్థం చేసుకుని, తమ క్రెడిట్ స్కోర్‌ను వేగంగా పెంచుకోవడానికి ఉపయోగపడే 5 ప్రాక్టికల్ చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.

క్రెడిట్ స్కోర్‌ను పెంచుకునే 5 సులువైన మార్గాలు..

1. బిల్లులు, ఈఎంఐలు సకాలంలో చెల్లించండి

మీరు లోన్ తీసుకోవాలని ఆలోచిస్తుంటే, మొదట మీ రీపేమెంట్ ప్లాన్ (తిరిగి చెల్లించే విధానం) స్పష్టంగా ఉండాలి. మీ పాత ఈఎంఐలు, క్రెడిట్ కార్డ్ బిల్లులు వంటి వాటిని గడువు తేదీ కంటే ముందే చెల్లించేలా చూసుకోండి. మీ క్రెడిట్ స్కోర్‌ను నేరుగా ప్రభావితం చేసే అత్యంత కీలకమైన అంశం ఇదే. చిన్న పొరపాటు జరిగినా లేదా ఒక్కసారి బిల్లు చెల్లింపు ఆలస్యమైనా అది మీ స్కోర్‌ను దెబ్బతీస్తుంది.

2. క్రెడిట్ వినియోగాన్ని తక్కువగా ఉంచండి

మీకు అందుబాటులో ఉన్న క్రెడిట్ పరిమితిని పూర్తిగా వాడేయకండి. దీనివల్ల మీకు అప్పులపై అతిగా ఆధారపడే అలవాటు లేదని బ్యాంకులకు నమ్మకం కుదురుతుంది, తద్వారా స్కోర్ పెరుగుతుంది. మీకు అనుమతించిన మొత్తం క్రెడిట్ పరిమితిలో 30 శాతం కంటే తక్కువ మాత్రమే వాడటం మంచిది. ఉదాహరణకు, మీ క్రెడిట్ కార్డ్ పరిమితి రూ. 50,000 ఉంటే, అందులో రూ. 15,000 కంటే ఎక్కువ వాడకపోవడం ఉత్తమం.

3. క్రెడిట్ రిపోర్టును క్రమంగా తనిఖీ చేయండి

మీరు పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డ్ లేదా హోమ్ లోన్ వంటివి వాడుతున్నప్పుడు, మీ క్రెడిట్ రిపోర్టును క్రమం తప్పకుండా పరిశీలించే అలవాటు చేసుకోండి. దీనివల్ల మీ ప్రొఫైల్‌లో దొర్లిన తప్పులను లేదా లోపాలను సకాలంలో గుర్తించి, అధికారులకు ఫిర్యాదు చేయడం ద్వారా వాటిని సరిదిద్దుకోవచ్చు. ఇది మీ క్రెడిట్ స్కోర్ పడిపోకుండా కాపాడుతుంది.

4. అన్ని రకాల రుణాల సమతుల్యత క్రెడిట్ మిక్స్) పాటించండి

మీ క్రెడిట్ ప్రొఫైల్‌లో సెక్యూర్డ్ లోన్స్ (ఇంటి రుణాలు, వాహన రుణాలు), అన్‌సెక్యూర్డ్ లోన్స్ (పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్స్) సరైన నిష్పత్తిలో ఉండటం మంచిది. వీటిని బాధ్యతాయుతంగా నిర్వహిస్తూ, కచ్చితమైన రీపేమెంట్ హిస్టరీని చూపిస్తే, భవిష్యత్తులో బ్యాంకులు మిమ్మల్ని సులభంగా నమ్ముతాయి. అలాగే తక్కువ వడ్డీకే సులభమైన నిబంధనలతో రుణాలు అందిస్తాయి.

5. పదే పదే లోన్ అప్లికేషన్లు పెట్టకండి

తక్కువ సమయంలో ఎక్కువ లోన్లు లేదా క్రెడిట్ కార్డుల కోసం దరఖాస్తులు చేయవద్దు. మీరు ప్రతిసారీ లోన్ కోసం అప్లై చేసినప్పుడు బ్యాంకులు మీ క్రెడిట్ ప్రొఫైల్‌ను తీవ్రంగా పరిశీలిస్తాయి. ఇలా పదే పదే హార్డ్ చెక్స్ జరగడం వల్ల మీ క్రెడిట్ స్కోర్ తాత్కాలికంగా తగ్గుతుంది. కాబట్టి ఇలాంటి పొరపాట్లకు దూరంగా ఉంటూ, రుణాలు తీసుకోవడంలో, తిరిగి చెల్లించడంలో క్రమశిక్షణను ప్రదర్శించండి.

యువత ఆర్థిక ప్రణాళికలపై తమ అవగాహనను పెంచుకుంటున్న కొద్దీ.. క్రెడిట్ హెల్త్ అనేది కేవలం తాత్కాలిక అవసరంలా కాకుండా, ఒక దీర్ఘకాలిక ఆస్తిగా మారుతోంది. అందుకే ఈ రోజు నుంచే బలమైన క్రెడిట్ స్కోర్‌ను నిర్మించుకోవడం వల్ల రేపటి రోజున మెరుగైన ఆర్థిక అవకాశాలు లభిస్తాయి. ఇది యువ వినియోగదారులు మరింత నమ్మకంతో, ఆర్థిక స్థిరత్వంతో తమ కలలను నిజం చేసుకోవడానికి సహాయపడుతుంది.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైన్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఫైనాన్షియల్​ ప్లానింగ్ కోసం సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్​ని సంప్రదించడం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More