హోమ్ లోన్ ప్లానింగ్: ఈఎంఐ (EMI) మీ నెలవారీ ఆదాయంలో 30% లోపే ఎందుకు ఉండాలి?
సొంత ఇల్లు కొనాలనే కల నిజం కావడానికి హోమ్ లోన్ చక్కని మార్గం. అయితే, బ్యాంకులు మనకు ఇచ్చే లోన్ అర్హత వేరు, మనం ప్రతి నెల సులభంగా కట్టగల సామర్థ్యం వేరు. నెలవారీ నికర ఆదాయంలో హోమ్ లోన్ ఈఎంఐ 30 శాతం లోపు ఉంటేనే భవిష్యత్తు ఆర్థిక లక్ష్యాలు దెబ్బతినకుండా ఉంటాయని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
సొంత గూడు అనేది ప్రతి ఒక్కరి జీవితకాల కల. ఈ కలను సాకారం చేసుకోవడానికి చాలా మంది హోమ్ లోన్‌లను ఆశ్రయిస్తారు. అయితే, సరైన ప్రణాళిక లేకుండా తీసుకునే హోమ్ లోన్ ఈఎంఐలు (EMIs) దీర్ఘకాలంలో పెద్ద ఆర్థిక భారంగా మారే ప్రమాదం ఉంది. అధిక ఈఎంఐల భారం మీ క్రెడిట్ స్కోర్‌ను దెబ్బతీయడమే కాకుండా, భవిష్యత్తు కోసం దాచుకునే పొదుపును కూడా కరిగించేస్తుంది.

సాధారణంగా బ్యాంకులు ఒక వ్యక్తి క్రెడిట్ హిస్టరీ, ప్రస్తుత క్రెడిట్ స్కోర్, గతంలో తీసుకున్న అప్పులను తిరిగి చెల్లించిన తీరు (Repayment Potential) ఆధారంగా హోమ్ లోన్‌లను అప్రూవ్ చేస్తాయి. కానీ, ఇక్కడే ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. బ్యాంకు మనకు గరిష్టంగా ఎంత లోన్ ఇస్తుందనేది ముఖ్యం కాదు, మన ఆర్థిక ఆరోగ్యం దెబ్బతినకుండా ప్రతి నెల ఎంత ఈఎంఐని సులభంగా కట్టగలమనేదే ముఖ్యం.
లోన్ అర్హత, భరించగల సామర్థ్యం ఒకటి కాదు
రుణాలు తీసుకోవడంలో పెద్దగా అనుభవం లేని వారు చేసే సాధారణ పొరపాటు ఏమిటంటే.. బ్యాంకు లోన్ అప్రూవ్ చేయగానే, ఆ లోన్ తాము భరించగలమని భావించడం. భారతీయ బ్యాంకులు మీ స్థూల ఆదాయంలో 50 నుంచి 55 శాతం వరకు కూడా లోన్ ఇవ్వడానికి సిద్ధపడతాయి. కానీ, దాన్ని గ్రీన్ సిగ్నల్‌గా భావించకూడదు.
"పర్సనల్ ఫైనాన్స్‌లో ఒక గోల్డెన్ రూల్ ఉంది. ప్రాపర్టీ వాల్యూలో 20% డౌన్ పేమెంట్ చేయాలి, అలాగే హోమ్ లోన్ ఈఎంఐని మీ నికర నెలవారీ ఆదాయంలో (Take-home income) 30-40% లోపు ఉంచుకోవాలి. ఈ నియమం తప్పు కాదు, కానీ ఇది అసంపూర్ణమైంది. ఇక్కడ మనం వేసుకోవాల్సిన అసలు ప్రశ్న - ఈఎంఐలు కట్టేసిన తర్వాత మీ చేతిలో ఎంత మిగులుతోంది?" అని మీరా మనీ (MIRA Money) ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ అనలిస్ట్ రోహన్ గోయల్ అని వివరించారు.
ఈఎంఐలు చెల్లించిన తర్వాత కూడా మీ ఆర్థిక పరిస్థితి సజావుగా సాగాలంటే ఈ క్రింది ప్రణాళిక ఉండాలని రోహన్ సూచించారు.
- మీ నెలవారీ ఆదాయంలో కనీసం 20-25% దీర్ఘకాలిక లక్ష్యాల కోసం పెట్టుబడి పెట్టాలి.
- కనీసం 6 నెలల ఖర్చులకు సరిపడా అత్యవసర నిధిని (Emergency Buffer) కలిగి ఉండాలి.
- ఇన్సూరెన్స్ ప్రీమియంలు, పిల్లల చదువులు, లైఫ్ స్టైల్ ఖర్చులకు ఎలాంటి ఇబ్బంది రాకూడదు.
ఈఎంఐ శాతాలు - మీ ఆర్థిక జోన్ ఏది?
మీ నెలవారీ ఆదాయంలో ఈఎంఐల శాతం ఆధారంగా మీ ఆర్థిక భద్రతను ఇలా అంచనా వేయవచ్చు.
30% లేదా అంతకంటే తక్కువ (Comfortable Zone): ఇది అత్యంత సురక్షితమైన జోన్. ఈ పరిమితిలో ఈఎంఐ ఉంటే పెట్టుబడులు పెట్టడానికి, అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి, మీ జీవనశైలికి తగినంత డబ్బు మిగులుతుంది.
30% - 40% (Manageable Zone): ఇది నిర్వహించదగినదే, కానీ పక్కా బడ్జెట్ క్రమశిక్షణ అవసరం అవుతుంది.
40% కంటే ఎక్కువ (Stress Zone): ఇది తీవ్రమైన ఒత్తిడితో కూడిన జోన్. మీ పొదుపు, భవిష్యత్తు ఆర్థిక లక్ష్యాలు పూర్తిగా దెబ్బతింటాయి.
ఆర్థిక ఆరోగ్యాన్ని కాపాడే సరైన ఈఎంఐ (ఉదాహరణ)
ఆర్థిక నిపుణుల ప్రకారం, మీ నెలవారీ నికర ఆదాయం రూ. 1,00,000 అనుకుంటే, మీ హోమ్ లోన్ ఈఎంఐ రూ. 25,000 నుంచి రూ. 30,000 (అంటే 25-30%) లోపు మాత్రమే ఉండాలి.
ఒకవేళ మీ ఈఎంఐ భారం పెరిగి, దాని కోసం మీరు మీ నెలవారీ ఎస్ఐపీలను (SIPs) ఆపేయాల్సి వచ్చినా లేదా టర్మ్ ఇన్సూరెన్స్‌ను స్కిప్ చేయాల్సి వచ్చినా.. మీరు మీ సామర్థ్యానికి మించి అప్పు తీసుకున్నారని అర్థం. కాబట్టి, బ్యాంకు ఎంత ఆఫర్ చేస్తుందనేది పక్కన పెట్టి, మీ జేబుకు ఏది సురక్షితమో అంత మాత్రమే అప్పు తీసుకోండి.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


