వంటకాలకు సరైన రుచిని అందించడంలోనే కాకుండా, శరీరానికి అత్యంత కీలకమైన అయోడిన్ నిల్వలను సమతుల్యంగా ఉంచడంలో ఉప్పు ప్రధాన పాత్ర పోషిస్తుంది. థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయడానికి, మెటబాలిజం (జీవక్రియ) సక్రమంగా సాగడానికి శరీరానికి తగినంత అయోడిన్ అవసరం. అయితే ప్రస్తుతం మార్కెట్లోకి వెళితే రకరకాల పేర్లతో అనేక రకాల ఉప్పులు దర్శనమిస్తున్నాయి.

సాధారణ తెల్ల ఉప్పు కంటే పింక్ సాల్ట్, సైంధవ లవణం, బ్లాక్ సాల్ట్ (నల్ల ఉప్పు) లలో ఖనిజాలు ఎక్కువగా ఉంటాయని, ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచివని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. అలా ఏది పడితే అది వాడితే మీ ఆరోగ్యానికి మేలు కంటే ముప్పే ఎక్కువ తెచ్చిపెడుతుందని హెచ్చరిస్తున్నారు హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ క్యాన్సర్ సర్జన్ డాక్టర్ అర్జున్ శంకరన్. మన శరీరానికి సరిపడా అయోడిన్ అందకపోతే గోయిటర్, థైరాయిడ్ సమస్యలు, జ్ఞాపకశక్తి మందగించడం, గర్భిణులలో కాంప్లికేషన్లు వచ్చే ప్రమాదముందని ఆయన స్పష్టం చేశారు.
తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఇటీవల పింక్ సాల్ట్ వాడకం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో, ఏ ఉప్పు ఎలా పనిచేస్తుందో డాక్టర్ అర్జున్ శంకరన్ వివరించిన సమగ్ర వివరాలు ఇవే..
1. సాధారణ తెల్ల ఉప్పు (వైట్ సాల్ట్) – బ్లీచింగ్ చేస్తారనేది నిజమేనా?
చాలామంది తెల్లటి ఉప్పును బ్లీచింగ్ చేసి తెల్లగా మారుస్తారని పొరబడుతుంటారు. దీనిపై స్పందించిన డాక్టర్ అర్జున్.. "సాధారణ ఉప్పు సహజంగానే తెల్లగా ఉంటుంది. దానికి ఎలాంటి కేమికల్ బ్లీచింగ్ చేయరు. భారతదేశంలో దొరికే ఉప్పులో సింహభాగం సముద్రపు నీటిని ఎండబెట్టి, శుభ్రం చేసి తయారుచేసే సీ సాల్ట్. భారతీయ చట్టాల ప్రకారం ఆహారం కోసం విక్రయించే ప్రతి తెల్ల ఉప్పులోనూ తప్పనిసరిగా అయోడిన్ కలపాలి. కాబట్టి రోజువారీ వంటలకు ఇది అత్యంత సురక్షితమైనది," అని స్పష్టం చేశారు.
2. పింక్ సాల్ట్, సైంధవ లవణం..
ఇటీవలి కాలంలో సోషల్ మీడియా ట్రెండ్స్ చూసి చాలా ఇళ్లలో సైంధవ లవణం లేదా పింక్ సాల్ట్‌ను రోజూ వంటల్లో వాడుతున్నారు.
{{/usCountry}}ఇటీవలి కాలంలో సోషల్ మీడియా ట్రెండ్స్ చూసి చాలా ఇళ్లలో సైంధవ లవణం లేదా పింక్ సాల్ట్‌ను రోజూ వంటల్లో వాడుతున్నారు.
{{/usCountry}}"పింక్ సాల్ట్, సైంధవ లవణం, నల్ల ఉప్పులన్నీ రాక్ సాల్ట్ రకాలు. వీటిలో ఉండే అదనపు ఖనిజాల శాతం అత్యంత స్వల్పం. దీనివల్ల శరీరానికి వచ్చే పెద్ద ప్రయోజనమేమీ ఉండదు. పైగా ఈ ఉప్పులలో అయోడిన్ దాదాపు సున్నా అని చెప్పవచ్చు. కాబట్టి వీటిని నిత్యం వాడటం వల్ల శరీరంలో అయోడిన్ లోపం ఏర్పడుతుంది. కేవలం రుచి మార్పు కోసం అప్పుడప్పుడు మాత్రమే వీటిని వాడాలి," అని డాక్టర్ అర్జున్ సూచించారు.
3. లో-సోడియం సాల్ట్– బీపీ రోగులు వాడవచ్చా?
అధిక రక్తపోటుతో బాధపడేవారికి వైద్యులు తరచుగా 'లో-సోడియం ఉప్పు'ను సిఫార్సు చేస్తుంటారు. సాధారణ ఉప్పులోని సోడియం క్లోరైడ్ స్థానంలో పొటాషియం క్లోరైడ్‌ను కలపడం ద్వారా దీనిని తయారుచేస్తారు. ఇది బీపీని అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. అయితే కిడ్నీ వ్యాధులు ఉన్నవారు, లేదా పొటాషియం మాత్రలు వాడేవారు మాత్రం లో-సోడియం ఉప్పును వాడే ముందు తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
ఏది తీసుకోవాలి? ఉప్పు రంగు కాదు.. అయోడిన్ ముఖ్యం!
ఆరోగ్యకరమైన జీవితానికి ఉప్పు రంగు లేదా పేరు ముఖ్య కాదని, అందులో 'అయోడిన్' ఉందో లేదో చూడటం అత్యంత కీలకమని డాక్టర్ అర్జున్ తేల్చిచెప్పారు.
"మీ థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేయాలన్నా, కడుపులోని బిడ్డ మెదడు ఎదుగుదల సరిగ్గా జరగాలన్నా అయోడిన్ చాలా అవసరం. శరీరానికి తగినంత అయోడిన్ అందడం వల్ల కొన్ని రకాల థైరాయిడ్, క్యాన్సర్లు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. రోజువారీ వంటల్లో ఎల్లప్పుడూ 'అయోడైజ్డ్ సాల్ట్' అని రాసి ఉన్న ఉప్పునే వాడండి. అలాగే మీరు తినే ఊరగాయలు, అప్పడాలతో సహా రోజు మొత్తంలో ఉప్పు వాడకం ఒక టీస్పూన్ (5 గ్రాములు) కంటే మించకుండా చూసుకోండి," అని ఆయన ముగించారు.