ల్యాప్‌టాప్ స్క్రీన్ ముందు గంటల తరబడి కూర్చోవడం, ఒక మీటింగ్ తర్వాత మరో మీటింగ్, పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్లు, డెడ్‌లైన్లు.. నేటి కార్పొరేట్ ఉద్యోగుల దినచర్య అంతా ఇలాగే సాగుతోంది. ఐటీ నగరాలైన హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో డెస్క్ జాబ్స్ చేసేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న తరుణంలో ఈ తరహా జీవనశైలి వల్ల శరీరంపై పడే దుష్ప్రభావాలు అంతా ఇంతా కాదు. చాలామందిలో ఈ అలవాటు నిశ్శబ్దంగా వారి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. అసలు రోజుకు ఎన్ని గంటలు కూర్చోవచ్చు? ఎంతసేపటికొకసారి శరీరాన్ని కదిలించాలి? అనే సందేహాలు చాలామందిలో తలెత్తుతుంటాయి.

దీనిపై గ్లెనెగల్స్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ నవీన్ పీ రెడ్డి కీలక విషయాలను పంచుకున్నారు. సుదీర్ఘకాలం పాటు ఒకే చోట కదలకుండా కూర్చోవడం వల్ల కలిగే అనర్థాలను, వాటిని ఎలా నివారించవచ్చో వివరించారు.
"నా దగ్గరికి వచ్చే రోగులలో ఎక్కువమంది మెడనొప్పి, వెన్నునొప్పి, కండరాల బిగుతు, తప్పుడు పోస్చర్ (కూర్చునే విధానం) సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యలన్నింటికీ గంటల తరబడి ఒకే చోట కూర్చోవడమే ప్రధాన కారణం," అని డాక్టర్ నవీన్ పీ రెడ్డి పేర్కొన్నారు.
ఎంతసేపు కూర్చోవడం సురక్షితం?
అసలు ఎంత సమయం పాటు కూర్చోవడం సురక్షితం అనే ప్రశ్నకు ఒకే రకమైన సమాధానం ఉండదని డాక్టర్లు చెబుతున్నారు. ఎందుకంటే సమస్య మొత్తం ఎన్ని గంటలు కూర్చున్నాం అనేదాని కంటే, ఎలాంటి కదలిక లేకుండా శరీరాన్ని ఎంతసేపు ఒకే స్థితిలో ఉంచాం అనేదానిపైనే ఆధారపడి ఉంటుంది.
పరిశోధనల ప్రకారం.. రోజుకు 6 నుంచి 8 గంటల కంటే ఎక్కువ సమయం నిరంతరాయంగా కూర్చోవడం వల్ల ఎముకలు, కండరాలకు సంబంధించిన సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఒకవేళ అంతకంటే తక్కువ సమయం కూర్చున్నప్పటికీ, మధ్యలో ఎలాంటి బ్రేక్ తీసుకోకుండా ఒకే పోశ్చర్‌లో ఉండిపోతే అది కూడా తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. నిరంతరాయంగా కూర్చోవడం వల్ల వెన్నెముక, మెడ, కీళ్లు, కండరాలపై ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది.
శరీరానికి రక్షణ: 3:1 ఫార్ములా..!
కూర్చోవడం వల్ల జరిగే నష్టాన్ని తగ్గించుకోవడానికి డాక్టర్ నవీన్ ఒక అద్భుతమైన ఫార్ములాను సూచించారు. అదే ‘3:1 నిష్పత్తి’.
{{/usCountry}}కూర్చోవడం వల్ల జరిగే నష్టాన్ని తగ్గించుకోవడానికి డాక్టర్ నవీన్ ఒక అద్భుతమైన ఫార్ములాను సూచించారు. అదే ‘3:1 నిష్పత్తి’.
{{/usCountry}}ఈ విధానం ప్రకారం.. ప్రతి 30 నుంచి 45 నిమిషాల సిట్టింగ్ సమయానికి, కనీసం 10 నుంచి 15 నిమిషాల పాటు నిలబడటం, నడవడం లేదా కూర్చునే భంగిమను మార్చడం చేయాలి. దీనికోసం ఆఫీసు పనిని ఆపాల్సిన అవసరం లేదు. ఎవరికైనా ఫోన్ కాల్ వచ్చినప్పుడు నిలబడి మాట్లాడటం, పక్క సీట్లో ఉండే సహోద్యోగికి మెసేజ్ పంపే బదులు నేరుగా వారి వద్దకు నడిచి వెళ్లడం లేదా డెస్క్ దగ్గరే చిన్నగా శరీరాన్ని స్ట్రెచ్ చేయడం వంటివి చేయవచ్చు.
చిన్న బ్రేక్స్.. పెద్ద ఉపశమనం!
పెద్ద పెద్ద బ్రేకులు కాకపోయినా, తరచుగా శరీరాన్ని కదిలించడం చాలా ముఖ్యం. ప్రతి 30-45 నిమిషాలకు ఒకసారి సీటులో నుంచి లేచి నిలబడి, కేవలం 1-2 నిమిషాల పాటు అటు ఇటు నడవాలని డాక్టర్ సూచిస్తున్నారు. మెడను ఇరువైపులా తిప్పడం, భుజాలను గుండ్రంగా తిప్పడం, తేలికపాటి స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయడం వల్ల వెన్నెముకపై ఒత్తిడి తగ్గుతుంది.
దీనితో పాటు ఆఫీసులో కూర్చునేటప్పుడు ఎర్గోనామిక్స్ నియమాలను పాటించడం తప్పనిసరి. ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్ స్క్రీన్ ఎల్లప్పుడూ కంటిచూపునకు సమాంతరంగా ఉండాలి. కూర్చున్నప్పుడు పాదాలు రెండూ నేలకు ఆని ఉండాలి. ముందుకు వంగి లేదా కుంగిపోయినట్లు కూర్చోకూడదు!
మన శరీరం కదలికల కోసమే డిజైన్ చేసి ఉంటుంది, గంటల తరబడి ఒకే చోట స్తంభించిపోవడానికి కాదు! కాబట్టి.. తక్కువ సమయం కూర్చోండి, ఎక్కువసార్లు కదలండి, రోజంతా భంగిమలను మారుస్తూ ఉండండి.