విదేశీ యాపిల్స్ తింటున్నారా? హైదరాబాద్ డాక్టర్ వెల్లడించిన షాకింగ్ నిజాలు

ఖరీదైన 'ఇంపోర్టెడ్' యాపిల్స్ కంటే మన కాశ్మీర్, హిమాచల్ యాపిల్స్ మిన్న అని హైదరాబాద్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ స్పష్టం చేశారు. విదేశీ పండ్లలో నిల్వ వల్ల 85% విటమిన్-సి తగ్గిపోతుందని, స్థానిక పండ్లే ఆరోగ్యానికి మేలని ఆయన వివరించారు.

Published on: Feb 13, 2026 11:20 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సూపర్ మార్కెట్‌కు వెళ్లినప్పుడు నిగనిగలాడే 'ఇంపోర్టెడ్' (విదేశీ) యాపిల్స్ మనల్ని ఊరిస్తుంటాయి. ధర ఎంత ఎక్కువైనా సరే, విదేశీ పండు కదా.. ఆరోగ్యం బాగుంటుందని చాలామంది వాటినే కొంటుంటారు. అయితే, ఈ భ్రమను పటాపంచలు చేస్తున్నారు హైదరాబాద్ అపోలో హాస్పిటల్స్‌కు చెందిన ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్.

విదేశీ యాపిల్స్ తింటున్నారా? హైదరాబాద్ డాక్టర్ వెల్లడించిన షాకింగ్ నిజాలు
విదేశీ యాపిల్స్ తింటున్నారా? హైదరాబాద్ డాక్టర్ వెల్లడించిన షాకింగ్ నిజాలు

"ఎక్కువ ధర పెట్టి విదేశీ యాపిల్స్ కొంటున్నారంటే.. మీరు తక్కువ పోషకాలు ఉన్న పండు కోసం ఎక్కువ చెల్లిస్తున్నారని అర్థం" అని ఆయన సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. హిమాచల్ ప్రదేశ్ కొండల్లో, కాశ్మీర్ లోయల్లో పండే దేశీ యాపిల్స్‌లోనే అసలైన పోషకాలు ఉన్నాయని ఆయన గణాంకాలతో సహా వివరించారు.

తాజాదనం అనే భ్రమ: విటమిన్-సి మాయం

విదేశీ యాపిల్స్ చూడటానికి చాలా తాజాగా, మెరుస్తూ కనిపిస్తాయి. కానీ ఆ మెరుపు వెనుక ఒక చేదు నిజం ఉందని డాక్టర్ సుధీర్ తెలిపారు. విదేశాల నుంచి వచ్చే యాపిల్స్ దాదాపు 10,000 కిలోమీటర్లు ప్రయాణించి మన దేశానికి చేరుకుంటాయి. వీటికి 'కంట్రోల్డ్ అట్మాస్ఫియర్' (CA) స్టోరేజ్‌లో నెలల తరబడి నిల్వ ఉంచుతారు.

"విటమిన్-సి చాలా సున్నితమైనది. పరిశోధనల ప్రకారం, 5 నుంచి 9 నెలల పాటు నిల్వ ఉంచిన యాపిల్స్‌లో 40 శాతం నుంచి ఏకంగా 85 శాతం వరకు విటమిన్-సి తగ్గిపోతుంది" అని ఆయన పేర్కొన్నారు. దీనికి భిన్నంగా, హిమాలయాల నుంచి వచ్చే మన దేశీ యాపిల్స్ చాలా తక్కువ సమయంలోనే మార్కెట్‌కు చేరుకుంటాయి. దీనివల్ల వాటిలో వేడికి, వెలుతురుకు నశించిపోయే పోషకాలు భద్రంగా ఉంటాయి.

మన యాపిల్స్‌లో యాంటీ ఆక్సిడెంట్ల నిధి

మన దేశంలోని 'రాయల్ డెలిషియస్', 'స్టార్‌క్రిమ్సన్' వంటి యాపిల్ రకాల్లో జీవక్రియలకు ఉపయోగపడే 'బయో యాక్టివ్' సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయని డాక్టర్ వివరించారు.

  • గుండె ఆరోగ్యం: హిమాలయ యాపిల్స్‌లో ఉండే ఫ్లోరిడ్జిన్, క్వెర్సెటిన్, కాటెచిన్ వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు గుండెను కాపాడతాయి.
  • షుగర్ నియంత్రణ: ఇవి రక్తంలోని చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరించడంలో సహాయపడతాయి.
  • ఆక్సిడేటివ్ స్ట్రెస్: కాశ్మీర్, హిమాచల్ యాపిల్స్ ముదురు ఎరుపు రంగులో ఉండటానికి కారణం వాటిలో ఉండే 'ఆంథోసైనిన్'. ఇది శరీరంలోని కణాల నాశనాన్ని (Oxidative Stress) అడ్డుకుంటుంది.

వ్యాక్స్ మెరుపు చూసి మోసపోకండి

"పైన మెరిసే వ్యాక్స్ (మైనం) పూతను, ఇంపోర్టెడ్ స్టిక్కర్‌ను చూసి మోసపోకండి. అసలైన పోషకాహారం మన హిమాచల్, కాశ్మీర్ లోయల్లోనే ఉంది" అని డాక్టర్ సుధీర్ కుమార్ స్పష్టం చేశారు. స్థానిక పండ్లు కొనడం వల్ల మన ఆరోగ్యానికి మేలు జరగడమే కాకుండా, పర్యావరణానికి (తక్కువ కార్బన్ ఉద్గారాలు), మన దేశ రైతులకు కూడా మేలు జరుగుతుందని ఆయన గుర్తుచేశారు.

రోజూ ఒక యాపిల్ తినడం మంచి అలవాటే, కానీ అది తాజాదనం లేని విదేశీ పండు కంటే.. మన నేల మీద పండిన దేశీ పండు అయితే ఇంకా శ్రేయస్కరమని ఆయన తన సందేశాన్ని ముగించారు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More