గుండె లయ తప్పుతోందా? సాధారణ దడే అనుకుంటే ప్రమాదమే
అప్పుడప్పుడు గుండె దడగా అనిపించడం సాధారణమే అయినా, కొన్నిసార్లు అది తీవ్రమైన హృదయ లయ సమస్యలకు (ఆర్రిథ్మియా) మొదటి సంకేతం కావచ్చు. ఈ అదృశ్య రిస్కులు, వాటి లక్షణాలు, నివారణ మార్గాలపై విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ కార్డియాలజీ కన్సల్టెంట్ డాక్టర్ సమరసింహారెడ్డి అందించిన ప్రత్యేక కథనం.
ఆరోగ్యంగా ఉన్నవారిలో కూడా అప్పుడప్పుడు గుండె ఒక బీట్ మిస్ అయినట్టు లేదా అదనంగా కొట్టుకున్నట్టు అనిపిస్తుంటుంది. అధిక ఒత్తిడి, నిద్రలేమి, మితిమీరిన కెఫీన్ సేవానం, ఆల్కహాల్, డీహైడ్రేషన్ లేదా కొన్ని రకాల మందుల వాడకం వల్ల కూడా ఇలాంటి అనుభూతి కలుగవచ్చు. అయితే, కొద్దిసేపు కనిపించే ఈ గుండె దడ వెనుక గుండె కొట్టుకునే లయ (రిథమ్) దెబ్బతిన్నదనే సంకేతం దాగి ఉండే అవకాశాన్ని కొట్టిపారేయలేం.

ఏట్రియల్ ఫిబ్రిలేషన్ (AF): ఒక అదృశ్య హెచ్చరిక
గుండె లయ తప్పడానికి ఒక ప్రధాన ఉదాహరణ 'ఏట్రియల్ ఫిబ్రిలేషన్' (AF). ఈ పరిస్థితిలో గుండెలోని పై గదులు సక్రమంగా కాకుండా అస్తవ్యస్తంగా కొట్టుకుంటాయి. కొందరికి గుండె వేగంగా లేదా ఒకే రిథమ్ లేకుండా కొట్టుకుంటున్న భావన కలుగుతుంది. మరికొందరిలో ఎటువంటి లక్షణాలు వెలువడవు.
లక్షణాలు అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తుండటంతో ఈ సమస్యను ప్రారంభంలో గుర్తించడం సవాలుగా మారుతుంది. రోగి క్లినిక్‌కి లేదా ఆసుపత్రికి చేరుకునే సమయానికే ఆ ఎపిసోడ్ పూర్తయిపోవచ్చు. ఆ సమయంలో తీసే ఈసీజీ (ECG) నివేదిక కూడా పూర్తిగా సాధారణంగానే రావొచ్చు.
లక్షణాల విభిన్న రూపాలు
బాధితుల్లో ఈ లక్షణాలు వేర్వేరు రీతుల్లో కనిపిస్తాయి.
- ఛాతీలో గుండె గట్టిగా కొట్టుకోవడం, గుండె వేగంలో అకస్మాత్తుగా మార్పులు రావడం.
- ఊపిరి తీసుకోవడంలో అసౌకర్యం, తీవ్రమైన అలసట.
- తల తిరగడం, కొద్దిపాటి శ్రమ చేసినా మునుపటి కంటే ఎక్కువగా అలసిపోవడం.
- మెట్లు ఎక్కిన తర్వాత కొన్ని సెకన్ల పాటు గుండె దడగా ఉండటం సహజం. కానీ, ఏ శ్రమా లేకుండా విశ్రాంతిగా ఉన్నప్పుడు కూడా పదేపదే గుండె దడ రావడం, అది కొన్ని నిమిషాల పాటు కొనసాగడం లేదా రోజురోజుకూ దాని తీవ్రత పెరగడం గమనిస్తే తక్షణమే వైద్యులను సంప్రదించాలి.
గుండె లయ దెబ్బతినడానికి కారణాలేంటి?
గుండె నిర్మాణంలో వచ్చే మార్పులే ఈ రిథమ్ సమస్యలకు ప్రధాన మూలం. అధిక రక్తపోటు (High BP), గుండెకు రక్తాన్ని అందించే రక్తనాళాల సమస్యలు (CAD), కవాటాల లోపాలు, థైరాయిడ్ సమస్యలు, కార్డియోమయోపతి వంటి అనారోగ్యాలు ఈ ముప్పును పెంచుతాయి. వీటితో పాటు వంశపారంపర్యంగా వచ్చే రిథమ్ సమస్యల్లో కుటుంబ చరిత్ర కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
స్మార్ట్‌వాచ్‌లు వర్సెస్ క్లినికల్ మానిటరింగ్
స్మార్ట్‌వాచ్‌లు లేదా ఫిట్‌నెస్ ట్రాకర్లలో అసాధారణమైన హార్ట్ రేట్ నమోదైనంత మాత్రాన వ్యాధిని ఖచ్చితంగా నిర్ధారించలేం. సమస్య తీవ్రతను బట్టి వైద్యులు ఈసీజీ, ఎకోకార్డియోగ్రామ్ లేదా సుదీర్ఘ సమయం పాటు హార్ట్ రిథమ్‌ను పరిశీలించే పరీక్షలు సూచిస్తారు.
లక్షణాలు అప్పుడప్పుడు వస్తుంటే 24 గంటల హార్ట్ మానిటర్ (హోల్టర్) కూడా సమస్యను పట్టలేకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో కొన్ని రోజుల పాటు పనిచేసే ప్యాచ్ మానిటర్ లేదా అంబులేటరీ మానిటరింగ్ సాధనాలను వైద్యులు ఉపయోగిస్తారు.
రోగులు కూడా తమకు లక్షణాలు వచ్చిన సమయం, ఎపిసోడ్ వ్యవధి, ఆ సమయంలో చేస్తున్న పని, ఇతర అసౌకర్యాలను డైరీలో నమోదు చేసుకుంటే సరైన డయాగ్నోస్టిక్ టెస్ట్‌ను ఎంచుకోవడానికి డాక్టర్లకు సులువవుతుంది.
స్ట్రోక్ ముప్పు.. ఎప్పుడు అత్యవసరం?
ఏట్రియల్ ఫిబ్రిలేషన్ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. గుండె పై గదుల్లో రక్తం సరిగ్గా ప్రవహించక నిలిచిపోవడం వల్ల రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉంది. ఈ గడ్డలు మెదడుకు చేరితే 'స్ట్రోక్' (పక్షవాతం) వచ్చే అవకాశం పెరుగుతుంది. రోగి పరిస్థితిని బట్టి రక్తం పలుచబడే మందులను వైద్యులు నిర్ణయిస్తారు. స్మార్ట్‌వాచ్ రీడింగ్‌లను చూసి సొంతంగా మందులు వాడటం లేదా ఆపేయడం అత్యంత ప్రమాదకరం.
తక్షణ అత్యవసర వైద్యం ఎప్పుడు అవసరం?
గుండె ఒక్కసారిగా వేగంగా లేదా అసాధారణంగా కొట్టుకుంటూ, దానితో పాటు స్పృహ తప్పడం, తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బంది, ఛాతీలో విపరీతమైన నొప్పి లేదా విపరీతమైన నీరసం కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే అత్యవసర వైద్య సహాయం (Emergency Care) పొందాలి.
కొత్తగా మొదలైన గుండె దడ పదేపదే వస్తున్నా, దాని తీరు మారుతున్నా నిర్లక్ష్యం చేయవద్దు. సరైన సమయంలో స్పందించి డాక్టర్ సలహా తీసుకోవడమే గుండె ఆరోగ్యానికి సురక్షిత మార్గం.
వ్యాసకర్త:
— డాక్టర్ సమరసింహారెడ్డి,
కన్సల్టెంట్ – కార్డియాలజీ,
మణిపాల్ హాస్పిటల్స్, విజయవాడ
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

E-Paper


