High BP : హై- బీపీతో బాధపడుతున్నారా? గుండె వైద్యుడు చెప్పిన ఈ 6 టిప్స్​తో చెక్ పెట్టండి..

హై బ్లడ్ ప్రెజర్ గుండె జబ్బులకు ప్రధాన కారణం. ప్రముఖ కార్డియాక్ సర్జన్ డాక్టర్ జెరెమీ లండన్ సూచించిన 6 సులభమైన జీవనశైలి మార్పులు, బీపీని అదుపులో ఉంచుకునే మార్గాలపై ప్రత్యేక కథనం.

Published on: Sep 12, 2026, 09:11:06 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

చిన్న వయసులోనే గుండెపోటుకు గురవుతున్న వారి సంఖ్య ఇటీవలి కాలంలో ఆందోళనకరంగా పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణాల్లో హై బ్లడ్ ప్రెజర్ (అధిక రక్తపోటు) మొదటి వరుసలో నిలుస్తోంది. బీపీని ‘సైలెంట్ కిల్లర్’ అని పిలుస్తారు. ఎలాంటి తీవ్రమైన లక్షణాలు చూపించకుండానే ఇది గుండె, మూత్రపిండాలను దెబ్బతీస్తుంది. అయితే జీవనశైలిలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా అధిక రక్తపోటును సమర్థవంతంగా అదుపులో ఉంచుకోవచ్చని ప్రముఖ అమెరికన్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ జెరెమీ లండన్ స్పష్టం చేశారు.

హై- బిపీతో బాధపడుతున్నారా? (Unsplash)
హై- బిపీతో బాధపడుతున్నారా? (Unsplash)

అమెరికాలోని జార్జియాకు చెందిన, 25 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ప్రముఖ హృద్రోగ నిపుణుడు ఈ డాక్టర్ జెరెమీ లండన్. అధిక రక్తపోటు నియంత్రణపై సోషల్ మీడియా వేదికగా కీలక సూచనలు చేశారు. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఆయన ప్రతిపాదించిన 6 ముఖ్యమైన అంశాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

ఆహారంలో మార్పులు.. ఉప్పుకు కట్టడి

తెలుగువారి భోజనంలో పచ్చళ్లు, కారాలు, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల వినియోగం ఎక్కువ. వీటిలో ఉండే సోడియం (ఉప్పు) రక్తపోటును తీవ్రంగా పెంచుతుంది.

"అధిక రక్తపోటు అనేది మనం సులభంగా నయం చేయగల గుండె సంబంధిత ముప్పు," అని డాక్టర్ జెరెమీ లండన్ వివరించారు. తాజా పండ్లు, కూరగాయలు, కొవ్వు తక్కువగా ఉండే మాంసాహారాన్ని ఆహారంలో భాగం చేసుకోవాలని, సోడియం ఎక్కువగా ఉండే జంక్ ఫుడ్‌ను పూర్తిగా పరిహరించాలని ఆయన సలహా ఇచ్చారు.

క్రమం తప్పకుండా వ్యాయామం..

రోజువారీ శారీరక శ్రమ గుండె పంపింగ్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు వేగంగా నడవటం, ఈత కొట్టడం లేదా సైక్లింగ్ చేయడం వంటి సాధారణ వ్యాయామాలు చేసినా గుండె పనితీరు మెరుగవుతుంది. ఇది గుండె రక్తనాళాలపై పడే ఒత్తిడిని తగ్గించి, బీపీ అదుపులో ఉండేలా చూస్తుంది.

శరీర బరువును అదుపులో ఉంచుకోవడం..

అధిక బరువు గుండెపై తీవ్రమైన భారాన్ని మోపుతుంది. శరీర బరువు పెరిగే కొద్దీ కణజాలాలకు రక్తాన్ని సరఫరా చేయడానికి గుండె ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. సమతుల్యాహారం, క్రమబద్ధమైన వ్యాయామం ద్వారా బరువును క్రమంగా తగ్గించుకుంటే, రక్తపోటు కూడా దానంతట అదే తగ్గుముఖం పడుతుంది.

నిద్రలేమి సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు..

రాత్రి వేళల్లో తీవ్రమైన గురక పెట్టడం, ఉలిక్కిపడి లేవడం, ఉదయాన్నే అలసటగా అనిపించడం వంటి లక్షణాలు ఉంటే ‘స్లీప్ ఆప్నియా’ ఉన్నట్లే.

"మీరు గురక పెడుతున్నా, రాత్రి వేళల్లో శ్వాస ఆడక మెలకువ వచ్చినా వెంటనే స్లీప్ ఆప్నియా పరీక్షలు చేయించుకోవాలి," అని డాక్టర్ లండన్ హెచ్చరించారు. ఈ సమస్య వల్ల నిద్రలో శ్వాసకు అంతరాయం ఏర్పడి, బీపీ అదుపు తప్పే ప్రమాదం ఉంది.

మందులు వాడటం ఓటమి కాదు..

జీవనశైలి మార్పులు చేసుకున్నా కొందరిలో బీపీ అదుపులోకి రాకపోవచ్చు. వంశపారంపర్య కారణాల వల్ల కూడా బీపీ పెరుగుతుంది.

"అన్ని జాగ్రత్తలు తీసుకున్నా మీ బీపీ రీడింగ్స్ సాధారణ స్థితికి రాకపోతే వైద్యుల సలహా మేరకు మందులు వాడటం మంచిది. మందులు వాడటం అనేది మీ ఆరోగ్య ప్రయత్నాల్లో ఓటమి కానే కాదు," అని డాక్టర్ జెరెమీ స్పష్టం చేశారు.

ఇంట్లోనే బీపీని క్రమంగా పరీక్షించుకోవడం..

ప్రతి ఒక్కరూ ఇంట్లోనే డిజిటల్ బీపీ మిషన్‌తో రక్తపోటును ఎప్పటికప్పుడు గమనించుకోవాలి. సాధారణంగా 120/80 mmHg ని ఐడియల్ బీపీగా పరిగణిస్తారు. అయితే వ్యక్తి వయసు, ఇతర ఆరోగ్య సమస్యలను బట్టి ఈ కొలతల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు. తేడాలు ఉన్నప్పుడు సొంత వైద్యం చేసుకోకుండా డాక్టర్‌ను సంప్రదించి మార్గదర్శకత్వం పొందడం శ్రేయస్కరం.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More