Belly fat loss : పొట్ట చుట్టు కొవ్వు తగ్గించుకునేందుకు గ్రీన్ టీ ఒక్కటే సరిపోదు బాసు! ఇవి కూడా తీసుకోండి..
How To Reduce Belly Fat : పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును తగ్గించుకోవడానికి చాలా మంది గ్రీన్ టీపైనే ఆధారపడుతుంటారు. అయితే కేవలం ఒక పానీయంతోనే బరువు తగ్గడం సాధ్యం కాదని, వంటింట్లో దొరికే అద్భుత దేశీయ పదార్థాలతో సులభంగా బెల్లీ ఫ్యాట్ కరిగించవచ్చని పోషకాహార నిపుణురాలు వివరిస్తున్నారు. ఆ వివరాలు..
ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం! ఈ మొండి బెల్లీ ఫ్యాట్‌ను వదిలించుకోవడానికి ఎక్కువ మంది ఆశ్రయించే మొదటి మార్గం గ్రీన్ టీ. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు కప్పుల కొద్దీ గ్రీన్ టీ తాగేస్తుంటారు. అయితే, కేవలం ఒకే ఒక్క హెర్బల్ డ్రింక్ తాగేస్తే చాలు, రాత్రికి రాత్రే అద్భుతాలు జరిగిపోతాయని, పొట్ట ఫ్లాట్‌గా మారిపోతుందని అనుకుంటే పొరపాటే. ఇదే విషయాన్ని ప్రముఖ న్యూట్రిషనిస్ట్ లవ్‌నీత్ బాత్రా స్పష్టం చేస్తున్నారు.

ఏ ఒక్క డ్రింక్ కూడా మీ పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును పూర్తిగా కరిగించలేదు అని బాత్రా చెబుతున్నారు. సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, అలాగే శరీరానికి సరిపడే సరైన ఆహార పదార్థాలను ఎంచుకోవడం ద్వారానే ఆరోగ్యకరమైన పద్ధతిలో బరువు తగ్గడం సాధ్యమవుతుందని ఆమె వివరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో కేవలం గ్రీన్ టీ మీదే ఆధారపడకుండా, జీవక్రియలను వేగవంతం చేసి, జీర్ణక్రియను మెరుగుపరిచే 7 అద్భుతమైన దేశీయ ఆహార పదార్థాలను ఆమె సిఫార్సు చేస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాము..
1. జీలకర్ర..
మన వంటింట్లో నిత్యం వాడే జీలకర్ర శరీరంలో మెటబాలిజాన్ని పెంచడానికి, బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించడానికి అద్భుతంగా సహాయపడుతుంది. ఒక టీస్పూన్ జీలకర్రను రాత్రి వేళ నీళ్లలో నానబెట్టి, ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఆ నీటిని తాగాలి. లేదా ఐదు నిమిషాల పాటు నీటిలో జీలకర్రను బాగా మరిగించి, ఆ నీటిని గోరువెచ్చగా ఉన్నప్పుడు కూడా సేవించవచ్చు.
2. మెంతులు..
మెంతులు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి ఎంతగానో తోడ్పడతాయి. ఒక టీస్పూన్ మెంతులను రాత్రిపూట నీటిలో నానబెట్టి, ఉదయాన్నే ఆ నీటిని తాగి, నానిన మెంతులను నమిలి తినేయాలి. ఇది ఆకలిని నియంత్రణలో ఉంచడానికి కూడా సాయపడుతుంది.
3. వాము..
పొట్ట ఉబ్బరం, గ్యాస్ సమస్యల నుంచి తక్షణ ఉపశమనం పొందడానికి వాము కంటే అద్భుతమైన ఔషధం మరొకటి లేదు. భోజనం చేసిన తర్వాత కొద్దిగా వామును నేరుగా నమిలి తినవచ్చు. లేదా నీటిలో వేసి బాగా మరిగించి, గోరువెచ్చని కషాయంలా తాగడం వల్ల జీర్ణక్రియ వేగవంతమై పొట్ట చుట్టూ కొవ్వు చేరకుండా ఉంటుంది.
4. దాల్చినచెక్క..
శరీరంలో ఇన్స్యులిన్ సెన్సిటివిటీని పెంచి, బ్లడ్ షుగర్ లెవెల్స్ సమతుల్యంగా ఉంచడంలో దాల్చినచెక్క కీలక పాత్ర పోషిస్తుంది. అర టీస్పూన్ దాల్చినచెక్క పొడిని గోరువెచ్చని నీటిలో గానీ, లేదా మీరు తాగే టీ, ఉదయం తినే ఓట్స్‌లో గానీ కలుపుకుని తీసుకోవచ్చు.
5. పసుపు..
పసుపులో ఉండే కర్కుమిన్ శరీరంలో ఉండే ఇన్ఫ్లమేషన్ (వాపులు)ని తగ్గిస్తుంది. ప్రతిరోజూ ఉదయం గోరువెచ్చని నీటిలో పచ్చి పసుపును కలిపి తీసుకోవాలని లవ్‌నీత్ బాత్రా సూచిస్తున్నారు. అయితే, పసుపును శరీరం వేగంగా గ్రహించాలంటే, ఆ నీటిలో కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా నెయ్యి కలిపి తీసుకోవడం వల్ల మరింత మెరుగైన ఫలితాలు ఉంటాయి.
6. సోంపు గింజలు..
సోంపు గింజలు జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, శరీరంలోని హార్మోన్ల సమతుల్యతను కాపాడతాయి. సాధారణంగా భోజనం చేసిన తర్వాత ఒక టీస్పూన్ సోంపు గింజలను నమలడం మంచిది. లేదా రోజంతా సాధారణ నీటికి బదులుగా సోంపు నానబెట్టిన నీటిని తాగడం వల్ల శరీరం తేలికగా మారుతుంది.
7. త్రిఫల చూర్ణం..
కాలేయ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచడానికి, శరీరంలో అనవసరమైన కొవ్వు పేరుకుపోకుండా నిరోధించడానికి త్రిఫల అద్భుతంగా పనిచేస్తుంది. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటిలో అర టీస్పూన్ త్రిఫల చూర్ణాన్ని కలుపుకుని తాగడం ప్రారంభించాలి. ఆ తర్వాత శరీర తత్వానికి అనుగుణంగా ఆ మోతాదును నెమ్మదిగా పెంచుకోవచ్చు.
"ఆరోగ్యకరమైన బరువు తగ్గింపు అనేది ఒక క్రమపద్ధతిలో జరిగే ప్రక్రియ. షార్ట్‌కట్‌ల వైపు వెళ్లకుండా వంటింటి చిట్కాలను జీవనశైలిలో భాగం చేసుకోవాలి," అని లవ్‌నీత్ బాత్రా పేర్కొన్నారు.
కాబట్టి, బరువు తగ్గాలనుకునే వారు, బెల్లీ ఫ్యాట్‌ని కరిగించుకోవాలనుకునే వారు.. కేవలం గ్రీన్ టీ కప్పులతోనే సరిపెట్టకుండా, నిపుణులు సూచించిన ఈ 7 రకాల భారతీయ సాంప్రదాయ పదార్థాలను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోండి. సరైన వ్యాయామం, పోషక విలువలున్న ఆహారంతో సులభంగా పొట్ట కొవ్వుకు చెక్ పెట్టండి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


