జాన్వీ కపూర్ చెల్లెలికి ‘ఐబీఎస్’- ఎప్పటికీ నయం అవ్వని వ్యాధి ఇది! లక్షణాలేంటి?
బాలీవుడ్ నటి, జాన్వీ కపూర్ సోదరి అయిన ఖుషీ కపూర్.. తనకు ఐబీఎస్ (ఇరిటెబుల్ బావెల్ సిండ్రోమ్) ఉన్నట్లు వెల్లడించారు. జీర్ణక్రియపై తీవ్ర ప్రభావం చూపే ఈ వ్యాధి లక్షణాలు, కారణాలు, దీనిని అదుపులో ఉంచుకునే మార్గాలపై ప్రత్యేక కథనాన్ని ఇక్కడ చూడండి..
తనకు ఐబీఎస్ (ఇరిటెబుల్ బావెల్ సిండ్రోమ్) వ్యాధి ఉన్నట్టు బాలీవుడ్ యంగ్ బ్యూటీ, ప్రముఖ నటి జాన్వీ కపూర్ సోదరి ఖుషీ కపూర్ వెల్లడించారు.

ఓర్హాన్ అవత్రామణి (ఓర్రీ) ఇటీవల చేసిన ఒక వీడియోలో.. ‘నీ జీవితంలో అత్యంత విశ్వసనీయమైనది ఏది?’ అని అడిగిన ప్రశ్నకు ఆమె ఏమాత్రం తడుముకోకుండా “ఇరిటబుల్ బావెల్ సిండ్రోమ్ (ఐబీఎస్)” అని వ్యంగ్యంగా సమాధానమిచ్చారు. ఈ సమస్య తనను గత కొంత కాలంగా వేధిస్తోందని ఆమె వివరించారు.
అసలు ఏంటీ ఈ ఐబీఎస్? ఇది ప్రాణాంతకమా? దీనివల్ల కలిగే ఇబ్బందులేంటి? వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము..
ఇరిటెబుల్ బావెల్ సిండ్రోమ్ (ఐబీఎస్) అంటే ఏంటి?
ఐబీఎస్ అనేది జీర్ణవ్యవస్థకు సంబంధించిన ఒక దీర్ఘకాలిక సమస్య! దీనివల్ల ప్రేగుల పనితీరులో మార్పులు వచ్చి తీవ్రమైన అసౌకర్యం కలుగుతుంది. "జీర్ణనాళం గోడల్లో ఉండే నాడులు విపరీతమైన సున్నితత్వానికి గురవ్వడం వల్లే ఐబీఎస్ లక్షణాలు కనిపిస్తాయి. మెదడుకి, ప్రేగుల్లోని నాడులకి మధ్య సమన్వయ లోపం ఏర్పడినప్పుడు కూడా ఈ సమస్య తలెత్తుతుంది," అని జాన్స్ హాప్కిన్స్ మెడిసిన్ నిపుణులు వివరిస్తున్నారు.
ఈ లక్షణాలు కనిపిస్తే అప్రమత్తమవ్వండి-
ఐబీఎస్ ఉన్నవారిలో లక్షణాలు అప్పుడప్పుడు రావచ్చు లేదా తరచుగా ఇబ్బంది పెట్టవచ్చు:
కడుపు ఉబ్బరం, విపరీతమైన గ్యాస్.
విరోచనాలు, మలబద్ధకం లేదా ఈ రెండూ మార్చి మార్చి రావడం.
మలంలో తెల్లటి జిగురు వంటి పదార్థం కనిపించడం.
కడుపులో నొప్పి లేదా తిమ్మిర్లు (ముఖ్యంగా మల విసర్జన చేయాలనే కోరిక కలిగినప్పుడు).
మల విసర్జన తర్వాత కూడా కడుపు ఖాళీ కాలేదన్న భావన కలగడం.
కేవలం జీర్ణక్రియే కాకుండా.. మైగ్రేన్, నిద్రలేమి, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు కూడా ఐబీఎస్‌తో సంబంధం కలిగి ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.
ఐబీఎస్‌కి కారణాలు ఏమిటి?
ఐబీఎస్‌కి ఖచ్చితమైన కారణం తెలియనప్పటికీ, మేయో క్లినిక్ ప్రకారం కొన్ని అంశాలు దీనికి దారితీస్తాయి:
నరాల వ్యవస్థ: మెదడుకు, ప్రేగులకు మధ్య సమాచార మార్పిడి సరిగ్గా లేనప్పుడు జీర్ణ ప్రక్రియలో వచ్చే సాధారణ మార్పులకు కూడా శరీరం అతిగా స్పందిస్తుంది.
ఒత్తిడి: చిన్నతనంలో ఎదుర్కొన్న మానసిక ఒత్తిడి లేదా ప్రస్తుత జీవనశైలిలోని ఒత్తిడి ఈ సమస్యను మరింత పెంచుతాయి.
ప్రేగు కండరాల కదలికలు: ఆహారాన్ని ముందుకు నెట్టే క్రమంలో ప్రేగు కండరాలు బలంగా సంకోచించినప్పుడు గ్యాస్, విరోచనాలు కలుగుతాయి. అదే కదలికలు నెమ్మదిస్తే మలబద్ధకం వస్తుంది.
తీవ్రమైన ఇన్ఫెక్షన్లు: బ్యాక్టీరియా లేదా వైరస్ వల్ల వచ్చే తీవ్రమైన విరోచనాల తర్వాత కూడా ఐబీఎస్ వచ్చే అవకాశం ఉంది.
ఐబీఎస్‌ని అదుపులో ఉంచుకోవడం ఎలా?
ఐబీఎస్‌ని పూర్తిగా నయం చేయడం కష్టమైనా, జీవనశైలి మార్పులతో నియంత్రించవచ్చు:
ఆహారపు అలవాట్లు: ఉల్లిపాయలు, వెల్లుల్లి, కెఫిన్, ఆల్కహాల్ వంటి వాటికి దూరంగా ఉండాలి. పీచు పదార్థం (ఫైబర్) ఉన్న ఆహారాన్ని క్రమంగా పెంచాలి.
నీరు: రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీరు తాగాలి. వేళకు భోజనం చేయడం అలవాటు చేసుకోవాలి.
ఒత్తిడి తగ్గించుకోవడం: ధ్యానం, గాఢమైన శ్వాస తీసుకోవడం (డీప్ బ్రీథింగ్) వంటి పద్ధతుల ద్వారా ఒత్తిడిని దూరం చేసుకోవాలి.
నిద్ర: సరైన నిద్ర చాలా అవసరం.
వ్యాయామం: రోజూ 30 నిమిషాల నడక, సైక్లింగ్ లేదా స్విమ్మింగ్ వంటివి ప్రేగుల కదలికలను మెరుగుపరుస్తాయి. యోగా, పిలాటేస్ వంటివి మానసిక ప్రశాంతతను ఇస్తాయి.
ఖుషీ కపూర్ లాంటి సెలబ్రిటీలు ఇలాంటి ఆరోగ్య సమస్యల గురించి బహిరంగంగా మాట్లాడటం వల్ల, సామాన్యుల్లో కూడా అవగాహన పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు.
(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. మీలో ఈ లక్షణాలు కనిపిస్తుంటే సొంత వైద్యం చేసుకోకుండా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.)

E-Paper












