కిడ్నీ స్టోన్స్ ముందస్తు లక్షణాలు: నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే
ఎండ తీవ్రత పెరిగే కొద్దీ కిడ్నీలో రాళ్లు ఏర్పడే ముప్పు పెరుగుతుంది. కిడ్నీ స్టోన్స్ ముందస్తు హెచ్చరికలు, వాటిని నివారించేందుకు వైద్యులు సూచిస్తున్న జాగ్రత్తల వివరాలు.
కిడ్నీలో రాళ్లు (కిడ్నీ స్టోన్స్) అనేవి తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి. శరీరంలోని ఖనిజ వ్యర్థాలు ఒకదానికొకటి అంటుకుపోయి గట్టిపడటం వల్ల ఇవి ఏర్పడతాయి. భువనేశ్వర్‌లోని మణిపాల్ హాస్పిటల్ యూరాలజీ అసోసియేట్ కన్సల్టెంట్ డాక్టర్ సర్బ్‌జిత్ మోహపాత్ర ప్రకారం, వేసవి కాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తుంది. ఎండ తీవ్రత వల్ల డీహైడ్రేషన్ బారిన పడటం, చెమట ఎక్కువగా పట్టినా తగినంత నీరు తాగకపోవడం వల్ల మూత్రం పరిమాణం తగ్గిపోతుంది. దీనివల్ల మూత్రంలో రాళ్లు ఏర్పడే ఖనిజాల సాంద్రత పెరుగుతుంది.

కిడ్నీ స్టోన్స్‌కు దారితీసే కారణాలు
వేసవిలో ఎక్కువసేపు ఎండలో ప్రయాణించడం, ఉప్పు ఎక్కువగా ఉండే రోడ్‌సైడ్ స్నాక్స్ తినడం, నీళ్లు తాగకుండా టీ లేదా కాఫీలు ఎక్కువగా తీసుకోవడం, మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోవడం వంటి అలవాట్లు కిడ్నీ స్టోన్స్ ముప్పును పెంచుతాయి. ప్రధాన కారణాల జాబితా ఇక్కడ చూడొచ్చు.
- తక్కువగా నీరు తాగడం
- ఆహారంలో ఉప్పు (సోడియం) ఎక్కువగా తీసుకోవడం
- జంతు ప్రోటీన్లు (నాన్-వెజ్) అధికంగా తినడం
- తరచుగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు (UTI) రావడం
- కుటుంబంలో కిడ్నీ స్టోన్స్ చరిత్ర ఉండటం
- ఊబకాయం లేదా మెటబాలిక్ సిండ్రోమ్
- గతంలో కిడ్నీ స్టోన్స్ వచ్చి ఉండటం
- వైద్యుల పర్యవేక్షణ లేకుండా క్యాల్షియం, విటమిన్ సి సప్లిమెంట్లు వాడటం
- గౌట్ వ్యాధి, హైపర్‌పారాథైరాయిడిజం ఉండటం
గుర్తించాల్సిన ప్రధాన లక్షణాలు
కిడ్నీలో రాళ్లు ఉన్న ప్రారంభంలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. ఆ రాళ్లు కదలడం లేదా మూత్ర నాళాన్ని అడ్డుకోవడం ప్రారంభించినప్పుడు తీవ్రమైన నొప్పి వస్తుంది. వీటిని గుర్తించేందుకు కొన్ని ముఖ్యమైన లక్షణాలు ఇవే.
- నడుము లేదా పక్కటెముకల కింది భాగంలో తీవ్రమైన నొప్పి
- ఆ నొప్పి క్రమంగా పొత్తికడుపు, గజ్జల వైపు పాకడం
- మూత్రం విసర్జించేటప్పుడు మంట లేదా నొప్పి
- మూత్రంలో రక్తం పడటం (ఎరుపు లేదా గోధుమ రంగు మూత్రం)
- కడుపులో వికారం లేదా వాంతులు రావడం
- తరచుగా మూత్రానికి వెళ్లాల్సి రావడం
- జ్వరం, వణుకు రావడం
వైద్యుల ప్రకారం కొన్ని లక్షణాలు కనిపిస్తే తక్షణ రోగనిర్ధారణ అవసరం. జ్వరంతో పాటు నొప్పి ఉండటం, మూత్రం పరిమాణం తగ్గడం, తీవ్రమైన వాంతులు కావడం, మందులు వేసినా నొప్పి తగ్గకపోవడం వంటివి జరిగితే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
గమనిక: ఒకే కిడ్నీ ఉన్నవారు, గర్భిణులు, మధుమేహం ఉన్నవారు, వృద్ధులు ఈ లక్షణాలు కనిపిస్తే మరింత అప్రమత్తంగా ఉండాలి.
నివారణకు వైద్యుల సూచనలు
కిడ్నీ స్టోన్స్ బారిన పడకుండా ఉండేందుకు ఇంట్లోనే కొన్ని జాగ్రత్తలు పాటించవచ్చని డాక్టర్ మోహపాత్ర సూచించారు.
1. నీటిని విభజించి తాగాలి: కేవలం రోజుకు 8-10 గ్లాసుల నీరు తాగడం మాత్రమే కాదు, దానిని రోజంతా ఎలా తాగుతున్నామనేది ముఖ్యం. ఉదయం పూట 500 మి.లీ, ఇంటి నుంచి బయలుదేరే ముందు 500 మి.లీ, ఆఫీస్ వేళల్లో 1 నుండి 1.5 లీటర్లు, సాయంత్రం వేళల్లో 500-700 మి.లీ నీటిని తాగాలి. పడుకునే ముందు కూడా కొద్దిగా నీరు తీసుకోవడం మంచిది.
2. ఉప్పు తగ్గించాలి: ఉప్పు ఎక్కువగా తింటే మూత్రంలో కాల్షియం పెరుగుతుంది. ఇది రాళ్లు ఏర్పడటానికి కారణమవుతుంది. ప్యాకేజ్డ్ స్నాక్స్, చిప్స్, అప్పడాలు, ఊరగాయలు, ఫాస్ట్ ఫుడ్స్ తగ్గించాలి.
3. క్యాల్షియం ఆహారాన్ని ఆపకూడదు: కిడ్నీలో క్యాల్షియం రాళ్లు ఉన్నాయని చాలా మంది పాలు, పెరుగు పూర్తిగా మానేస్తారు. కానీ ఆహారంలో క్యాల్షియం చాలా తక్కువగా ఉంటే, శరీరం ఆక్సలేట్‌ను ఎక్కువగా గ్రహిస్తుంది. దీనివల్ల క్యాల్షియం ఆక్సలేట్ రాళ్లు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది.
4. సిట్రస్ పండ్లు తీసుకోవాలి: నిమ్మరసంలో ఉండే సిట్రేట్ రాళ్లు ఏర్పడే ప్రక్రియను నెమ్మదింపజేస్తుంది. అయితే ఇది పూర్తి నివారణ కాదు. నిమ్మరసంలో ఎక్కువ చక్కెర వేసుకోకుండా తాగాలి.
5. నాన్-వెజ్ పరిమితం చేయాలి: రెడ్ మీట్, కాలేయం వంటి ఆర్గాన్ మీట్లను ఎక్కువగా తింటే యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. వీటిని పరిమితంగా తీసుకోవడం మంచిది.
6. సొంత వైద్యం వద్దు: రాయి మూత్ర నాళాన్ని అడ్డుకున్నప్పుడు ఇంటి వైద్యం లేదా నాటు మందుల వల్ల కాలయాపన జరిగి కిడ్నీ దెబ్బతినే ప్రమాదం ఉంది. నొప్పి తగ్గినప్పటికీ లోపల రాయి అలాగే ఉండే అవకాశం ఉంది. కాబట్టి స్కానింగ్ ద్వారా రాయి కరిగిందా లేదా అనేది నిర్ధారించుకోవాలి.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

E-Paper


