మధ్య వయస్కులు ఏటా కిడ్నీ పరీక్షలు ఎందుకు చేయించుకోవాలి?: డాక్టర్ AVSSN శ్రీధర్
కిడ్నీ వ్యాధి ప్రాథమిక దశలో ఎలాంటి లక్షణాలు కనిపించవని, ముందస్తు పరీక్షల ద్వారానే గుర్తించి ప్రాణాలను కాపాడుకోవచ్చని విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ నెఫ్రాలజీ కన్సల్టెంట్ డాక్టర్ AVSSN శ్రీధర్ పేర్కొన్నారు. ఈ అంశంపై ఆయన అందించిన సమగ్ర వివరాలు ఇవీ..
40 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసున్న దక్షిణ భారతీయ పురుషులు సాధారణంగా తమ ఆరోగ్యం కంటే ఉద్యోగ బాధ్యతలు, కుటుంబ అవసరాలు, ఆర్థిక స్థిరత్వానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. ప్రస్తుతం మధుమేహం, రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధుల విషయంలో పరీక్షలు చేయించుకునే అవగాహన పెరిగినప్పటికీ, కిడ్నీల ఆరోగ్యాన్ని పరీక్షించుకోవడం మాత్రం చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కిడ్నీ పరీక్షలు చేయించుకోవడం ద్వారా భవిష్యత్తులో వచ్చే అనారోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి అడ్డుకోవచ్చు.

మన శరీరంలో కిడ్నీలు చాలా ముఖ్యమైన అవయవాలు. ఇవి రక్తంలోని వ్యర్థ పదార్థాలను తొలగించడం, శరీరంలో ద్రవాల సమతుల్యతను నియంత్రించడం, రక్తపోటును అదుపులో ఉంచడంతో పాటు మొత్తంగా ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
లక్షణాలు లేని 'సైలెంట్ కిల్లర్'
కిడ్నీ వ్యాధి చాలా సందర్భాల్లో చివరి దశకు చేరుకునే వరకు ఎలాంటి స్పష్టమైన లక్షణాలను చూపించదు. కాళ్లు లేదా ముఖం వాపు రావడం, విపరీతమైన అలసట, మూత్ర విసర్జన తగ్గిపోవడం, ఆకలి మందగించడం లాంటి లక్షణాలు బయటపడే సమయానికి కిడ్నీలకు అప్పటికే తీవ్ర నష్టం జరిగిపోతుంది. అందుకే వైద్యులు కిడ్నీ వ్యాధులను సైలెంట్ కిల్లర్‌గా పరిగణిస్తారు.
ముప్పు పెంచుతున్న జీవనశైలి, అలవాట్లు
దక్షిణ భారతీయ పురుషుల్లో కిడ్నీ వ్యాధి వచ్చే ప్రమాదాన్ని పెంచే కారణాలు అనేకం ఉన్నాయి. మన ప్రాంతంలో మధుమేహం (డయాబెటిస్), రక్తపోటు (బీపీ) సమస్యలు చాలా ఎక్కువ. ఇవే దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధికి (క్రానిక్ కిడ్నీ డిసీజ్ - CKD) ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. చాలా కాలం పాటు అదుపులో లేని బ్లడ్ షుగర్ లెవెల్స్ కిడ్నీల్లోని సున్నితమైన రక్తనాళాలను దెబ్బతీస్తాయి. అలాగే అధిక రక్తపోటు కూడా కాలక్రమేణా కిడ్నీలకు శాశ్వత నష్టాన్ని కలిగిస్తుంది.
దీనికి తోడు వ్యాయామం లేకుండా ఎక్కువసేపు కూర్చుని పనిచేసే జీవనశైలి, అధిక బరువు, ధూమపానం, మితిమీరిన మద్యపానం, ఉప్పు, ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం లాంటి అలవాట్లు కిడ్నీల పతనానికి దారితీస్తున్నాయి. తలనొప్పి, కీళ్ల నొప్పులు లేదా వెన్నునొప్పి కోసం వైద్యుల సలహా లేకుండా మెడికల్ షాపుల నుంచి తెచ్చుకుని తరచూ వాడే పెయిన్ కిల్లర్స్ (నొప్పి నివారణ మందులు) కిడ్నీలను తీవ్రంగా దెబ్బతీస్తాయి. ఈ మందులను ఎక్కువ కాలం ఉపయోగించడం వల్ల కిడ్నీలు పనితీరును కోల్పోయే ప్రమాదం ఉంది.
తక్కువ వయసులోనే కిడ్నీ సమస్యలు
గతంతో పోలిస్తే ఇప్పుడు కిడ్నీ వ్యాధులు తక్కువ వయసు వారిలోనూ ఎక్కువగా కనిపిస్తున్నాయి. కుటుంబంలో వంశపారంపర్యంగా కిడ్నీ వ్యాధుల చరిత్ర ఉన్నా, మెటబాలిక్ సిండ్రోమ్ లేదా గుండె సంబంధిత వ్యాధులు ఉన్నా ఈ ముప్పు మరింత పెరుగుతుంది. కిడ్నీ వ్యాధి నెమ్మదిగా అభివృద్ధి చెందే స్వభావం కలిగి ఉండటంతో, దాన్ని ప్రారంభ దశలోనే గుర్తించడం అత్యంత అవసరం.
ముందస్తు స్క్రీనింగ్‌తోనే రక్షణ
కిడ్నీ సమస్యలను ముందే గుర్తిస్తే చికిత్స చాలా సులువవుతుంది. సరైన వైద్యం, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం, డయాబెటిస్, బీపీలను నియంత్రణలో ఉంచుకోవడం ద్వారా వ్యాధి ముదరకుండా అడ్డుకోవచ్చు. దీనివల్ల భవిష్యత్తులో కిడ్నీ ఫెయిల్యూర్ కావడం, డయాలసిస్ లేదా కిడ్నీ మార్పిడి వరకు వెళ్లే అవసరం తప్పడమే కాకుండా, గుండె జబ్బుల ముప్పు కూడా తగ్గుతుంది.
ఒక వాహనాన్ని క్రమం తప్పకుండా సర్వీస్ చేయించడం ద్వారా పెద్ద పెద్ద ఖర్చులు, రిపేర్లను ఎలా నివారిస్తామో.. కిడ్నీలను కూడా క్రమం తప్పకుండా పరీక్షించుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని, జీవన నాణ్యతను కాపాడుకోవచ్చు. ఏడాదికోసారి చేయించుకునే ఒక సాధారణ పరీక్ష, రాబోయే ఎన్నో సంవత్సరాల పాటు కిడ్నీలను పదిలంగా ఉంచడానికి సహాయపడుతుంది.
- డాక్టర్ ఏవీఎస్ఎస్ఎన్ శ్రీధర్,
నెఫ్రాలజీ కన్సల్టెంట్,
మణిపాల్ హాస్పిటల్స్, విజయవాడ
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

E-Paper


