Uddanam kidney Crisis : కిడ్నీ వ్యాధి మూలాలపై అన్వేషణ - ఉద్దానంలో తొలిసారిగా 'బయోమార్కర్' పరీక్షలు..!
Uddanam kidney Crisis : శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ వ్యాధుల మూలాలను కనుగొనేందుకు ఐసీఎంఆర్ భారీ పరిశోధన ప్రారంభించింది. అత్యాధునిక 'బయో మార్కర్స్' విధానం ద్వారా రాబోయే మూడేళ్లలో వ్యాధి వచ్చే అవకాశాలను ముందే గుర్తించనున్నారు.
Uddanam kidney Crisis : శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ వ్యాధి మూలాల అన్వేషణ ప్రక్రియ మొదలైంది. నిపుణుల నియామకాలు, మౌలిక సదుపాయాల కల్పన పూర్తయ్యింది. విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రిలో అత్యాధునిక పరికరాలతో ప్రత్యేకంగా ల్యాబ్ ను ఏర్పాటు చేశారు. ఉద్దాన ప్రాంత వాసుల నుంచి వ్యాధుల రాకకు కారణాలపై రక్త నమూనాలను సేకరిస్తున్నారు.

తొలిసారిగా బయోమార్కర్ పరీక్షలు…
కిడ్నీ వ్యాధుల బారినపడే అవకాశం ఉన్న వారిని ముందుగానే గుర్తించేలా మూత్ర నమూనాల పరీక్షలో 'బయో మార్కర్స్' విధానాన్ని ఈ సారి కొత్తగా అమలు చేస్తున్నారు. ప్రత్యేకంగా రూపొందించిన ప్రశ్నావళి ద్వారా స్థానికుల నుంచి సమాధానాలు రాబడుతున్నారు. ఇప్పటివరకు ఉద్దాన ప్రాంతంలో తీసుకున్న చర్యల గురించి పరిశోధన బృందం సభ్యులు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కు నివేదించారు.
ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ … పరిశోధన చురుగ్గా నిర్వహించాలని, ఉద్దాన బాధితుల్లో సాంత్వన చేకూరేలా చర్యలుండాలని సభ్యులకు స్పష్టం చేశారు.
ఉద్దాన ప్రాంతంలో కిడ్నీ వ్యాధులు అధికంగా ఉన్నందున వాటి మూలాలు కనుగొనేందుకు గతేడాది నవంబరులో ఇండియన్ కౌన్సెల్ అఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్-డిపార్టుమెంట్ అఫ్ హెల్త్ రీసెర్చ్ విభాగం) మూడేళ్ల కాలపరిమితితో ప్రత్యేకంగా రూ.6.2 కోట్లను గ్రాంటు రూపంలో ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. మంత్రి సత్యకుమార్ యాదవ్ చొరవ మేరకు ఐసిఎంఆర్ సానుకూలంగా స్పందించింది. సీనియర్ నెఫ్రాలజిస్ట్ ప్రొఫెసర్ తాతపూడి రవిరాజు మెంటార్‌గా అంధ్ర వైద్య కళాశాల నెఫ్రాలజీ ప్రొఫెసర్ డాక్టర్ జి.ప్రసాద్ ప్రిన్సిపల్ ఇన్విస్టిగేటర్‌గా పరిశోధన ప్రారంభమైంది.
శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులతో ప్రత్యేకంగా ఏర్పడిన బృందం ఉద్దాన ప్రాంత స్థానికులను కలుసుకుంటోంది. ఇప్పటివరకు సుమారు 1,500 మంది నుంచి రక్త, మూత్ర నమూనాలను సేకరించింది. వీటిని పలాసలోని కిడ్నీ రీసెర్చ్ కేంద్రంలో తొలుత భద్రపరిచి, ఆ తర్వాత తగిన జాగ్రత్తలతో కేజీహెచ్ లో ఉన్న ల్యాబ్ కు తరలిస్తున్నారు.
ఐసీఎంఆర్ ఆమోదం తెలిపిన మేరకు విశాఖ కేజీహెచ్ లో సెంట్రిప్యూజ్ లు, డీప్ ఫ్రీజర్లు, శాంపిల్ స్టోరేజీ సిస్టమ్స్, అనలిటకల్ ఇన్‌స్ట్రుమెంట్స్, ఫీల్డ్ శాంపిలింగ్ కిట్లు ఈ ల్యాబ్ లు ఉన్నాయి. సుమారు రూ.80 లక్షలతో కొనుగోలుచేసిన అత్యాధునిక పరికరాలు/ యంత్రాలను బయో సేఫ్టీ ప్రమాణాలకు ల్యాబ్ లో ఏర్పాటయ్యాయి.
కిడ్నీ వ్యాధుల తీవ్రతపై అంచనా..!
బయో మార్కర్స్ టెస్టింగ్ ద్వారా కిడ్నీ బాధితులను ప్రాథమిక దశలోనే అతి త్వరగా గుర్తించేందుకు వీలుందని మెంటార్ డాక్టర్ రవిరాజ్, ప్రిన్సిపల్ ఇన్విస్టిగేటర్ డాక్టర్ జి. ప్రసాద్ వెల్లడించారు. మూత్ర నమూనాలను 'బయో మార్కర్ విధానంలో పరీక్షించడంవల్ల రానున్న మూడు, నాలుగు సంవత్సరాల్లో కిడ్నీ వ్యాధుల బారినపడేందుకు అవకాశం ఉన్నట్లయితే సూక్ష్మ స్థాయిలో తెలిసిపోతుందని వివరించారు.
కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మూకుమ్మడిగా ఇటువంటి పరీక్షలు చేయడం ఇదే తొలిసారి అని చెప్పారు. మూత్ర నమూనాల సేకరణలో బాధితుల కుటుంబ నేపథ్యం, ఇతర అంశాలను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఈ ఈ పరీక్షల ద్వారా రానున్న మూడు, నాలుగేళ్లలో కిడ్నీ సమస్య వచ్చే అవకాశం ఉందా? లేదా? వస్తే ఏ స్థాయిలో వచ్చేందుకు అవకాశాలున్నాయి? అన్న వాటిపై స్పష్టత వస్తుందని వైద్యులు వెల్లడించారు.
ఈ ఫలితాల ఆధారంగా రోగులు తగిన జాగ్రత్తలతో వ్యవహరించేందుకు, వైద్యాన్ని అందించేందుకు సులువవుతుందని తెలిపారు. దీనివల్ల వ్యాధి ముదరకుండా... కిడ్నీలు చెడిపోకుండా ఉండేందుకు వీలుంది. ఆర్ఎన్పీ సీక్వెన్సింగ్ విధానంలో జన్యుపరమైన పరీక్షలు కూడా ఈ పరిశోధనలో భాగంగా చేస్తామని తెలిపారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

