Miss Universe India 2026 : మిస్ యూనివర్స్ ఇండియా ఎవరు? ఈరోజే గ్రాండ్ ఫినాలే! పోటీలో 52మంది..
Miss Universe India 2026 finale date : గులాబీ నగరమైన జైపూర్‌లో నేడు మిస్ యూనివర్స్ ఇండియా 2026 గ్రాండ్ ఫినాలే జరగనుంది. 52 మంది ఫైనలిస్టులు తలపడనున్న ఈ వేడుకకు సుస్మితా సేన్ నేతృత్వం వహిస్తోంది. వివరాల్లోకి వెళితే..
సౌందర్య ప్రపంచం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్షణాలొచ్చేశాయి! మిస్ యూనివర్స్ ఇండియా 2026 గ్రాండ్ ఫినాలే ఈరోజు సాయంత్రం జైపూర్‌లో జరగనుంది. ఈ ఫైనల్‌లో దేశవ్యాప్తంగా ఎంపికైన 52 మంది ఫైనలిస్టులు పోటీపడనున్నారు. ఈ ఏడాది చివర్లో ప్యూర్టో రికో వేదికగా జరగనున్న 75వ మిస్ యూనివర్స్ అంతర్జాతీయ పోటీలకు మన దేశం తరఫున ప్రాతినిధ్యం వహించే సరికొత్త సుందరిని ఎంపిక చేసేందుకు ఈ ఫైనల్ రౌండ్ వేదికవుతోంది.

ఈ నేపథ్యంలో ఈ మిస్ యూనివర్స్ ఇండియా 2026కి సంబంధించిన వివరాలను ఇక్కడ చూసేయండి..
మిస్ యూనివర్స్ ఇండియా 2026- గ్రాండ్ ఫినాలే వేదిక, టైమ్..
ఆగస్టు 23, 2026న భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటలకు ఈ వేడుక ప్రారంభమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు దీన్ని వీక్షించేందుకు వీలుగా 'గ్లామనంద్' అధికారిక యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
ఈ వేడుకకు రాజస్థాన్ రాజధాని జైపూర్ వేదికైంది. రాయల్ హెరిటేజ్, చారిత్రక కోటలు, సంప్రదాయ కళలకు నిలయమైన ఈ పింక్ సిటీ.. భారతీయ సంస్కృతిని ఆధునిక మహిళా సాధికారతతో ముడిపెట్టే ఈ అందాల పోటీకి సరిగ్గా సరిపోయే అద్భుతమైన నేపథ్యాన్ని అందిస్తోంది.
మిస్ యూనివర్స్ ఇండియా 2026- జ్యూరీ ప్యానెల్..
మిస్ యూనివర్స్ ఇండియా 2026లో భాగంగా ఈ 52 మంది సుందరీమణుల ప్రతిభను పరీక్షించేందుకు సినీ, ఫ్యాషన్ రంగానికి చెందిన ప్రముఖులతో కూడిన అత్యున్నత స్థాయి జ్యూరీ కమిటీ సిద్ధమైంది. భారతదేశపు మొట్టమొదటి మిస్ యూనివర్స్ (1994) విజేత, ప్రముఖ నటి సుస్మితా సేన్ ఈ ప్యానెల్‌కు నేతృత్వం వహిస్తున్నారు. ఈమెతో పాటు మాజీ టైటిల్ హోల్డర్లు సెలినా జైట్లీ (మిస్ యూనివర్స్ ఇండియా 2001), ఊర్వశి రౌతేలా (మిస్ యూనివర్స్ ఇండియా 2015), ప్రముఖ చలనచిత్ర నిర్మాత ప్రగ్యా కపూర్ తదితరులు జ్యూరీ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు.
మిస్ యూనివర్స్ ఇండియా 2026- ఆడిషన్స్ నుంచి ఫైనల్ స్టేజ్ వరకు..
ఈ మెగా ఫినాలే ప్రయాణం దిల్లీ, బెంగళూరుతో పాటు అనేకs ప్రధాన నగరాల్లో సాగిన ఆడిషన్స్‌తో మొదలైంది. వేలాది మంది దరఖాస్తుదారులను ఫిల్టర్ చేసుకుంటూ.. ఈ మెగా ఈవెంట్ ఇప్పుడు ఫినాలే వరకు చేరింది. వివిధ రాష్ట్రాల టైటిల్ విజేతలు, వైల్డ్‌కార్డ్ ఎంట్రీలు, విదేశీ ప్రవాస భారతీయుల ప్రతినిధులుగా మొత్తం 52 మంది ఫైనల్‌లో అడుగుపెట్టారు. గడచిన కొన్ని రోజులుగా జైపూర్‌లో ఇంటర్వ్యూలు, స్విమ్‌సూట్ రౌండ్, ఈవినింగ్ గౌన్ ప్రెజెంటేషన్స్ వంటి ప్రిలిమినరీ రౌండ్లను వీరు విజయవంతంగా పూర్తి చేసుకున్నారు.
మిస్ యూనివర్స్ ఇండియా 2026- పోటీల సరళి ఎలా ఉంటుంది?
ఈ ఫినాలే ఎలిమినేషన్ పద్ధతిలో సాగుతుంది. ప్రిలిమినరీ జ్యూరీ స్కోర్లు, పబ్లిక్ ఓటింగ్ ఆధారంగా మొదట 52 మంది నుంచి టాప్ 20 కంటెస్టెంట్లను ఎంపిక చేస్తారు. షార్ట్‌లిస్ట్ అయిన ఆ సుందరీమణులు స్విమ్‌సూట్, ఈవెనింగ్-వేర్ రౌండ్లలో పోటీపడతారు. ఆ తర్వాత వారి మానసిక స్థైర్యం, అవగాహన, కమ్యూనికేషన్ నైపుణ్యాలను పరీక్షించే ప్రశ్న-జవాబుల సెగ్మెంట్ ఉంటుంది.
మిస్ యూనివర్స్ ఇండియా 2026 ఎవరు?
ఈ అద్భుతమైన వేడుక ముగింపులో ప్రస్తుత టైటిల్ హోల్డర్ మనికా విశ్వకర్మ తదుపరి మిస్ యూనివర్స్ ఇండియాకు కిరీటాన్ని అలంకరిస్తారు. విజేతగా నిలిచిన యువతి నవంబర్‌లో ప్యూర్టో రికోలో జరిగే 75వ మిస్ యూనివర్స్ పోటీలో భారత్ తరఫున ఎంబాసిడర్‌గా వ్యవహరిస్తారు. అంతర్జాతీయ వేదికపై సత్తా చాటేందుకు వీలుగా ఆమెకు స్టైలింగ్, ఫిట్‌నెస్, పబ్లిక్ స్పీకింగ్‌లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


