నెలలు నిండకుండా పుట్టే శిశువులకు ఆధునిక వైద్యమే సంజీవని
గర్భం దాల్చిన 37 వారాల కంటే ముందే జన్మించే శిశువులకు ప్రత్యేక సంరక్షణ అవసరం. ఆధునిక ఎన్ఐసీయూ సేవలు, శ్వాసకోశ చికిత్స, పోషకాహారం, కంగారూ మదర్ కేర్ ద్వారా ఈ చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు వైద్య రంగం ఎలా భరోసా ఇస్తుందో యశోద హాస్పిటల్స్ నిపుణులు వివరిస్తున్నారు.
నవమాసాలు నిండకుండానే భూమిపైకి వచ్చే పసికందుల సంరక్షణ తల్లిదండ్రులకు, వైద్యులకు ఒక సవాలుగా మారుతుంది. గర్భం దాల్చిన 37 వారాల కంటే ముందే జన్మించే శిశువులను ప్రీమెచ్యూర్ లేదా ప్రీటర్మ్ బేబీస్ అని పిలుస్తారు. తల్లి గర్భంలో వీరి శరీర అవయవాలు ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల, బయటి ప్రపంచానికి అలవాటు పడేందుకు వీరికి అదనపు వైద్య సహాయం తప్పనిసరి అవుతుంది. అయితే నియోనాటల్ వైద్య రంగంలో వచ్చిన ఆధునిక మార్పులు ఈ చిన్నారుల సంరక్షణ తీరును పూర్తిగా మార్చేశాయి. కేవలం ప్రాణాలు కాపాడటమే కాకుండా, వారి ఆరోగ్యకరమైన ఎదుగుదల, సమగ్ర అభివృద్ధిపైనే ఆధునిక వైద్యం ప్రధానంగా దృష్టి సారిస్తోందని హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్స్ కన్సల్టెంట్ పీడియాట్రీషియన్, నియోనాటాలజిస్ట్ డాక్టర్ బి. ప్రశాంత్ బాబు తెలిపారు.

ప్రస్తుత ఆధునిక నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు (ఎన్ఐసీయూ) అత్యాధునిక వైద్య పరికరాలు, నిపుణులైన వైద్యుల పర్యవేక్షణ, శిశు అభివృద్ధి సంరక్షణను మేళవించి ప్రతి బిడ్డ వ్యక్తిగత అవసరాలకు తగ్గట్లుగా చికిత్స అందిస్తున్నాయి. ఆధునిక నియోనాటల్ కేర్ ప్రీమెచ్యూర్ శిశువులకు ఏ విధంగా అండగా నిలుస్తుందో డాక్టర్ బి. ప్రశాంత్ బాబు వివరంగా తెలియజేశారు.
ఆధునిక శ్వాసకోశ చికిత్స.. ఉష్ణోగ్రత నియంత్రణ
నెలలు నిండకుండా పుట్టే శిశువులలో ఊపిరితిత్తులు పూర్తిగా ఎదగవు. ఊపిరితిత్తులలోని గాలి తిత్తులను తెరిచి ఉంచే 'సర్ఫాక్టెంట్' అనే పదార్థం వీరిలో తగినంతగా ఉండదు. దీనివల్ల చిన్నారులకు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. ఇలాంటి సమయంలో 'సర్ఫాక్టెంట్ రీప్లేస్మెంట్ థెరపీ' ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుంది. వెంటిలేటర్ల అవసరాన్ని తగ్గిస్తూ శిశువులు సులభంగా శ్వాస తీసుకునేందుకు కంటిన్యూయస్ పాజిటివ్ ఎయిర్‌వే ప్రెజర్ (సీప్యాప్), ఇతర నాన్-ఇన్వేసివ్ శ్వాసకోశ పద్ధతులు ఎంతగానో తోడ్పడతాయి. శిశువు అవసరాలకు అనుగుణంగా ఆక్సిజన్ స్థాయిలను వైద్యులు నిశితంగా గమనిస్తూ సర్దుబాటు చేస్తారు.
మరోవైపు ప్రీమెచ్యూర్ శిశువుల శరీరంలో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల వారు తమ శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకోవడం కష్టమవుతుంది. ఆధునిక ఇంక్యుబేటర్లు తగినంత ఉష్ణోగ్రత, తేమతో కూడిన నియంత్రిత వాతావరణాన్ని అందిస్తాయి. తద్వారా చిన్నారుల శరీర శక్తి వృథా కాకుండా నిలిచి, వారి ఎదుగుదలకు దోహదపడుతుంది.
ప్రత్యేక పోషకాహారం.. ఎన్ఐసీయూలో సున్నితమైన సంరక్షణ
నెలలు నిండని శిశువులు బరువు పెరగడానికి, మెదడు అభివృద్ధి చెందడానికి, సమగ్ర ఎదుగుదలకు తగిన పోషకాహారం అత్యంత కీలకం. అయితే కొందరు ప్రీమెచ్యూర్ శిశువులు పుట్టిన వెంటనే పాలు తాగలేరు, మింగలేరు. నోటి ద్వారా ఆహారం అందించడం సాధ్యం కాని పరిస్థితుల్లో నరాల ద్వారా (ఇంట్రావీనస్ న్యూట్రిషన్) అవసరమైన పోషకాలను అందిస్తారు. శిశువు సొంతంగా పాలు తాగే సామర్థ్యాన్ని పెంచుకునే వరకు ట్యూబ్ ఫీడింగ్ ద్వారా తల్లి పాలను అందిస్తారు. వీరి అధిక పోషక అవసరాలను తీర్చేందుకు వైద్యులు బ్రెస్ట్ మిల్క్ ఫోర్టిఫైయర్లను కూడా సిఫార్సు చేస్తారు.
ఆధునిక నియోనాటల్ కేర్ శిశువులో ఎదుగుతున్న మెదడు, నాడీ వ్యవస్థను రక్షించడంపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతుంది. అధిక శబ్దాలు, ప్రకాశవంతమైన లైట్లు, అనవసరంగా పదేపదే తాకడం వల్ల పసికందులు ఒత్తిడికి గురవుతారు. అందుకే ఎన్ఐసీయూలలో శబ్దాలను తగ్గించడం, లైటింగ్‌ను సర్దుబాటు చేయడం, చాలా సున్నితంగా తాకడం, తగినంత విశ్రాంతినివ్వడం వంటి పద్ధతులను పాటిస్తారు. శిశువు ఎదుగుదల దశ, తట్టుకునే సామర్థ్యాన్ని బట్టి వ్యక్తిగత సంరక్షణ అందిస్తారు.
కంగారూ మదర్ కేర్.. తల్లిదండ్రుల భాగస్వామ్యం
తల్లి లేదా తండ్రి ఛాతీకి బిడ్డను హత్తుకుని ఉంచే చర్మంతో చర్మం స్పర్శను 'కంగారూ మదర్ కేర్' (కేఎంసీ) అంటారు. ప్రీమెచ్యూర్ శిశువుల సంరక్షణలో ఇది అద్భుతమైన పాత్ర పోషిస్తుంది. వైద్యపరంగా అనుకూలంగా ఉన్నప్పుడు ఈ పద్ధతిని అనుసరించడం వల్ల శిశువు శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. తల్లిపాలు తాగడాన్ని ప్రోత్సహించడంతో పాటు శారీరక స్థిరత్వాన్ని మెరుగుపరుస్తుంది. తల్లిదండ్రులు, బిడ్డ మధ్య భావోద్వేగ అనుబంధాన్ని బలోపేతం చేస్తుంది.
ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ తర్వాత ఫాలో-అప్ తప్పనిసరి
ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లిన తర్వాత కూడా నియోనాటల్ సంరక్షణ కొనసాగాలి. శిశువు బరువు పెరుగుదల, ఆహారం తీసుకునే తీరు, చూపు, వినికిడి, ఎదుగుదల మైలురాళ్లను పర్యవేక్షించేందుకు క్రమం తప్పకుండా పిల్లల వైద్యులతో (పీడియాట్రిక్) ఫాలో-అప్ పరీక్షలు చేయించాలి. ఏవైనా సమస్యలు ఉంటే ప్రారంభ దశలోనే గుర్తించి తగిన చికిత్స అందించేందుకు ఇది వీలు కల్పిస్తుంది.
నియోనాటల్ టెక్నాలజీలో వచ్చిన పురోగతి, ప్రత్యేక పోషకాహారం, కుటుంబ సభ్యుల భాగస్వామ్యంతో కూడిన సంరక్షణ వల్ల ప్రీమెచ్యూర్ శిశువులకు జీవిత ప్రారంభ దశలోనే అత్యుత్తమ మద్దతు లభిస్తోంది. వీరి ఆరోగ్యకరమైన ఎదుగుదల, దీర్ఘకాలిక అభివృద్ధికి వ్యక్తిగత వైద్య పర్యవేక్షణ, క్రమం తప్పని ఫాలో-అప్ పరీక్షలు ఎంతో అవసరమని డాక్టర్ బి. ప్రశాంత్ బాబు స్పష్టం చేశారు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

E-Paper


