దీపావళి వేళ కాలుష్యం ముప్పు: ఊపిరితిత్తుల సంరక్షణకు 6 కీలక సూచనలు

దీపావళి పండగ వేళ గాలి నాణ్యత పడిపోవడం శ్వాసకోశ వ్యవస్థకు తీవ్ర సవాలుగా మారుతోంది. విజయవాడ మణిపాల్ ఆసుపత్రి శ్వాసకోశ నిపుణులు డాక్టర్ ఉదయ్ కిరణ్ జీ తెలిపిన 6 ముందస్తు జాగ్రత్తలు, ప్రాథమిక హెచ్చరిక సంకేతాల వివరాలు ఇవే.

Published on: Nov 8, 2026, 18:30:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

దీపావళి పండగ సమయాల్లో బాణసంచా పొగ వల్ల గాలి నాణ్యత పడిపోవడంతో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుతోంది. దీనివల్ల వాతావరణంలో పెరిగే సూక్ష్మ ధూళికణాలు శ్వాసకోశ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఆస్తమా, సీఓపీడీ, అలర్జిక్ రైనైటిస్ వంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారికి ఈ సమయం ఎంతో క్లిష్టమైనది. ఎలాంటి శ్వాసకోశ అనారోగ్యాలు లేని వారిలోనూ గొంతు మంట, ఎడతెరిపి లేని దగ్గు, పిల్లికూతలు, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని విజయవాడ మణిపాల్ ఆసుపత్రి శ్వాసకోశ నిపుణులు డాక్టర్ ఉదయ్ కిరణ్ జీ తెలిపారు.

దీపావళి పండగల వేళ మీ ఊపిరితిత్తులు జాగ్రత్త
దీపావళి పండగల వేళ మీ ఊపిరితిత్తులు జాగ్రత్త

గాలి కాలుష్యం ఊపిరితిత్తులకు ఎందుకు ప్రమాదకరం?

పండగ వేళ బయటకు వెళ్లే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. కంటికి కనిపించే పొగ మాత్రమే కాకుండా, బాణసంచా కాల్చడం వల్ల గాలిలోకి విడుదలయ్యే అత్యంత సూక్ష్మ ధూళికణాలు (పీఎం 2.5), విషవాయువులు ఊపిరితిత్తుల లోతుల్లోకి చేరుతాయి.

"పండగల వేళ విడుదలయ్యే పీఎం 2.5 కణాలు చాలా చిన్నవిగా ఉండటం వల్ల ఊపిరితిత్తులలోకి లోతుగా చొచ్చుకెళ్లి రక్తప్రవాహంలోకి చేరుతాయి. ఇవి శరీరం అంతటా వాపునకు (Inflammation), శ్వాసనాళాల్లో తీవ్రమైన మంటకు కారణమవుతాయి" అని డాక్టర్ ఉదయ్ కిరణ్ విశ్లేషించారు. పొగను పీల్చడం వల్ల శ్వాసనాళాల వాపు, కఫం పెరగడం, శ్వాసనాళాలు కుంచించుకుపోవడం జరుగుతుంది. ఆస్తమా ఉన్నవారికి ఆకస్మిక దాడి (Acute attack) ముప్పు పెరగ్గా, సీఓపీడీ బాధితుల్లో శ్వాస ఆడకపోవడం, దగ్గు తీవ్రమవుతాయి.

తీవ్రమైన ముప్పు ఎదుర్కొంటున్న వర్గాలు ఇవే

కాలుష్యం పెరిగిన వేళ ప్రధానంగా రెండు వర్గాల ప్రజలు శ్వాసకోశ పరంగా తీవ్ర ముప్పు ఎదుర్కొంటున్నారని వైద్యులు తెలిపారు.

పిల్లలు: వీరి ఊపిరితిత్తులు పెంపకంలో ఉండి పూర్తిగా అభివృద్ధి చెందకపోవడం, శరీర బరువుతో పోలిస్తే శ్వాస తీసుకునే వేగం ఎక్కువగా ఉండటంతో వీరు ఎక్కువ పరిమాణంలో కాలుష్య కారకాలను పీల్చుకుంటారు.

వయోవృద్ధులు: వయసు మళ్లినవారు, అందునా ఇదివరకే గుండె లేదా ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలు ఉన్నవారు స్వల్ప సమయం కాలుష్యానికి గురైనా ఆరోగ్యం వేగంగా క్షీణిస్తుంది.

ప్రాథమిక హెచ్చరిక సంకేతాలు

శ్వాసకోశ ఆరోగ్యం క్షీణిస్తోందని తెలిపే క్రింది సూచనలను తాత్కాలిక అసౌకర్యంగా భావించి నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

  • ఎడతెరిపి లేని దగ్గు, ఛాతీలో బిగుతుగా ఉండటం లేదా పిల్లికూతలు రావడం.
  • శ్వాసకోశ ఇన్‌హేలర్లను సాధారణం కంటే ఎక్కువగా వాడాల్సి రావడం.
  • రాత్రి వేళల్లో దగ్గు ఎక్కువై నిద్రకు భంగం కలగడం.
  • రోజువారీ అలవాటైన శారీరక శ్రమ లేదా వ్యాయామాలు చేయడం కష్టంగా మారడం.
  • మందులు వాడుతున్నప్పటికీ లక్షణాలు తీవ్రమవ్వడం లేదా ఇన్‌హేలర్ల ప్రభావం తగ్గడం.

ఊపిరితిత్తుల సంరక్షణకు 6 కీలక మార్గాలు

పండగ అనంతరం కొన్ని రోజుల పాటు ప్రతి ఒక్కరూ ఈ క్రింది జాగ్రత్తలు పాటించాలని డాక్టర్ ఉదయ్ కిరణ్ సూచించారు.

నిత్యం ఏక్యూఐ పరిశీలించండి: స్థానిక ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) వివరాలను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తూ, కాలుష్యం తక్కువగా ఉండే సమయాల్లో మాత్రమే బయటి పనులను ప్లాన్ చేసుకోండి.

ఇంటి వాతావరణాన్ని సురక్షితంగా ఉంచండి: బాణసంచా ఎక్కువగా కాల్చే వేళల్లో తలుపులు, కిటికీలు మూసివేయండి. ఇంట్లో గాలిని శుభ్రంగా ఉంచేందుకు హెపా (HEPA) ఫిల్టర్లు ఉన్న ఎయిర్ ప్యూరిఫైయర్లను ఉపయోగించడం మంచిది.

సరైన మాస్క్ ధరించండి: బయటకు వెళ్లడం అనివార్యమైతే ఎన్95 (N95) లేదా కేఎన్95 (KN95) మాస్క్‌లను సరిగ్గా ధరించాలి. సాధారణ సర్జికల్ లేదా గుడ్డ మాస్క్‌లు సూక్ష్మ ధూళికణాలను (పీఎం 2.5) నిరోధించలేవని గుర్తుంచుకోండి.

తీవ్రమైన వ్యాయామాలను తగ్గించండి: ఏక్యూఐ ఎక్కువగా ఉన్న సమయంలో రన్నింగ్ లేదా అధిక శారీరక శ్రమతో కూడిన వ్యాయామాలను నివారించాలి. వేగంగా శ్వాస తీసుకోవడం వల్ల ఎక్కువ కాలుష్యం ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది.

మందులను క్రమం తప్పకుండా వాడండి: వైద్యులు సూచించిన మందులు, ఇన్‌హేలర్లు అందుబాటులో ఉంచుకుని నిరంతరం వాడాలి. డాక్టర్ సలహా లేకుండా డోసేజ్ మార్చడం కానీ, వాడకం నిలిపివేయడం కానీ చేయకూడదు.

ఇంటి లోపలి కాలుష్యాన్ని నివారించండి: ఇండోర్ ఇర్రిటెంట్స్ అయిన అగరబత్తులు, దోమల కాయిల్స్ వెలిగించడం లేదా ఇంట్లో పొగతాగడం వంటి వాటికి దూరంగా ఉండాలి.

అత్యవసరంగా వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి?

కొన్ని ప్రాథమిక సూచనలు ప్రాణాపాయ స్థితికి సంకేతం కావచ్చు. క్రింది అత్యవసర లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్య సహాయం పొందాలి.

  • తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బంది లేదా శ్వాస ఆడకపోవడం.
  • నిరంతరాయంగా ఒక పూర్తి వాక్యం కూడా మాట్లాడలేకపోవడం.
  • ఛాతీలో తగ్గని తీవ్రమైన నొప్పి.
  • పెదవులు లేదా చేతి గోళ్లు నీలిరంగులోకి మారడం.
  • హఠాత్తుగా గందరగోళానికి గురికావడం.

(గమనిక: ఈ కథనం కేవలం ప్రాథమిక సమాచారం, అవగాహన కోసం మాత్రమే ప్రచురించాం. ఇది నిపుణులైన వైద్యుల సలహాకు ప్రత్యామ్నాయం కాదు. శ్వాసకోశ సమస్యలకు సంబంధించిన ఎలాంటి సందేహాలు ఉన్నా వెంటనే అర్హులైన వైద్యులను సంప్రదించాలి.)

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More