చలికాలంలో ఆరోగ్యం, వెచ్చదనం ఇచ్చే పంజీరీ లడ్డూ.. అమ్మ చేతి స్పెషల్ రెసిపీ మీకోసం
చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచి, వెచ్చదనాన్నిచ్చే పంజీరీ లడ్డూ తయారీ విధానం, దాని ప్రయోజనాలను ఇక్కడ తెలుసుకోండి. గర్భిణీలు, బాలింతలకు ఇది ఒక అద్భుతమైన హెల్తీ స్నాక్.
చలికాలం మొదలైందంటే చాలు.. వాతావరణంలో మార్పుల వల్ల త్వరగా అలసిపోవడం, దగ్గు, జలుబు వంటి సమస్యలు చుట్టుముట్టడం సహజం. ఇలాంటి సమయంలో మన శరీరానికి లోపలి నుంచి వెచ్చదనాన్ని, శక్తిని ఇచ్చే ఆహారం ఎంతో అవసరం. ‘అందుకే, మా అమ్మ తన పంజాబీ స్టైల్‌లో చేసే పంజీరీ లడ్డూ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇది కేవలం ఒక స్వీట్ మాత్రమే కాదు, తరతరాలుగా వస్తున్న ఒక అద్భుతమైన ‘వింటర్ సూపర్ ఫుడ్’ అని క్లౌడ్‌నైన్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ న్యూట్రిషనిస్ట్ హర్‌ప్రీత్ కౌర్ వివరించారు.

అసలు పంజీరీ అంటే ఏమిటి?
"వేయించిన గోధుమ పిండి లేదా పెసర పప్పు పొడిని నెయ్యి, డ్రై ఫ్రూట్స్, సుగంధ ద్రవ్యాలు, బెల్లంతో కలిపి చేసే ఒక పోషకాహార మిశ్రమమే పంజీరీ. ఇది చలిని తట్టుకునే శక్తిని ఇవ్వడమే కాకుండా, తీపి తినాలనే కోరికను ఆరోగ్యకరమైన పద్ధతిలో తీరుస్తుంది" అని న్యూట్రిషనిస్ట్ హర్‌ప్రీత్ కౌర్ వివరించారు.
పంజీరీ లడ్డూ తయారీకి కావాల్సినవి:
- స్వచ్ఛమైన నెయ్యి: 1 కిలో
- పచ్చ పెసర పప్పు పొడి: 1 కిలో
- గోధుమ పిండి: 1 కిలో
- డ్రై ఫ్రూట్స్: ఒక కప్పు (బాదం, జీడిపప్పు, కొబ్బరి తురుము, తామర గింజలు లేదా మఖానా)
- బెల్లం తురుము: అర కిలో (తీపిని బట్టి పెంచుకోవచ్చు)
పంజీరీ లడ్డూ తయారు చేసే విధానం:
- నెయ్యి వేడి చేయడం: ముందుగా ఒక పెద్ద కడాయిలో నెయ్యి వేసి తక్కువ మంట మీద పూర్తిగా కరిగించాలి.
- పప్పు పొడి వేయించడం: కరిగిన నెయ్యిలో పెసర పప్పు పొడి వేసి 30 నుంచి 45 నిమిషాల పాటు దోరగా వేయించాలి. పప్పు మంచి రంగు మారి, కమ్మని సువాసన వచ్చే వరకు ఓపికగా వేయించడం చాలా ముఖ్యం.
- పిండి కలపడం: ఇప్పుడు అందులోనే గోధుమ పిండిని కూడా కలిపి మరో 30 నిమిషాల పాటు వేయించాలి. అది గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి.
- డ్రై ఫ్రూట్స్: పిండి బాగా వేగాక, పొడి చేసిన మఖానా, ఎండు కొబ్బరి, డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని కలిపి మరో 10 నుంచి 15 నిమిషాలు వేయించాలి.
- చల్లార్చడం: మిశ్రమం వేగాక స్టవ్ ఆపేసి, ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టాలి.
- బెల్లం కలపడం: మిశ్రమం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే బెల్లం తురుము కలపాలి. మరీ వేడిగా ఉన్నప్పుడు కలిపితే బెల్లం కరిగిపోయి లడ్డూ ఆకృతి సరిగ్గా రాదు.
- లడ్డూలు చుట్టడం: బెల్లం బాగా కలిశాక, చిన్న చిన్న లడ్డూలుగా చుట్టుకుని గాలి చొరబడని డబ్బాలో భద్రపరుచుకోవాలి.

పంజీరీ లడ్డూతో కలిగే ప్రయోజనాలు:
- రోగనిరోధక శక్తి: ఇందులోని పోషకాలు చలికాలంలో వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తాయి.
- గర్భిణీలు, బాలింతలకు వరం: గర్భిణీ స్త్రీలకు అవసరమైన శక్తిని ఇవ్వడంతో పాటు, బాలింతల్లో పాలు పెరగడానికి, ప్రసవం తర్వాత త్వరగా కోలుకోవడానికి ఇది ఎంతో సహాయపడుతుంది.
- ఎముకల బలం: "నెయ్యి, డ్రై ఫ్రూట్స్ కీళ్ల నొప్పులను తగ్గించి, ఎముకలను దృఢంగా మారుస్తాయి" అని హర్‌ప్రీత్ కౌర్ పేర్కొన్నారు.
- మెదడు, కంటి ఆరోగ్యం: పిల్లల నుంచి పెద్దల వరకు అందరిలోనూ మెదడు చురుకుదనాన్ని, కంటి చూపును మెరుగుపరచడంలో ఇది తోడ్పడుతుంది.
(ముఖ్య గమనిక: ఒక లడ్డూలో సుమారు 150-200 కేలరీలు ఉంటాయి. కాబట్టి, ఆరోగ్యానికి మంచిదే కదా అని అతిగా తినకుండా రోజుకు ఒకటి చొప్పున తీసుకోవడం ఉత్తమం.)
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

E-Paper


