...
...
Next Story

Pradeep Rawat : బ్లడ్ క్యాన్సర్​తో ప్రదీప్ రావత్ మృతి- ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి..

ప్రసిద్ధ నటుడు ప్రదీప్ రావత్ (74) బ్లడ్ క్యాన్సర్‌తో కన్నుమూశారు. ఈ నేపథ్యంలో బ్లడ్ క్యాన్సర్ ముందస్తు లక్షణాలు, ప్రారంభ దశలోనే గుర్తించాల్సిన అవసరం గురించి ముంబై క్యాన్సర్ నిపుణులు తెలిపిన వివరాలు..

Published on: Aug 5, 2026, 14:15:29 IST
Advertisement

భారతీయ చలనచిత్ర రంగంలో తన విలక్షణ నటనతో చెరగని ముద్ర వేసిన సీనియర్ నటుడు ప్రదీప్ రావత్ (74) మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. 'గజిని', 'లగాన్', 'మహాభారత్' వంటి సంచలన చిత్రాలు, ధారావాహికల్లో శక్తివంతమైన పాత్రలు పోషించిన ఆయన.. గడిచిన కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్‌తో తీవ్రంగా పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే భివాండీలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో, క్యాన్సర్ తిరగబెట్టడంతో ఆయన ఆరోగ్యం క్షీణించి కన్నుమూశారని వైద్యాధికారులు వెల్లడించారు.

బ్లడ్ క్యాన్సర్​తో ప్రదీప్ రావత్ మృతి
బ్లడ్ క్యాన్సర్​తో ప్రదీప్ రావత్ మృతి

వైద్య నివేదికల ప్రకారం.. భారత్‌లో ప్రతి సంవత్సరం బ్లడ్ క్యాన్సర్ కారణంగా 70,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోతుండగా, దాదాపు 1,00,000 కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. భగవాన్ మహావీర్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ అందించిన ఈ గణాంకాలు ఈ వ్యాధి పట్ల అవగాహన, ముందస్తు నిర్ధారణ ఎంత అత్యవసరమో స్పష్టం చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో బ్లడ్ క్యాన్సర్‌ను ప్రారంభంలోనే గుర్తించడం ఎందుకు ముఖ్యం, దాని లక్షణాలు ఎలా ఉంటాయో ముంబైలోని 'M|O|C క్యాన్సర్ కేర్' హెమాటో-ఆంకాలజిస్ట్ డాక్టర్ ఆశ్రయ్ కోలే వివరించారు.

బ్లడ్ క్యాన్సర్ అంటే ఏంటి?

డాక్టర్ ఆశ్రయ్ వివరణ ప్రకారం.. రక్తంలో, బోన్ మ్యారో లేదా లింఫాటిక్ సిస్టెమ్ కణాలు అసాధారణంగా పెరగడాన్ని బ్లడ్ క్యాన్సర్‌గా పరిగణిస్తారు. ఇందులో ప్రధానంగా మూడు రకాలు ఉంటాయి:

  • ల్యూకేమియా
  • లింఫోమా
  • మల్టిపుల్ మైలోమా

భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్), జాతీయ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ గణాంకాల ప్రకారం.. మనదేశంలో నమోదయ్యే మొత్తం క్యాన్సర్ కేసుల్లో ఇవి గణనీయమైన సంఖ్యలో ఉంటున్నాయి. ప్రధానంగా పిల్లలు, యువతలో ఇవి ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ, ఇటీవలి కాలంలో పెద్దవారిలోనూ ఈ తరహా క్యాన్సర్లు బయటపడుతున్నాయి.

బ్లడ్ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు చాలా సాధారణంగా అనిపిస్తాయని, దీనివల్ల కాలానుగుణంగా వచ్చే సాధారణ అనారోగ్య సమస్యలుగా భావించి చాలామంది పొరబడతారని డాక్టర్ ఆశ్రయ్ హెచ్చరిస్తున్నారు. కింద పేర్కొన్న లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి:

“తగ్గకుండా వేధించే జ్వరం ఉండటం, ప్రయత్నం లేకుండానే ఆకస్మికంగా బరువు తగ్గడం, తీవ్రమైన నీరసం, తరచూ ఇన్ఫెక్షన్ల బారిన పడటం, రాత్రివేళల్లో విపరీతంగా చెమటలు పట్టడం, మెడ లేదా చంకల్లో గడ్డలు (లింఫ్ నోడ్స్) ఉబ్బడం, శరీరంపై త్వరగా రాపిడి గీతలు పడటం లేదా రక్తస్రావం కావడం, ఎముకల నొప్పులు దీర్ఘకాలంగా వేధించడం.. ఇవన్నీ బ్లడ్ క్యాన్సర్‌కు ముందస్తు హెచ్చరికలు. వీటిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు,” అని హెమాటో-ఆంకాలజిస్ట్ డాక్టర్ ఆశ్రయ్ కోలే

బ్లడ్ క్యాన్సర్‌కు ఖచ్చితమైన కారణాలు లేనప్పటికీ.. వయసు పెరగడం, కొన్ని రకాల జన్యుపరమైన లోపాలు, గతంలో రేడియేషన్ లేదా కీమోథెరపీ తీసుకోవడం, పొగతాగడం, బెెంజీన్ వంటి ప్రమాదకర రసాయన స్పర్శకు గురికావడం వల్ల ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం పెరుగుతుంది.

వ్యాధి నిర్ధారణ - ఆధునిక చికిత్సలు..

బ్లడ్ క్యాన్సర్‌ను గుర్తించేందుకు సాధారణ రక్త పరీక్షలతో పాటు బోన్ మ్యారో పరీక్ష, ఇమ్యునోఫినోటైపింగ్, సైటోజెనెటిక్ విశ్లేషణ, మాలిక్యులర్ టెస్టులు చేస్తారు. ఈ పరీక్షలు వ్యాధి రకాన్ని సరిగ్గా గుర్తించి, తగిన చికిత్సా విధానాన్ని ఎంచుకోవడానికి వైద్యులకు సహాయపడతాయి.

గడిచిన దశాబ్దకాలంలో క్యాన్సర్ వైద్య రంగంలో అద్భుతమైన మార్పులు వచ్చాయి. కీమోథెరపీతో పాటు టార్గెటెడ్ థెరపీలు, ఇమ్యునోథెరపీ, మోనోక్లోనల్ యాంటీబాడీస్, స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్, ప్రిసిషన్ మెడిసిన్ వంటి సరికొత్త చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. ఇవి బాధితుల ఆయుర్దాయాన్ని పెంచడమే కాకుండా, వారు మెరుగైన జీవితాన్ని గడిపేందుకు తోడ్పడుతున్నాయి.

బ్లడ్ క్యాన్సర్ నిర్ధారణ అయినంత మాత్రాన ఆశలు వదులుకోవాల్సిన అవసరం లేదని, ప్రారంభ దశలోనే గుర్తించి సరైన వైద్యం అందిస్తే చాలా రకాల బ్లడ్ క్యాన్సర్లను పూర్తిగా నయం చేయవచ్చని డాక్టర్ ఆశ్రయ్ ధైర్యాన్నిచ్చారు.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. మరిన్ని వివరాల కోసం మీరు మీ వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.)

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON