ఉత్తర తెలంగాణకు గుడ్ న్యూస్.... వరంగల్‌లో రెండో అతిపెద్ద క్యాన్సర్ ఆస్పత్రి - ఈ ఏడాది నుంచే సూపర్ స్పెషాలిటీ సేవలు!
Warangal Cancer Hospital : తెలంగాణలో రెండో అతిపెద్ద ప్రభుత్వ కేన్సర్ ఆస్పత్రిని వరంగల్‌లో ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రకటించారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణాన్ని ఈ ఏడాది ఆఖరు నాటికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు.
Warangal Cancer Hospital : ఉత్తర తెలంగాణ ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని వారి ఇంటి గుమ్మం వద్దకే చేర్చేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. హైదరాబాద్ నిమ్స్ తరహాలోనే రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద ప్రభుత్వ కేన్సర్ హాస్పిటల్‌ను వరంగల్‌లో ఏర్పాటు చేయబోతున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రకటన చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు సమీప జిల్లాల ప్రజలకు అత్యాధునిక కేన్సర్ చికిత్సలను పూర్తి ఉచితంగా అందించేలా ఈ రీజనల్ కేన్సర్ సెంటర్‌ను తీర్చిదిద్దనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

ప్రస్తుతం యుద్ధప్రాతిపదికన నిర్మాణంలో ఉన్న వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులను ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేసి ప్రజల వినియోగంలోకి తీసుకొస్తామని మంత్రి వెల్లడించారు. సెక్రటేరియట్‌లోని తన చాంబర్‌లో మంత్రి కొండా సురేఖతో కలిసి వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల వైద్య సేవలపై మంత్రి దామోదర్ రాజనర్సింహ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలతో పాటు వైద్యారోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు.
ఉమ్మడి జిల్లా పరిధిలోని మెడికల్ కాలేజీలు, ఏరియా హాస్పిటళ్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (PHCలు), కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో అందుతున్న వైద్య సేవలు, మౌలిక వసతులపై అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. స్థానిక ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో వైద్య రంగంలో ఎదురవుతున్న క్షేత్రస్థాయి సమస్యలను, ఆస్పత్రుల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలను సమావేశంలో లేవనెత్తారు. ప్రజాప్రతినిధులు అందించిన సూచనలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు.
ఎంజీఎం ఆస్పత్రిలో మార్పులు…!
ఉమ్మడి వరంగల్ ప్రజలకు ప్రాణదాతగా ఉన్న ఎంజీఎం (MGM) హాస్పిటల్‌ను మరింత ఆధునికీకరిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. "ప్రస్తుతం ఎంజీఎంలో 29 స్పెషాలిటీ విభాగాల్లో సేవలు అందుతుండగా, త్వరలోనే మరో 9 సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందుబాటులోకి తెస్తున్నాం," అని దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు. దీనికి కావలసిన పరిపాలనా అనుమతులు, మౌలిక వసతుల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని హెల్త్ సెక్రటరీని ఆయన ఆదేశించారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఇరు రాష్ట్రాల్లోనే అతిపెద్ద హెల్త్ హబ్‌గా మారుస్తామన్నారు.
హైదరాబాద్ నిమ్స్ తరహాలోనే వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి నేరుగా 'లెటర్ ఆఫ్ క్రెడిట్' (LOC) మంజూరు చేసే వెసులుబాటు కల్పిస్తామని మంత్రి తెలిపారు. అత్యాధునిక మెడికల్ ఎక్విప్‌మెంట్, సీనియర్ డాక్టర్లు, పూర్తి స్థాయి పారామెడికల్ సిబ్బందిని ఇక్కడ నియమించనున్నారు. అలాగే జనగామ, నర్సంపేట జనరల్ హాస్పిటళ్లు, మెడికల్ కాలేజీల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని పేర్కొన్నారు.
మరికొన్ని నిర్ణయాలు :
- సంతానలేమితో బాధపడే పేదల కోసం ప్రత్యేక ఐవీఎఫ్ కేంద్రాన్ని, దానితో పాటు ఆధునిక డ్రగ్ అండ్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
- ప్రాంతీయ కంటి ఆస్పత్రిలో అడ్వాన్స్‌డ్ నేత్ర వైద్య సేవలను ప్రవేశపెడతారు.
- పరకాల, వర్ధన్నపేట, స్టేషన్ ఘన్‌పూర్, బచ్చన్నపేట, పాలకుర్తి, కమలాపూర్ ప్రాంతాల్లో కొత్తగా మంజూరైన డయాలసిస్ సెంటర్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరలోనే ప్రారంభించనున్నారు.
- ఎంజీఎం హాస్పిటల్ పర్యవేక్షణ కోసం అడిషనల్ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌ను రెగ్యులర్ సూపరింటెండెంట్‌గా నియమించనున్నారు. ఉమ్మడి జిల్లా ఆస్పత్రుల తీరుతెన్నులను పర్యవేక్షించేందుకు ఒక ఐఏఎస్ అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
"జిల్లా స్థాయిలోనే అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ వైద్యం లభిస్తే, పేద రోగులు హైదరాబాద్‌లోని నిమ్స్, గాంధీ, ఉస్మానియా వంటి ఆస్పత్రులకు రావాల్సిన అవసరం ఉండదు. హైదరాబాద్ ఆస్పత్రులపై ఒత్తిడి తగ్గడమే కాకుండా, స్థానికంగానే రోగులకు వేగవంతమైన చికిత్స అందుతుంది," అని మంత్రి దామోదర వివరించారు. ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు ఆస్పత్రుల పనితీరును పర్యవేక్షిస్తూ, ప్రభుత్వంతో కలిసి పీపుల్ ఫ్రెండ్లీ హెల్త్ కేర్ అందించాలని పిలుపునిచ్చారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

