భారతదేశంలో సగటు ఆయుర్దాయం పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో సగటు జీవన ప్రమాణం 70 ఏళ్లు దాటింది. 60 ఏళ్ల వయస్సులో పూర్తి ఆరోగ్యంతో పదవీ విరమణ పొందే వ్యక్తి 80 నుంచి 85 ఏళ్ల వరకు జీవించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2036 నాటికి భారత్‌లోని ప్రతి ముగ్గురిలో ఒకరు 60 ఏళ్లు పైబడినవారే ఉంటారని అంచనా. ఇవి కేవలం జనాభా గణాంకాలు మాత్రమే కావు; మన రిటైర్మెంట్ ప్లానింగ్ విధానాన్ని మూలమలుపు తిప్పాల్సిన అత్యవసర పరిస్థితులకు సంకేతాలు.
రిటైర్మెంట్ ఒకే దశ కాదు.. మూడు ఘట్టాల ప్రయాణం

పదవీ విరమణ అనగానే జీవితాంతం ఒకే రకమైన ఆర్థిక పరిస్థితి ఉంటుందనుకోవడం పెద్ద పొరపాటు. రిటైర్మెంట్ జీవితం మూడు వేర్వేరు దశల్లో సాగుతుంది. ప్రతి దశలోనూ ఆదాయ అవసరాలు, రిస్క్ తీసుకునే సామర్థ్యం భిన్నంగా ఉంటాయి.
మొదటి దశ (తొలి 10 ఏళ్లు): ఇది చాలా క్రియాశీలకమైన సమయం. ప్రయాణాలు, అలవాట్ల కోసం ఖర్చులు కాస్త ఎక్కువగా ఉంటాయి. కన్సల్టింగ్ లేదా పార్ట్ టైమ్ పని ద్వారా కొంత ఆదాయం వచ్చే వీలుంటుంది. సుదీర్ఘ కాలం ముందుకు ఉన్నందున, నిరంతర ఆదాయంతో పాటు పెట్టుబడుల వృద్ధిపై దృష్టి పెట్టవచ్చు.
రెండో దశ (10 నుంచి 15 ఏళ్ల మధ్య): ప్లానింగ్‌లోని లోపాలు బయటపడేది ఇక్కడే. వ్యక్తిగత ఆకాంక్షలకు చేసే ఖర్చులు తగ్గినప్పటికీ, వైద్య ఖర్చులు క్రమంగా పెరుగుతాయి. సరైన ముందస్తు ప్రణాళిక లేకపోతే కూడబెట్టిన నిధి వేగంగా కరిగిపోతుంది.
మూడో దశ (75 ఏళ్లు దాటిన తర్వాత): ఈ వయసులో ఆర్థిక కచ్చితత్వం చాలా ముఖ్యం. స్థిరమైన, నిరంతర ఆదాయం అందాలి. వైద్య ఖర్చులకు తగిన రక్షణ ఉండాలి. తరచూ మార్చుకోవాల్సిన అవసరం లేని సరళమైన ఆర్థిక వ్యవస్థ అందుబాటులో ఉండాలి.
ఈ మూడు దశల వ్యూహం లేకుండా ఒకే కార్పస్ నిధి, ఒకే రకమైన విత్డ్రావల్ రేటుతో 25 ఏళ్ల సుదీర్ఘ కాలాన్ని నెట్టుకురావడం అసాధ్యం.
అసలైన ముప్పు మార్కెట్ హెచ్చుతగ్గులు కాదు.. ద్రవ్యోల్బణమే!
{{/usCountry}}ఈ మూడు దశల వ్యూహం లేకుండా ఒకే కార్పస్ నిధి, ఒకే రకమైన విత్డ్రావల్ రేటుతో 25 ఏళ్ల సుదీర్ఘ కాలాన్ని నెట్టుకురావడం అసాధ్యం.
అసలైన ముప్పు మార్కెట్ హెచ్చుతగ్గులు కాదు.. ద్రవ్యోల్బణమే!
{{/usCountry}}సాధారణంగా రిటైర్మెంట్ నిధిని కాపాడుకోవడానికి ఈక్విటీల నుంచి నిధులను ఉపసంహరించుకుని సురక్షిత డిపాజిట్లలో పెడుతుంటారు. రిటైర్మెంట్ వ్యవధి పదేళ్లు మాత్రమే ఉంటే ఈ వ్యూహం సరిపోతుంది. కానీ 25 ఏళ్లకు పైగా జీవించాల్సి వచ్చినప్పుడు, కొనుగోలు శక్తి పడిపోవడమే అసలైన ప్రమాదంగా మారుతుంది. ముఖ్యంగా భారత్‌లో సాధారణ ద్రవ్యోల్బణం కంటే వైద్య రంగానికి సంబంధించి ద్రవ్యోల్బణం (Healthcare Inflation) అత్యంత వేగంగా పెరుగుతోంది.
ఆయుర్దాయం పెరగడం, ద్రవ్యోల్బణం హెచ్చడం రెండూ కలిసి జీవితాంతం దాచుకున్న పొదుపు మొత్తాన్ని కరిగించేస్తాయి. అందుకే ప్రాథమిక అవసరాలకు గ్యారెంటీ ఆదాయం, సుదీర్ఘ కాలానికి ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే ఇన్వెస్ట్‌మెంట్లు, ఆకస్మిక వైద్య ఖర్చుల కోసం అత్యవసర నిధి ఉండేలా బహుళ అంచెల ప్లానింగ్ చేసుకోవాలి.
బీమా రంగానికి పెద్ద అవకాశం
మారుతున్న అవసరాలకు అనుగుణంగా లైఫ్ ఇన్సూరెన్స్ రంగానికి గొప్ప అవకాశం లభించింది. ఇప్పుడు కేవలం విడివిడిగా ఉత్పత్తులను అందించడం కాకుండా, జీవిత దశలకు అనుగుణంగా యాన్యుటీలు (Annuities), ఆరోగ్య రక్షణ ఆధారిత పొదుపు పథకాలను అనుసంధానించాల్సి ఉంది. ఆర్థిక సలహాదారులు కూడా కేవలం నిధిని జమ చేయడంపైనే కాకుండా, సుదీర్ఘ జీవితానికి సరిపడా నిరంతర ఆదాయం అందేలా కస్టమర్లకు క్రమం తప్పకుండా మార్గదర్శకత్వం వహించాలి.
25 ఏళ్లకు పైబడిన సుదీర్ఘ రిటైర్మెంట్ ప్రయాణంలో వైద్య ఖర్చులు పెరగడం, కుటుంబ పరిస్థితులు మారడం సహజం. పెరుగుతున్న ఆయుర్దాయాన్ని దృష్టిలో ఉంచుకుని, డిపాజిటర్లు తమ జీవిత కాలాన్ని అంచనా వేసుకోవడంలో వాస్తవ దృక్పథంతో వ్యవహరించాలి. అలాగే ఆర్థిక సంస్థలు కూడా కేవలం ప్రారంభ సంవత్సరాలకే కాకుండా, మొత్తం రిటైర్మెంట్ ప్రయాణానికి సరిపోయే పరిష్కారాలను రూపొందించాలి.
వ్యాసకర్త:
నితిన్ అగర్వాల్,
అపాయింటెడ్ యాక్చువరీ,
కెనరా హెచ్‌ఎస్‌బీసీ లైఫ్ ఇన్సూరెన్స్