మరణమే శరణమా…!? ఆత్మహత్యల నివారణకు డాక్టర్ విజయ్ విశ్లేషణాత్మక సలహాలు

ప్రైమరీ స్కూల్ లో ఉండగా ఓ రోజు బాపు ఎవరితోనో మాట్లాడుతూ పక్కూళ్ళో ఓ బాబు ఎలా చనిపోయాడో చెబుతున్నాడు. ఏదో వింతగా అనిపించి నేను కూడా అటు వైపుగా వెళ్ళి ఓ చెవి వేసా. 

Updated on: Sep 15, 2026, 08:17:10 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓ హై స్కూల్ లో చదివే బాబు వాళ్ల నాన్న దగ్గరికి వెళ్ళి నవ్వుకుంటా “బాపు నీ పేరు ఏంది?” అని అడిగితే, ఆ తండ్రి కాస్త కోపంగా “నా పేరు తెలవదారా ?, పోయి గా బాయిల దుంకి సావపోయినవ్” అనగానే నిజంగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి బావిలో దూకి చనిపోయాడు.

‘మనిషి సంఘజీవి. నలుగురితో కలవాలి, నా అనుకునే వాళ్ళని ఒక్కరినైనా సంపాదించుకోవాలి. ఒంటరితనం అత్యంత భయానక శిక్ష. అది ఎప్పుడు ఎటువైపుగా ముగింపు ఇస్తుందో తెలియదు.’ - డాక్టర్ విజయ్
‘మనిషి సంఘజీవి. నలుగురితో కలవాలి, నా అనుకునే వాళ్ళని ఒక్కరినైనా సంపాదించుకోవాలి. ఒంటరితనం అత్యంత భయానక శిక్ష. అది ఎప్పుడు ఎటువైపుగా ముగింపు ఇస్తుందో తెలియదు.’ - డాక్టర్ విజయ్

ఎంత షాకింగ్ విషయం అది. తప్పెవరిది? సరదాగా అడిగితే సీరియస్ గా రియాక్ట్ అయిన తండ్రిదా…? అంతే సరదాగా తీసుకోవాల్సిన సమాధానాన్ని సీరియస్ గా పాటించిన కొడుకుదా..? శిక్ష ఎవరికి?

బంగారు భవిష్యత్తు బుగ్గిపాలు చేసుకున్న బాబుకా…? కళ్ళముందే ఎదిగొచ్చిన కొడుకుని కోల్పోయిన తండ్రికా..? ఇది దాదాపు 35 ఏళ్ల కిందటి ముచ్చట. మరి ఇప్పటి పరిస్థితి తీసుకుంటే…

అక్క ఫోన్ ఇవ్వలేదు అని పై అంతస్తునుండి దూకిన తమ్ముడు. నాన్న బైక్ కొనివ్వలేదని ఫ్యాన్ కి వేలాడిన కొడుకు. భర్త పండక్కి తల్లిగారింటికి వద్దు అన్నాడని బావిలో దూకిన భార్య. భార్య కాపురానికి రావట్లేదని బీరులో పురుగుల మందు కలుపుకుని తాగి చనిపోయిన భర్త.

మనవడు సీరియల్ టైం కి TV రిమోట్ ఇవ్వలేదు అని 30 బీపీ టాబ్లెట్లు మింగిన బామ్మ. ప్రియురాలు మోసం చేసిందని పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ప్రియుడు. ప్రేమించిన వాడు పెళ్ళికి మొహం చాటేశాడని మణికట్టు కొసుకుని మరణించిన అమ్మాయి. కొడుకులు సరిగ్గా చూసుకోవట్లేదు అని కట్టకట్టుకుని తనువు చాలించిన తల్లి తండ్రులు.

దిగుబడి రాలేదని పొలంలోనే పురుగుల మందు తాగి పోయిన రైతన్న. పరీక్షలో ఫెయిల్ అయ్యా అని బ్రిడ్జి పైనుండి దూకిన విద్యార్థి. నష్టాలు, అప్పుల బాధతో హోటల్ లో విగత జీవిగా పడిపోయిన బడా వ్యాపార వేత్త. అవకాశాలు రాక కుంగిపోయి ఆత్మహత్య చేసుకున్న నటులు.

ఇలా మనం రోజూ టీవీల్లో పేపర్ లో సోషల్ మీడియా ల్లో తరచుగా చూసే, వినే, ఫార్వర్డ్ చేసే వార్తలే కదా. ఇక్కడ వయసుతో, జెండర్ తో, హోదాతో, ఆర్థిక స్థితితో, విద్యతో, వృత్తితో, ప్రాంతంతో సంబంధం లేదు. “అందరూ ఒక స్థితినుండి బయట పడలేక” ఇక మరణమే శరణమని నిర్ణయించుకుని ఈ లోకం వీడాలనుకున్న వారే. ఇది వ్యక్తిగత మానసిక రుగ్మతా…? సరి చేయలేని సామాజిక రుగ్మతా….?

“జంతునాం నరజన్మ దుర్లభం” అని ఆది శంకరాచార్యులు సెలవిచ్చారు. 84 లక్షల జీవరాశుల తర్వాత వచ్చే అద్భుతమైన జన్మ మానవ జన్మ. అలాంటి విలువైన జీవితాన్ని ఇలా అర్ధాంతరంగా మనకు మనం గానే ముగించడం ఏంటి..? మనిషన్నాక సమస్యలు ఉంటాయి. వాటిని పరిష్కరించుకునే విచక్షణ కూడా మనిషికే ఇచ్చాడు కానీ, మృగానికి అంతగా ఇవ్వలేదు కదా భగవంతుడు. నిజమే ఒక్కో మనిషి ఓపిక, సహనం, తట్టుకునే స్వభావం ఒక్కో రకంగా ఉంటాయి.

ఒకరికి సిల్లీగా అనిపించేది ఇంకొకరికి షాకింగ్ లా అనిపించొచ్చు. ఒకరు భరించలేం అనుకున్నది ఇంకొకరు సరదాగా తీసేయొచ్చు. వీరిలో చాలా వరకు చావడానికి అంత సులభంగా నిర్ణయించుకుని ఉండరు. ఎక్కడో చదివా “చావడానికి చాలా ధైర్యం కావాలి” అని. అంత ధైర్యం అయితే ఊరికే రాదు. వెనకాల సవాలక్ష కారణాలు ఉండొచ్చు. ఒక్కో వ్యక్తి బ్రేక్ పాయింట్ ఒక్కో లెవెల్ లో ఉండొచ్చు. తట్టుకునే త్రెషోల్డ్ లో తేడా కనిపించొచ్చు. బ్రేక్ పాయింట్ వచ్చినపుడు తదుపరి ఆలోచనలకు బ్రేక్ వేయడమే నివారణ మార్గం. కానీ అది అంత సులభమా..?

ఇలా విశేషిస్తూ పోతే అన్నీ చిక్కు ప్రశ్నలే. కొన్నింటికి మాత్రమే సమాధానం. కొన్నింటికి కన్ఫ్యూషన్. కొన్నింటికి మౌనం.

పరిష్కారం ఏంటి?

మరి సమాధానం లేనపుడు ఇదంతా సోది రాసుడు ఎందుకు అనిపించడం తప్పేం కాదు కదా. నా వరకు వృత్తి రీత్యా పిల్లల వైద్యుడినే. PG లో థీసిస్ టాపిక్ కాస్త డిఫరెంట్ గా ఉండి తర్వాత ఇంట్రెస్టింగ్ గా కూడా తోయడంతో అడాలెసెంట్/ టీనేజ్ హెల్త్ పై కొంచెం దృష్టి పెట్టా. ఇక నా ఈ 25 ఏళ్ల జీవితంలో (నాన్న పోయాక) సమాజంలోని చాలా కోణాలని కాస్త దగ్గరగానే చూడాల్సి వచ్చింది. ఈ చదువు & అనుభవాలతో చిక్కు ముడులు విప్పే చిన్న ప్రయత్నం అయితే చేస్తా.

ఓ మనిషి స్వభావాన్ని నిర్ణయించేవి జీన్స్/ అనువంశికత, పుట్టి పెరిగిన వాతావరణం, తల్లిదండ్రుల పెంపకం, స్కూల్లో ఫ్రెండ్స్, టీచర్స్, కాలేజీ, కొలీగ్స్ ఇలా రకరకాల అంశాలు ఉంటాయి. వీటిలో అనువంశిక అంశాలను పెద్దగా మార్చలేక పోవచ్చు. వాటి సంఖ్య కూడా తక్కువగానే ఉండొచ్చు. మిగతా అంశాలు మాత్రం విపరీత ప్రభావం చూపించి వాటి వల్ల బాధితులు కూడా ఎక్కువే ఉంటారు. స్కూల్, కాలేజీల్లో మార్కులు & ర్యాంక్ ల మీదే మొత్తం ఫోకస్ చేసి అసలు లైఫ్ స్కిల్స్ ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లలకి పెద్దయ్యాక ఉద్యోగం వచ్చే లో ప్యాకేజీ ల మీద పెట్టే శ్రద్ధ పెంపకంలో చూపించడం మర్చిపోయారు.

జీవితంలో ఓటమిని ఎలా తీసుకోవాలి, కష్టం వచ్చినపుడు ఎలా ఎదుర్కొని నిలబడాలి అనేది ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తున్న అతి ముఖ్యమైన అంశం. అది చిన్నప్పటి నుండే అలవర్చాలి. ఇంట్లో అమ్మా నాన్నల నుండి బళ్ళో, కాలేజీలో టీచర్లు, ప్రిన్సిపాల్ వరకూ దీనిపై ఆలోచన చేయాలి. అనలైజింగ్ ది థింగ్స్, క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లం సాల్వింగ్ అనేవి జీవితంలో చాలా ముఖ్యమైన మూల సూత్రాలు.

అవి అప్పటికప్పుడు వచ్చేవి కాదు. సిల్వర్ స్పూన్ తో పుట్టిన వాళ్ళకి ఒక స్టేజ్ వరకు కష్టాలు తెలియక పోవచ్చు. ఎందుకంటే అన్నీ అమ్మ నాన్నే దగ్గరుండి చూసుకుంటారు కాబట్టి. కానీ పై చదువులకు దూరంగా వెళ్ళినపుడో, హాస్టల్ లో ఉండాల్సి వచ్చినపుడో ఆ కొత్త వాతావరణానికి అలవాటు పడే క్రమం లో ఎదురయ్యే సమస్యల వల్ల తనువు చాలించిన వాళ్ళు ఉన్నారు.

మా MBBS ఇమీడియేట్ జూనియర్ బ్యాచ్ అనుకుంటా EAMCET లో State (Combined AP) 1st Ranker కాలేజీలో జాయిన్ అయిన కొద్ది రోజుల్లోనే మిస్ అయి పోయాడు చాలా సంవత్సరాల వరకు అసలు ఏమయ్యాడో కూడా తెలియదు. ఇప్పటికీ కూడా మిస్టరీ నే అనుకుంటా. Enquiry లో పేరెంట్స్ ని అడిగితే “Stress లో ఉన్నాడు” అని చెప్పారంట. ఆ సరస్వతీ పుత్రుడి జీవితం అలా అర్ధాంతరంగా అయోమయం అయింది. ఇంకా బాధాకరమైన విషయం… వైద్య విద్య పూర్తి చేసుకుని, వృత్తిలోకి వచ్చాక కూడా ఇలా ఆత్మహత్య చేసుకోవడం. కొద్ది నెలల క్రితం కూడా మరో యువ వైద్యుడు మన దగ్గరే ఇలా సూసైడ్ చేసుకున్నాడు.

అసలు సూసైడ్ వల్ల సమస్య ఎలా ముగుస్తుంది…?

నిజానికి అక్కడే ఇంకో క్లిష్టమైన సరిచేయలేని సమస్య మొదలవుతుంది. తను పోయి మిగిలిన కుటుంబ సభ్యులకు ఎంత నష్టం, కష్టం కలిగిస్తారు. కొందరు నిందలు, అభాండాలను భరించాల్సి వస్తుంది. ఒక్కోసారి పోయిన వాళ్ళకి కూడా అవి తప్పవు. చావు అనేది గౌరవంగా ఉండాలని కోరుకుంటారు అలాంటిది ఆత్మహత్య అనేది అత్యంత అగౌరవమైనది కాదా..? అనాథలయిన పిల్లల భవిష్యత్తు కూడా అగమ్య గోచరం అవుతుంది. మిగిలిపోయిన సహచరుల్లో ఒంటరితనం ఆవహించి కొన్ని సార్లు అపరాధభావం పోయే దాకా కుంగదీస్తుంది. ఏ రకంగా చూసినా ఆత్మహత్య ఏ సమస్యకీ ఎన్నటికి పరిష్కారం కానే కాదు. పైపెచ్చు సమస్యని జటిలం చేస్తుంది.

సమస్య ఒక వ్యక్తి వల్ల అయితే ఆ వ్యక్తి నుండి కనబడంత దూరం వెళ్ళి బ్రతకొచ్చు. ఓ బంధం బాధ్యత వల్ల సమస్య అయితే అవి వదులుకుని వెళ్ళి బ్రతకొచ్చు. ఆర్థిక సమస్య అయితే ఇంకో కొలువు, మరో వ్యాపారం చివరికి అడుక్కు తిని అయినా బతకొచ్చు. చుట్టూ సమాజం వల్ల ఇబ్బంది ఉంటే నువ్వెవరివో తెలియని చోటకి వెళ్ళి కొత్త జీవితం మెదలు పెట్టొచ్చు. జిల్లా, రాష్ట్రం, దేశం కూడా దాటి వెళ్ళి పోవచ్చు. బ్రతకడం ముఖ్యం, పెద్ది చెప్పినట్టు “మళ్ళీ పుడతామా ఏంటి..?” మరలాంటప్పుడు బ్రతకడంలో మజా చూడొచ్చు కదా, పోయి ఏం పీకుతారు.

పైనే చెప్పినట్టు ఒక్కొక్కరి థ్రెషోల్డ్ & బ్రేక్ పాయింట్ ఒక్కో లెవెల్ లో ఉంటాయి. కానీ సమస్య ఉంది అనేది అయితే ముందే తెలుస్తుంది. అలాంటప్పుడు స్వతహాగా పరిష్కారం లేదంటే దగ్గరి వాళ్ళతో పంచుకోవడం లాంటివి దోహద పడుతాయి. ప్రతీ మనిషికి ఒక “నా అనుకునే వ్యక్తి” చాలా అవసరం. అర్జున్ రెడ్డి మూవీ లో “శివ”, సంజు సినిమాలో “కమలేష్”, మా ఇంటి బంగారం లో “కిరణ్మయి” అంత కాకపోయినా, కాస్త బాధ అనిపించినపుడు ముచ్చటకో, ఓ 3 పెగ్గులు వేయడానికో, సోది అనిపించినా కూడా అప్పుడప్పుడు సారీల షాపింగ్ కి కంపెనీనో/ మేక్ ఓవర్ కి సలహాలో ఇచ్చిందనో మొహమాటానికి వినే పొరుగింటావిడ అయినా ఉండాలి.

మనిషి సంఘజీవి. నలుగురితో కలవాలి, నా అనుకునే వాళ్ళని ఒక్కరినైనా సంపాదించుకోవాలి. ఒంటరితనం అత్యంత భయానక శిక్ష. అది ఎప్పుడు ఎటువైపుగా ముగింపు ఇస్తుందో తెలియదు.

సైన్స్, వైద్యరంగం ఇంత అభివృద్ధి చెందినా, మానసిక వైద్యులు, మనస్తత్వ నిపుణుల సంఖ్య ఇంతలా పెరిగినా రోజు రోజుకి ఈ మానసిక జబ్బులు తద్వారా ఆత్మహత్యలు పెరుగుతూనే ఉన్నాయి. సోషల్ మీడియా విపరీత వాడకం, తద్వారా దెబ్బతింటున్న మానసిక ఆరోగ్యం, వీటన్నిటిపై వీలైనంతగా వివిధ దశల్లో అవగాహన కల్పించి, అదే సోషల్ మీడియా ద్వారా విరివిగా ప్రచారం చేయాలి. స్కూల్, కాలేజీల్లో, వృత్తి విద్యా కోర్సులలో ఎప్పటికపుడు నిపుణులతో చెప్పిస్తూ, చర్చిస్తూ ఉండాలి. సమస్య మొదట్లోనే గుర్తించి సరైన పరిష్కారం చూపాలి.

“Prevention is always better than Cure” అన్నారు. గౌరవప్రదమైన వృత్తిలో ఉండి ఈ సమాజం పట్ల మరింత బాధ్యతతో, మనకున్న పరిధిలో ఆరోగ్య కరమైన, ఆత్మహత్యలు అత్యంత తక్కువగా ఉన్న దేశంగా మలచడంలో మన వంతు సేవ చేద్దాం.

వ్యాసకర్త:

- డాక్టర్ చల్లూరి విజయ్ కుమార్

పిల్లల వైద్య నిపుణులు

మొబైల్ నెంబర్: 9032357877

డాక్టర్ చల్లూరి విజయ్ కుమార్, పిల్లల వైద్య నిపుణులు
డాక్టర్ చల్లూరి విజయ్ కుమార్, పిల్లల వైద్య నిపుణులు
  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More