...
...
Next Story

గృహిణి నుంచి కోట్ల వ్యాపారం వరకు! కొబ్బరితో నెలకు రూ. 20 లక్షల సేల్స్.. 'గ్రీన్ ఆరా' సక్సెస్ స్టోరీ!

కేరళకు చెందిన సుమిల జయరాజ్ గృహిణి స్థాయి నుంచి నెలకు రూ. 20 లక్షల టర్నోవర్ సాధించే స్థాయికి ఎదిగారు. కొబ్బరి ఆధారిత ఉత్పత్తులతో 'గ్రీన్ ఆరా' బ్రాండ్‌ను నెలకొల్పి అమెరికా, బ్రిటన్ వంటి దేశాలకు ఎగుమతి చేస్తున్న ఆమె స్ఫూర్తిదాయక విజయగాథ మీకోసం..

Published on: Sep 20, 2026, 16:30:42 IST
Advertisement

కొబ్బరి చెట్టు అనగానే మనకు వెంటనే గుర్తుకువచ్చేది చల్లటి కొబ్బరినీళ్లు, వంటల్లో వాడే కొబ్బరి తురుము లేదా చట్నీలు. దక్షిణాది ఇళ్లలోని వంటకాల్లో భాగమయ్యే కొబ్బరిని కేవలం ఆహార పదార్థంగా మాత్రమే చూశారు చాలామంది. కానీ, కేరళకు చెందిన సుమిల జయరాజ్ మాత్రం అందులోనే ఒక అద్భుతమైన వ్యాపార అవకాశాన్ని వెతుక్కున్నారు! సాధారణ గృహిణిగా జీవితాన్ని ప్రారంభించిన ఆమె, నేడు నెలకు రూ. 20 లక్షల సగటు విక్రయాలతో అంతర్జాతీయ స్థాయిలో కొబ్బరి ఉత్పత్తుల వ్యాపారాన్ని విజయవంతంగా నడుపుతున్నారు!

వ్యాపారవేత్తగా మారిన గృహిణి ప్రయాణం!

సుమిల జయరాజ్
సుమిల జయరాజ్

కేరళలోని ఇంగండియూర్ గ్రామంలో జన్మించిన సుమిల జయరాజ్ జువాలజీ, ఇంగ్లీష్ లిటరేచర్‌లో పట్టా పొందారు. వివాహానంతరం ఆమె భర్తతో కలసి ముంబైకి మారారు. కవల పిల్లలు జన్మించడంతో కుటుంబ బాధ్యతలకే తన సమయాన్ని కేటాయించారు. కొన్నేళ్ల తర్వాత ఆమె కుటుంబం తిరిగి కేరళకు వచ్చింది. ఆ తర్వాత పిల్లలు ఉన్నత చదువుల కోసం వేరే ప్రాంతాలకు వెళ్లడం, భర్త ఉద్యోగరీత్యా దుబాయ్ వెళ్లడంతో సుమిల ఇంట్లో ఒంటరిగా మిగిలిపోయారు.

తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని సుమిల ఆరాటపడ్డారు. ఆ ఆలోచనే ఆమెను స్థానికంగా వర్జిన్ కోకోనట్ ఆయిల్ (వీసీఓ) తయారుచేసే ఒక చిన్న కంపెనీలో ఉద్యోగంలో చేరేలా చేసింది.

"నా పని వేళల్లో వర్జిన్ కోకోనట్ ఆయిల్‌పై వచ్చే అనేక సందేహాలకు సమాధానాలు ఇచ్చేదాన్ని. విదేశీ కస్టమర్లతో మాట్లాడే బాధ్యత నాదే. ఆ క్రమంలోనే కంపెనీకి లండన్ నుంచి మొదటి ఎక్స్‌పోర్ట్ ఆర్డర్ సాధించడంలో విజయవంతమయ్యాను," అని సుమిల వెల్లడించారు.

ఇంట్లోని చిన్న షెడ్ నుంచి ప్రారంభమైన 'గ్రీన్ ఆరా'!

ఆ ఉద్యోగంలో వచ్చిన ఎక్స్​పీరియెన్స్​తో కొబ్బరి ఉత్పత్తులపై సుమిలకు పూర్తి పట్టు వచ్చింది. అదే సమయంలో సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనే బలమైన కోరిక ఆమెలో కలిగింది. వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేసి, తన ఇంటి పక్కనే ఉన్న ఒక చిన్న షెడ్‌లో సొంత తయారీ యూనిట్‌ను ప్రారంభించారు.

అనంతరం 2021లో 'గ్రీన్ ఆరా' బ్రాండ్‌ను అధికారికంగా మార్కెట్లోకి తీసుకొచ్చారు.

గ్లోబల్ బ్రాండ్‌గా రూపాంతరం..

కేవలం కొబ్బరి నూనెకే పరిమితం కాకుండా, వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ప్రొడక్ట్ లైన్‌ను విస్తరించారు. కొబ్బరి ఆధారిత చట్నీ పొడులు, పచ్చళ్లు, కొబ్బరి పాల పొడి, సాంబార్ పొడి వంటి అనేక రకాల ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చారు.

నేడు 'గ్రీన్ ఆరా' ఉత్పత్తులకు భారతీయ మార్కెట్లోనే కాకుండా అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, మలేషియా వంటి అంతర్జాతీయ దేశాల్లోనూ విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఇంటి వద్ద చిన్నగా ప్రారంభమైన ఈ ప్రయాణం నేడు నెలకు సగటున రూ. 20 లక్షల బిజినెస్‌ను సాధిస్తూ అనేకమందికి ప్రేరణగా నిలుస్తోంది.

సొంతంగా సాధించాలనే తపన ఉంటే వయసు, పరిస్థితులు అడ్డంకి కావని సుమిల జయరాజ్ నిరూపించారు!

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON