యూఏఈ లాటరీలో సెక్యూరిటీ గార్డుకు రూ.15 కోట్లు.. ఉద్యోగానికి గుడ్‌బై

యూఏఈలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ఒక నేపాల్ యువకుడిని అదృష్టం వరించింది. ఐదుగురు స్నేహితులతో కలిసి కొన్న లాటరీ టికెట్‌కు రూ.78 కోట్ల జాక్‌పాట్ తగలడంతో, అతని వాటాగా రూ.15 కోట్లు వచ్చాయి. ఈ డబ్బుతో ఉద్యోగం మానేసి సొంత వ్యాపారం ప్రారంభించడంతో పాటు మహీంద్రా తార్ కారు కొనాలని అతడు భావిస్తున్నాడు.

Published on: Jun 10, 2026, 08:08:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడే ఒక సాధారణ సెక్యూరిటీ గార్డు జీవితం ఒకే ఒక్క ఈమెయిల్‌తో రాత్రికి రాత్రే మారిపోయింది. యూఏఈ లక్కీ డే లాటరీ డ్రాలో అతనికి ఏకంగా 15 కోట్ల రూపాయల జాక్‌పాట్ తగిలింది. అప్పటివరకు నెలకు వచ్చే కొద్దిపాటి జీతంతో బతుకుబండి లాదిన ఆ యువకుడు ఇప్పుడు కోటీశ్వరుడిగా మారిపోయాడు.

తయాబ్ ఖాన్
తయాబ్ ఖాన్

వణికిపోయిన చేతులు.. నమ్మలేని నిజం

అబుదాబిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న నేపాల్‌కు చెందిన 26 ఏళ్ల తయాబ్ ఖాన్ ఈ అదృష్టవంతుడు. మే 27న ఈద్ అల్ అధా సెలవుల్లో రాత్రి డ్యూటీలో ఉన్న సమయంలో అతనికి లాటరీ తగిలినట్లు ఈమెయిల్ వచ్చింది. తయాబ్ ఖాన్‌తో పాటు అతని నలుగురు స్నేహితులు కలిసి దాదాపు 30 మిలియన్ దిర్హామ్‌ల (సుమారు రూ.78 కోట్లు) బంపర్ ప్రైజ్ గెలుచుకున్నారు. వీరంతా కలిసి ఒక్కొక్కరు 50 దిర్హామ్‌లు వేసుకుని ఈ టికెట్ కొన్నారు. ప్రైజ్ మనీని సమానంగా పంచుకోవడంతో తయాబ్ వాటాగా 6 మిలియన్ దిర్హామ్‌లు (దాదాపు రూ.15 కోట్లు) వచ్చాయి.

సాధారణంగా వచ్చే ఈమెయిల్ లాగే అనుకుని ఓపెన్ చేసిన తయాబ్, అందులోని ప్రైజ్ మనీ చూసి షాక్‌కు గురయ్యాడు.

"గతంలో చిన్నచిన్న బహుమతులు వచ్చినప్పుడు ఇలాగే ఈమెయిల్స్ వచ్చేవి. అందుకే దీనిని పెద్దగా పట్టించుకోలేదు. కానీ మెయిల్ ఓపెన్ చేసి 30 మిలియన్ దిర్హామ్‌లు అని చూడగానే నా చేతులు, కాళ్లు వణికిపోయాయి. ఇదంతా ఒక కలలా అనిపించింది" అని తయాబ్ తన సంతోషాన్ని పంచుకున్నాడు.

ఫేస్‌బుక్‌లో చూసి 2024 ఆరంభం నుండి ఈ ఐదుగురు స్నేహితులు క్రమంతప్పకుండా లాటరీ టికెట్లు కొంటున్నారు. ప్రతి వారం ఒకరు చొప్పున నంబర్లు ఎంచుకునేవారు. ఎన్నాళ్లో శ్రమించినా చిన్న బహుమతులే వచ్చినా నమ్మకం కోల్పోకుండా ప్రయత్నించి చివరకు అనుకున్నది సాధించారు.

సెక్యూరిటీ ఉద్యోగానికి గుడ్ బై

ఇంత పెద్ద మొత్తంలో డబ్బు రావడంతో తయాబ్ తన సెక్యూరిటీ గార్డు ఉద్యోగానికి స్వస్తి చెప్పాలని నిర్ణయించుకున్నాడు. "నేను ఇకపై ఇదే ఉద్యోగంలో కొనసాగలేను. జీవితంలో కొత్త అడుగులు వేయడానికి, ఇన్వెస్ట్‌మెంట్‌ రంగంలోకి అడుగుపెట్టడానికి ఇదే సరైన సమయం. సెక్యూరిటీ రంగాన్ని వదిలి వ్యాపారవేత్తగా మారాలనుకుంటున్నాను" అని తయాబ్ వెల్లడించాడు. గత నాలుగేళ్లుగా ఉద్యోగిగా పనిచేసిన తాను, ఇప్పుడు తదుపరి స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నాడు.

కుటుంబానికి ఇల్లు.. మహీంద్రా థార్‌పై కన్ను

ఈ సొమ్ముతో తన సొంత దేశమైన నేపాల్‌లోని కుటుంబానికి ఒక మంచి ఇల్లు నిర్మించడమే తన మొదటి లక్ష్యమని తయాబ్ చెప్పాడు. ఈ విజయం గురించి మొదట తన బాబాయికి సమాచారం అందించాడు. ఆయనే తయాబ్‌ను యూఏఈకి వచ్చేలా సహాయం చేశారు. ఈ వార్త వినగానే ఆయన కళ్లలో ఆనందబాష్పాలు వచ్చాయి.

దీర్ఘకాలిక ప్రణాళికలతో పాటు తన పాత కలలను కూడా నెరవేర్చుకోవాలని తయాబ్ భావిస్తున్నాడు. ఒక ఖరీదైన కారు, మంచి వాచ్ కొనడం అతని జాబితాలో ఉన్నాయి. భారత్‌కు చెందిన ప్రముఖ ఎస్‌యూవీ 'మహీంద్రా థార్' (Mahindra Thar) జీపుతో పాటు 'రోలెక్స్' (Rolex) వాచ్ కొనాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నట్లు తెలిపాడు. దుబాయ్‌లో ఒక అపార్ట్‌మెంట్ కొని రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టే యోచనలో కూడా ఉన్నాడు.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More