కష్టపడే తత్వానికి, పట్టుదలకు టైమ్ తోడైతే మనుషుల తలరాతలు ఎలా మారిపోతాయో చెప్పడానికి అజిత్ కుమార్ జీవితమే ఒక గొప్ప ఉదాహరణ. నిన్నటివరకు కుటుంబ పోషణ కోసం సైకిల్‌పై ఊరూరా తిరిగి ఫుడ్ డెలివరీ చేసిన ఒక సామాన్య కుర్రాడు.. నేడు కోట్లు సంపాదిస్తూ ఏకంగా ప్రముఖ 'జైపూర్ లిటరరీ ఫెస్టివల్'లో స్పీకర్‌గా ప్రసంగించే స్థాయికి ఎదిగాడు. ప్రముఖ ఆడియో ప్లాట్‌ఫామ్ ‘పాకెట్ ఎఫ్‌ఎమ్’ అందించిన అవకాశంతో అతడి జీవితం ఎలా ఊహించని మలుపు తిరిగిందో వెల్లడించే ఈ రియల్ లైఫ్ సక్సెస్ స్టోరీ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
చదువు ఆగిపోయింది.. బతుకు పోరాటం మొదలైంది!

హరియాణాలోని ఫరీదాబాద్‌కు చెందిన అజిత్ కుమార్ కుటుంబం ఆర్థిక కష్టాల్లో ఉండేది. పిల్లల చదువు, మెరుగైన భవిష్యత్తు కోసం అతడి తండ్రి దిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతానికి మారారు. అక్కడ దొరికిన చిన్న చిన్న పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. ఒక్కోసారి ఆ కుటుంబానికి కనీసం కడుపు నిండా తిండి కూడా దొరికేది కాదు.
"కష్టపడి చదివే మనసు ఉంటే సరిపోదు.. చదువుకోవడానికి డబ్బులు కూడా ఉండాలని అప్పుడే నాకు అర్థమైంది," అని అజిత్ ఆవేదనగా గుర్తుచేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులకు తోడు కరోనా లాక్‌డౌన్ రావడంతో అజిత్ తన డిగ్రీ చదువును మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. చేతికి దొరికిన పని చేసేవాడు. మెహందీ డిజైన్లు వేయడం, బ్రైడల్ మేకప్ చేయడం వరకు ఎన్నో పనులు చేశాడు.
అయినా పరిస్థితి మారలేదు.
"ఇంటి అద్దె కట్టాలి, నిత్యావసరాలు కొనాలి.. రోజురోజుకూ అప్పులు పెరిగిపోతున్నాయి," అంటూ అజిత్ ఆనాటి చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యాడు. ఆ సమయంలో ఒక స్నేహితుడి సలహాతో స్విగ్గీలో ఫుడ్ డెలివరీ బాయ్‌గా చేరాడు. సొంతంగా బైక్ కూడా లేకపోవడంతో బైసైకిల్‌పైనే ఆర్డర్లు డెలివరీ చేయడం ప్రారంభించాడు! రోజుకు 20 ఆర్డర్లు పూర్తి చేయాలంటే కనీసం 100 కిలోమీటర్లకు పైగా సైకిల్ తొక్కిన రోజులు ఉన్నాయని అతడు చెప్పాడు.
కాలు విరిగినా తగ్గని పట్టుదల!
అలా కష్టపడుతున్న సమయంలోనే అజిత్‌ని మరిన్ని కష్టాలు వచ్చాయి. ఒక కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మంచాన పడ్డాడు. కాలు తీసేయాల్సి వస్తుందేమోనన్న భయంతో కుంగిపోయాడు. ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన ఆ కుటుంబం, అజిత్ వైద్య ఖర్చుల కోసం మరిన్ని అప్పులు చేయాల్సి వచ్చింది.
{{/usCountry}}అలా కష్టపడుతున్న సమయంలోనే అజిత్‌ని మరిన్ని కష్టాలు వచ్చాయి. ఒక కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మంచాన పడ్డాడు. కాలు తీసేయాల్సి వస్తుందేమోనన్న భయంతో కుంగిపోయాడు. ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన ఆ కుటుంబం, అజిత్ వైద్య ఖర్చుల కోసం మరిన్ని అప్పులు చేయాల్సి వచ్చింది.
{{/usCountry}}అడుగు తీసి బయట పెట్టలేని స్థితిలో.. కేవలం చేతులను మాత్రమే ఉపయోగిస్తూ ఇంటి నుంచి ఏమైనా పని చేయవచ్చా అని అజిత్ ఇంటర్నెట్‌లో వెతకడం ప్రారంభించాడు. అలా అతడికి ‘పాకెట్ ఎఫ్‌ఎమ్’ ప్రకటన కనిపించింది. ఆడియో కథలు రాసి డబ్బు సంపాదించవచ్చని అందులో ఉంది.
పోగొట్టుకోవడానికి ఏమీ లేకపోవడంతో, మంచం మీద పడుకునే కథలు రాయడం మొదలుపెట్టాడు. "ఒక్కో రోజు నాలుగు నుంచి ఐదు ఎపిసోడ్లు రాసేవాడిని," అని అజిత్ తన శ్రమను వివరించాడు.
తొలి సంపాదన రూ. 20,000.. ఆపై తిరుగులేని ప్రయాణం!
అతడి శ్రమ ఊరికే పోలేదు. పాకెట్ ఎఫ్‌ఎమ్ నిర్వహించిన ఒక పోటీలో అజిత్ రాసిన కథ ఎంపికైంది. దానికి ప్రతిఫలంగా అతడికి రూ. 20,000 తొలి చెక్ లభించింది. ఆ డబ్బును తీసుకెళ్లి తన తల్లి చేతిలో పెట్టాడు. ఆ నమ్మకంతో రాత్రింబవళ్లు కథలు రాయడమే పనిగా పెట్టుకున్నాడు.
కొద్దిరోజుల్లోనే అతడు రాసిన ఒక ఆడియో సిరీస్ ప్లాట్‌ఫామ్‌లోనే నంబర్ వన్ స్థానంలో నిలిచింది. దానికిగాను మొదట రూ. 52,000 లభించగా, ఆ తర్వాత ఏకంగా రూ. 6.29 లక్షల భారీ పారితోషికం అందుకని తన కష్టాల నుంచి బయటపడ్డాడు.
కోటీశ్వరుడిగా మారిన రైటర్!
పెట్టుబడిదారుడు రాహుల్ మాథుర్ ఇటీవల 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా అజిత్ కుమార్ విజయగాథను పంచుకోవడంతో ఈ వార్త వెలుగులోకి వచ్చింది. "ఫరీదాబాద్‌కు చెందిన ఒక సాధారణ స్విగ్గీ డెలివరీ బాయ్, పాకెట్ ఎఫ్‌ఎమ్‌లో కథలు రాస్తూ కోటీశ్వరుడిగా మారాడు," అని రాహుల్ కొనియాడారు.
అజిత్ కుమార్ రాసిన “బ్రహ్మయోధ: ద డిస్ట్రాయర్” అనే ఆడియో సిరీస్ ఏకంగా 16.8 కోట్ల ప్లేస్ సాధించి రికార్డు సృష్టించింది. 2026 నాటికి ఈ షో వ్యూయర్షిప్ 4 రెట్లు పెరిగిపోగా, ఎపిసోడ్ల సంఖ్య 1,300 దాటింది.
2026 జనవరిలో ప్రతిష్టాత్మక 'జైపూర్ లిటరరీ ఫెస్టివల్'కు అజిత్ కుమార్‌ను ప్రత్యేక స్పీకర్‌గా ఆహ్వానించారు. అతడు రాసిన ఈ షో ద్వారా పాకెట్ ఎఫ్‌ఎమ్‌కి ఏకంగా రూ. 100 కోట్లకు పైగా రాబడి రానుండటంతో, అజిత్‌కు రాయల్టీ రూపంలోనే కొన్ని కోట్ల రూపాయల ఆదాయం సమకూరినట్లు సమాచారం. జీవితం ఎంతటి కష్టాలను ఎదురొడ్డినా, నమ్మకంతో ప్రయత్నిస్తే విజయం ఖాయమని అజిత్ కుమార్ నిరూపించాడు.