Zomato : ఎన్నా ఐడియా తలైవా! జొమాటోనే స్కామ్ చేస్తున్నారుగా- తక్కువ ఖర్చుతో ఫుడ్​ డెలివరీ, ఎలా అంటే..

Zomato loophole : ప్రముఖ ఫుడ్​ డెలివరీ సంస్థ జొమాటోకు కోట్లల్లో నష్టం కలిగించే విధంగా కొందరు తమ తెలివితేటలను ప్రయోగిస్తున్నారు! యాప్​లో కేవలం 1 రోటీ ఆర్డర్​ చేసి, ఆ తర్వాత ఏకంగా రెస్టారెంట్​కే ఫోన్ చేసి మిగిలినవి ఆర్డర్​ చేస్తున్నారు. ఫలితంగా తక్కువ ఖర్చుకే ఫుడ్​ని డెలివరీ పొందుతున్నారు!

Published on: May 29, 2026, 15:28:12 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో బిజినెస్ మోడల్‌ను దెబ్బతీసేలా కొంతమంది కస్టమర్లు, రెస్టారెంట్లు కలిసి చేస్తున్న ఒక వినూత్నమైన ట్రిక్/ లూప్‌హోల్ సోషల్ మీడియా వేదికగా (ఎక్స్) తెగ వైరల్ అవుతోంది. జొమాటో యాప్‌లో కేవలం ఒకే ఒక్క రోటీని ఆర్డర్ చేసి, ఆపై మిగిలిన ఖరీదైన ఫుడ్‌ను నేరుగా రెస్టారెంట్‌కు యూపీఐ ద్వారా పేమెంట్ చేసి ఒకే ప్యాకెట్‌లో డెలివరీ పొందుతున్నారనేది ఈ పోస్ట్ సారాంశం. 'వాల్యూ విత్ ప్రేమ్' అనే యూజర్ ఎక్స్‌లో పంచుకున్న ఈ పోస్ట్ మిలియన్ల కొద్దీ వ్యూస్‌ను సాధించడమే కాకుండా, ఫుడ్ డెలివరీ యాప్స్​లో లోపాలను సరికొత్త చర్చకు దారితీసింది.

జొమాటో లూప్​హోల్​ వాడేసుకుంటున్న యూజర్లు!
జొమాటో లూప్​హోల్​ వాడేసుకుంటున్న యూజర్లు!

జొమాటో డెలివరీ నెట్‌వర్క్‌ను, రైడర్లను వాడుకుంటూనే.. అటు కంపెనీకి కస్టమర్ సైడ్ నుంచి ప్లాట్‌ఫామ్ ఫీజులు, ఇటు రెస్టారెంట్ సైడ్ నుంచి 25-30% భారీ కమీషన్లు కట్టకుండా తప్పించుకోవడానికి ఈ ‘జుగాడ్’ ట్రిక్‌ను ఉపయోగిస్తున్నారు.

ఈ వైరల్ పోస్ట్ ప్రకారం ఆ లూప్‌హోల్ ఎలా పనిచేస్తుందో ఇక్కడ చూద్దాము..

'వన్ రోటీ' హ్యాక్ ఎలా పనిచేస్తుంది?

స్టెప్ 1: మొదట కస్టమర్ జొమాటో యాప్ ఓపెన్ చేసి తనకు నచ్చిన ఒక రెస్టారెంట్ నుంచి కేవలం రూ. 40 విలువైన ఒక రోటీని మాత్రమే ఆర్డర్ చేస్తాడు.

స్టెప్ 2: ఆర్డర్ ప్లేస్ అయిన వెంటనే నేరుగా ఆ రెస్టారెంట్‌కు ఫోన్ చేసి.. పన్నీర్ బటర్ మసాలా, దాల్ మఖ్నీ, బిర్యానీ, గులాబ్ జామూన్ వంటి సుమారు రూ. 1200 విలువైన పెద్ద ఆర్డర్‌ను ఆఫ్‌లైన్‌లో చెప్తాడు. దీనికి సంబంధించిన డబ్బును నేరుగా రెస్టారెంట్ యజమానికి యూపీఐ ద్వారా పంపుతాడు.

స్టెప్ 3: ఆ తర్వాత జొమాటో ఆర్డర్ ఐడీ కింద ప్యాక్ చేసే ఆ ఒక్క రోటీతో పాటే, ఈ పెద్ద ఫుడ్ ఆర్డర్‌ను కూడా ఒకే బ్యాగులో కలిపి ప్యాక్ చేయమని రెస్టారెంట్‌ను కోరతాడు.

ఫలితం: జొమాటో రైడర్ వచ్చి కేవలం రోటీ ఆర్డర్ అనుకుని ఆ పెద్ద ప్యాకెట్‌ను తీసుకుని కస్టమర్ ఇంటికి డెలివరీ చేస్తాడు. దీనివల్ల జొమాటోకు కేవలం రూ. 40 పైనే కమీషన్ వస్తుంది, కానీ బ్యాగులో ఉన్న రూ. 1200 ఫుడ్‌పై రూపాయి కమీషన్ కూడా దక్కదు.

ఇందులో ఇరుపక్షాల లాభాలు ఏంటి?

  1. స్టారెంట్లకు పూర్తి మార్జిన్:

జొమాటో ప్రతి ఆర్డర్‌పై రెస్టారెంట్ల నుంచి 25 నుంచి 30 శాతం వరకు భారీ కమీషన్ కట్ చేసుకుంటుంది. ఈ ట్రిక్ వల్ల రెస్టారెంట్‌కు పూర్తి లాభం దక్కుతుంది. అందుకే రెస్టారెంట్లు కూడా తమ రెగ్యులర్ కస్టమర్లకు ఈ ఐడియాను రహస్యంగా చెప్తున్నట్లు టాక్ నడుస్తోంది!

కస్టమర్లకు భారీ ఆదా: కస్టమర్లకు జొమాటో మార్కప్ ధరలు (ఆన్‌లైన్‌లో ఎక్కువ రేట్లు ఉండటం), సర్జ్ ప్రైసింగ్, ప్లాట్‌ఫామ్ ఫీజులు, ఆఫ్‌లైన్ పోర్షన్‌పై జీఎస్టీ భారం తప్పుతుంది. 'పోర్టర్' లేదా 'రాపిడో' వంటి డెలివరీ యాప్స్ బుక్ చేయడం కంటే ఇది చాలా చౌకగా మారుతోంది.

సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు..

ఈ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు:

ఉజ్జయినికి చెందిన ఒక యూజర్ స్పందిస్తూ.. "మా నగరంలో ఇది ఏడాది కాలంగా జరుగుతోంది. అంతటితో ఆగకుండా కస్టమర్లు జొమాటో సపోర్ట్‌కు కాల్ చేసి.. 'నాకు ఒక్క రోటీ కూడా రాలేదు, ఐటమ్ మిస్సింగ్' అని చెప్పి ఆ రూ. 40 రూపాయల సింగిల్ ఆర్డర్‌ను కూడా రీఫండ్ రూపంలో వెనక్కి తీసుకుంటున్నారు," అని షాకింగ్ నిజాన్ని బయటపెట్టాడు.

మాజీ రెస్టారెంట్ ఓనర్ ఒకరు, "ఇది మంచిదే, జొమాటో రెస్టారెంట్ల రక్తాన్ని పిండేస్తోంది, వారి బిజినెస్ మోడల్ చాలా దోపిడీలా ఉంటుంది," అని రెస్టారెంట్లకు మద్దతుగా కామెంట్ చేశారు.

మరికొందరు యూజర్లు ప్రాక్టికల్ సమస్యలను లేవనెత్తారు. "యాప్‌లో ఒక రోటీ అని ఉండి, డెలివరీ బాయ్ చేతికి మూడు పెద్ద ఫుడ్ బాక్సులు ఇస్తే వాడు గమనించకుండా ఉంటాడా? ఒకవేళ రైడర్ ఆ రోటీ తప్ప మిగిలిన ఫుడ్ తినేస్తే కస్టమర్ ఎవరికి ఫిర్యాదు చేస్తాడు?" అని ప్రశ్నించారు.

కాగా.. ఈ లూప్‌హోల్ గనుక దేశవ్యాప్తంగా విస్తరిస్తే జొమాటో ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందని, కంపెనీ వెంటనే ఆర్డర్ వెరిఫికేషన్ లేదా కఠినమైన నిబంధనల ద్వారా దీనిని అరికట్టాలని పోస్ట్ చేసిన యూజర్ హెచ్చరించారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More