Education Apps : విద్యార్థులకు వరంలా మారిన టాప్ ఎడ్యుకేషన్ యాప్స్.. మీ ఫోన్​లో ఇవి ఉంటే చదువు చాలా ఈజీ!

భారతదేశంలో డిజిటల్ విప్లవం విద్యావ్యవస్థను పూర్తిగా మార్చేసింది. స్కూల్ సిలబస్, జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షల ప్రిపరేషన్ నుంచి కొత్త భాషలు నేర్చుకోవడం వరకు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడే టాప్ ఉచిత విద్యా యాప్‌ల వివరాలు ఇక్కడ చూద్దాము..

Published on: Jun 18, 2026, 05:30:12 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Free Learning Platforms India : నేటి ఆధునిక కాలంలో స్మార్ట్‌ఫోన్ కేవలం వినోద సాధనంగానే కాకుండా, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే ఒక అద్భుతమైన విద్యా ఆయుధంగా మారింది! స్కూల్ పాఠ్యాంశాలు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్, కొత్త భాషలు నేర్చుకోవడం, ప్రొఫెషనల్ స్కిల్స్ పెంచుకోవడం.. ఇలా ప్రతి ఒక్కదానికీ ఇప్పుడు మొబైల్ లోనే యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. దీనివల్ల భారతీయ విద్యార్థులు ఎక్కడి నుంచైనా ఉద్యోగ మార్కెట్‌కు తగినట్లుగా తమను తాము సిద్ధం చేసుకుంటున్నారు.

ఇండియాలో టాప్​ ఎడ్యుకేషనల్ యాప్స్..
ఇండియాలో టాప్​ ఎడ్యుకేషనల్ యాప్స్..

ప్రస్తుతం మనం అత్యాధునిక డిజిటల్ సాంకేతిక యుగంలో జీవిస్తున్నామని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ పిల్లల అత్యవసర నిధి (యూనిసెఫ్) పేర్కొంది. విద్యా రంగంలో ఎదురవుతున్న పలు సవాళ్లను అధిగమించడానికి, నేర్చుకునే విధానాన్ని సరికొత్తగా మార్చడానికి ఈ డిజిటల్ టెక్నాలజీలు ఎంతో అవసరమైన పరిష్కారాలను అందిస్తున్నాయని యునిసెఫ్ స్పష్టం చేసింది.

పదేళ్ల క్రితం విద్యార్థుల స్కూల్ బ్యాగులు ఎలా ఉండేవో మనకు తెలుసు. కానీ, నేటి డిజిటల్ యుగంలో నోట్‌బుక్స్, టెక్స్ట్‌బుక్స్‌తో పాటు స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లు కూడా అత్యంత శక్తివంతమైన విద్యా సాధనాలుగా మారిపోయాయి. మ్యాథ్స్ ఫార్ములాలు రివైజ్ చేయడం, ఇంగ్లీష్ వోకాబులరీ ప్రాక్టీస్ చేయడం నుంచి సైన్స్ ప్రయోగాలను లైవ్‌లో చూడటం వరకు ఈ ఎడ్యుకేషన్ యాప్స్ చదువును ఎంతో సులభంగా, ఆసక్తికరంగా మారుస్తున్నాయి. విద్యార్థుల కోసం విద్యాశాఖ, ఐఐటీలు ఉచితంగా అందిస్తున్న కొన్ని టాప్ ఎడ్యుకేషన్ యాప్స్ వివరాలు ఇప్పుడు చూద్దాం.

కేంద్ర ప్రభుత్వం, ఐఐటీల ఉచిత యాప్స్..

1. దీక్ష

'డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్' అనేది ఉపాధ్యాయులు, విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన జాతీయ డిజిటల్ ప్లాట్‌ఫారమ్. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లో ఇచ్చే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా విద్యార్థులు నేరుగా ఈ పోర్టల్‌ను యాక్సెస్ చేయవచ్చు. కోడ్‌ను స్కాన్ చేయగానే విద్యార్థి చదవాలనుకునే అంశానికి సంబంధించిన అనేక సూచనలు, వీడియో పాఠాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. ఈ మొబైల్ అప్లికేషన్‌లో లెసన్ ప్లాన్స్, వర్క్‌షీట్స్, క్లాస్‌రూమ్ యాక్టివిటీస్ అందుబాటులో ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఉత్తమ ఉపాధ్యాయులు రూపొందించిన ఇంటరాక్టివ్ స్టడీ మెటీరియల్‌ను విద్యార్థులు ఇక్కడ ఉచితంగా పొందవచ్చు.

2. సాథీ

నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయిన జేఈఈ, నీట్, సీయూఈటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, ఐఐటీ కాన్పూర్ భాగస్వామ్యంతో 'సాథీ' యాప్‌ను తీసుకొచ్చింది. ఐఐటీలు, ఇతర ప్రతిష్టాత్మక విద్యాసంస్థల నిపుణులు రూపొందించిన వీడియో లెక్చర్స్, స్టడీ నోట్స్ ఇందులో ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు లబ్ధి చేకూర్చేలా ఈ ప్లాట్‌ఫారమ్ బహుభాషా లెర్నింగ్ రిసోర్సెస్‌ను పూర్తిగా ఉచితంగా అందిస్తోంది.

3. స్వయం పోర్టల్

సమాజంలో అందరికీ నాణ్యమైన విద్యను సమానంగా అందించాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ‘స్వయం’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇప్పటివరకు డిజిటల్ విప్లవానికి దూరంగా ఉండి, జ్ఞాన ఆర్థిక వ్యవస్థలో భాగం కాలేకపోయిన వెనుకబడిన విద్యార్థుల కోసం డిజిటల్ డివైడ్‌ను తొలగించడం దీని ప్రధాన లక్ష్యం. ఇందులో 9వ తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు క్లాస్‌రూమ్‌లలో బోధించే అన్ని కోర్సులు అందుబాటులో ఉంటాయి. వీటిని ఎవరైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా యాక్సెస్ చేయవచ్చు. దేశంలోని ఉత్తమ ఉపాధ్యాయులు రూపొందించిన ఈ ఇంటరాక్టివ్ కోర్సులు విద్యార్థులందరికీ ఉచితంగా లభిస్తాయి.

చదువును సులభం చేసే ఇతర ముఖ్యమైన యాప్స్..

మై సీబీఎస్‌ఈ గైడ్ : ఈ అప్లికేషన్ సీబీఎస్‌ఈ విద్యార్థులకు చాలా ఉపయోగపడుతుంది. ఇందులో శాంపిల్ పేపర్స్, వర్క్‌షీట్స్, రివిజన్ నోట్స్, ఎన్‌సీఈఆర్‌టీ సొల్యూషన్స్, గత సంవత్సరాల క్వశ్చన్ బ్యాంక్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లభిస్తాయి.

డ్యుయోలింగో : కొత్త భాషలు నేర్చుకోవాలనుకునే వారికి ఇది బెస్ట్ యాప్. ఆటలు ఆడుకునే తరహాలో చిన్న చిన్న పాఠాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 40 కి పైగా భాషలను ఈ యాప్ ద్వారా సులభంగా నేర్చుకోవచ్చు. కోవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో ఇంట్లోనే కూర్చుని కొత్త భాషలు నేర్చుకోవడానికి ఈ యాప్ విపరీతమైన ప్రజాదరణ పొందింది.

ఫోటోమ్యాథ్ : మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే భయపడే విద్యార్థులకు ఇది ఒక అద్భుతమైన గైడ్. మీ మొబైల్ కెమెరాతో లెక్కల సమస్యను స్కాన్ చేస్తే చాలు, ఈ యాప్ దానికి సంబంధించిన సమాధానాన్ని స్టెప్-బై-స్టెప్ ప్రాసెస్ లో చూపిస్తుంది.

బ్రెయిన్లీ : ఇది విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఒక డిస్కషన్ కమ్యూనిటీలా పనిచేస్తుంది. విద్యార్థులు తమకు చదువులో వచ్చే సందేహాలను ఇక్కడ అడగవచ్చు, దానికి ఇతర విద్యార్థులు లేదా నిపుణులైన అధ్యాపకుల నుంచి సమాధానాలు లభిస్తాయి. హోమ్‌వర్క్​లో వచ్చే కష్టమైన ప్రశ్నలను సాల్వ్ చేయడానికి లక్షలాది మంది విద్యార్థులు ఈ ప్లాట్‌ఫారమ్‌ను వాడుతున్నారు.

క్విజ్ లెట్ (Quizlet): పరీక్షల సమయంలో క్విక్ రివిజన్ కోసం డిజిటల్ స్టడీ టూల్స్, ఫ్లాష్ కార్డ్స్, ప్రాక్టీస్ క్విజ్‌లు, కొలాబొరేటివ్ లెర్నింగ్ గేమ్స్‌ను ఈ యాప్ అందిస్తుంది. చదివిన విషయాలను సులభంగా గుర్తుంచుకోవడానికి ఈ టూల్స్ బాగా సహాయపడతాయి.

విద్యార్థులు తమ చదువును మరింత సులభంగా మార్చుకోవడానికి ఇలాంటి విభిన్న ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించుకోవచ్చు. వీటిలో కేవలం అకడమిక్ చదువులే కాకుండా, నైపుణ్య ఆధారిత కోర్సులు కూడా ఎన్నో అందుబాటులో ఉన్నాయి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More