...
...
Next Story

Sandra Lavie : స్విట్జర్లాండ్‌లో లగ్జరీ జీవితం వదిలి.. భారతదేశంలో సేవ! సాండ్రా ఇన్​స్పైరింగ్ స్టోరీ..

Sandra Lavie Gojkovic : స్విట్జర్లాండ్‌లో మంచి ఉద్యోగం, విలాసవంతమైన జీవితాన్ని వదిలేసి భారత్‌లో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు సాండ్రా లావి గోజ్కోవిచ్! ఆమెకు సంబంధించిన ‘స్విస్ టు ఇండియా’ ప్రయాణంపై ప్రత్యేక కథనం..

Published on: Aug 10, 2026, 07:29:53 IST
Advertisement

పదహారేళ్ల క్రితం స్విట్జర్లాండ్‌లో సాండ్రా లావి గోజ్కోవిచ్ జీవితం ఎంతో హాయిగా సాగిపోయేది. చేతి నిండా సంపాదన, ఖరీదైన కారు, విలాసవంతమైన లైఫ్‌స్టైల్.. కార్పొరేట్ ప్రపంచంలో ఆమెది తిరుగులేని విజయం! కానీ, ఆ మెరుస్తున్న లోకం ఆమెను సంతృప్తి పరచలేదు. చుట్టూ ఉన్న పేదరికం, అసమానతలు ఆమె మనసును కలచివేశాయి. దీనితో ఆ సౌకర్యాలన్నింటికీ స్వస్తి చెప్పి, భారతదేశంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ఆమె అడుగులు ముందుకు వేసింది.

సాండ్రా లావి గోజ్కోవిచ్ (Sandra Lavie Gojkovic)
సాండ్రా లావి గోజ్కోవిచ్ (Sandra Lavie Gojkovic)

ప్రస్తుతం ఇండియాలో తన కలల ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తున్న సాండ్రా.. హిందుస్థాన్ టైమ్స్ డిజిటల్‌తో తన మనసులోని మాటలను పంచుకున్నారు. కార్పొరేట్ విజయాల నుంచి గ్రామీణ సేవ వైపు సాగిన ఆమె ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం.

భారత్‌తో విడదీయరాని బంధం!

భారతదేశం తన సొంత ఇల్లులాంటిదని సాండ్రా చెబుతున్నారు. "నేను 15ఏళ్ల క్రితం మొదటిసారి భారత్‌కు వచ్చాను. ఇక్కడ ఒక పాఠశాలను ప్రారంభించాను. అప్పటి నుంచి స్విట్జర్లాండ్, భారత్‌ల మధ్య నా సమయాన్ని పంచుకుంటూ వస్తున్నాను," అని ఆమె పాత రోజులను గుర్తుచేసుకున్నారు.

ఒక సమయంలో కోల్‌కతాలో నెలల తరబడి, ముంబైలో ఏడాది పాటు నివసించిన ఆమె.. ఇప్పటికీ రెండు దేశాల మధ్య రాకపోకలు సాగిస్తూనే ఉన్నారు.

తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులు..

ఈ ప్రయాణం సాండ్రాకు అంత సులభంగా ఏమీ సాగలేదు. ఒక విదేశీ మహిళగా ఆమె అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. "మొదట్లో ప్రజలు నన్ను నమ్మలేదు. నేనొక విదేశీయురాలినని అనుమానించారు. చాలామంది నన్ను క్రిస్టియన్ మిషనరీ అని భావించారు. అయితే, నేను చాలా ఏళ్లుగా సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నాను. నేటికీ ఈ అపోహలు అప్పుడప్పుడు ఎదురవుతూనే ఉంటాయి," అని ఆమె పేర్కొన్నారు.

ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ఐలాండ్‌లో ప్రాథమిక విద్య, ట్యూషన్ కార్యక్రమాలు, మహిళలు, పిల్లల సాధికారత కోసం ఆమె కృషి చేస్తున్నారు. గృహ హింస, బాల్య వివాహాలు, మానవ అక్రమ రవాణా వంటి దురాచారాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. విద్య ద్వారానే పేదరికాన్ని రూపుమాపవచ్చని ఆమె గట్టిగా నమ్ముతారు.

కార్పొరేట్ హోదాను ఎందుకు వదిలేశారు?

స్విట్జర్లాండ్‌లో చక్కటి విద్యనభ్యసించి, కార్పొరేట్ రంగంలోకి అడుగుపెట్టిన సాండ్రా.. చిన్న వయసులోనే ఎంతో సాధించారు. ఆ రోజులను గుర్తుచేసుకుంటూ.. "నా పనిరీత్యా విపరీతంగా ప్రయాణించేదాన్ని. మంచి జీతం, అందమైన కారు, ప్రపంచాన్ని చుట్టేసే అవకాశం ఉండేది. నేను కష్టపడి పైకి వచ్చాను. అదే సమయంలో జీవితంలో నాకు లభించిన అవకాశాలు, అదృష్టాన్ని కూడా నేను గ్రహించాను," అని తెలిపారు.

అయితే, సమాజంలో ఉన్న తీవ్రమైన అంతరాలు ఆమెను ఆలోచింపజేశాయి. "నాకే ఇన్ని సౌకర్యాలు ఎందుకు దక్కాయి? తోటివారికి మాత్రం కనీస వసతులు కూడా ఎందుకు లేవు? ఈ ప్రశ్న నా జీవిత గమ్యాన్నే మార్చేసింది," అని సాండ్రా తెలిపారు.

భారత్‌లోనే ఎందుకు స్థిరపడలేదు?

భారత్‌లో తనకు ఎలాంటి ఆదాయ వనరులు లేవని సాండ్రా స్పష్టం చేశారు. తన ఖర్చులను భరించడానికి, అలాగే ఇక్కడ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడానికి ఆమె స్విట్జర్లాండ్‌లో పని చేస్తుంటారు.

"నా జీవితం ఎప్పుడూ ఈ రెండు ప్రాంతాల మధ్యే సాగుతుంది," అని ఆమె చెప్పారు.

భవిష్యత్ ప్రణాళికలు..

తన జీవితాంతం నిరాశ్రయులైన కమ్యూనిటీల కోసం సేవ చేస్తూనే ఉంటానని సాండ్రా స్పష్టం చేశారు. ప్రస్తుతం మహిళలు, పిల్లల రక్షణ ఉద్యమంపై ఆమె ప్రధానంగా దృష్టి పెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లోని యువతనే లీడర్లుగా మలుస్తూ.. ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.

సమాజానికి సాండ్రా ఇస్తున్న సందేశం..

"భౌతిక సుఖాలు తాత్కాలికం. అవి కాస్త సౌకర్యాన్ని ఇస్తాయే తప్ప శాశ్వత సంతృప్తిని ఇవ్వలేవు. తోటివారికి సేవ చేయడం, ఇతరులకు అండగా నిలవడంలోనే జీవితానికి అసలైన అర్థం ఉంది," అని సాండ్రా పేర్కొన్నారు.

"తక్కువ అదృష్టంతో ఉన్నవారికి సేవ చేయడం నా కర్తవ్యం మాత్రమే కాదు, అది నా జీవిత పరమార్థం. నేను బతికి ఉన్నంతవరకు ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తాను," అని ఆమె ముగించారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON