Special Trains : ప్రయాణికులకు శుభవార్త - 'ఓనమ్' వేళ 112 ప్రత్యేక రైళ్లు ప్రకటన, లిస్టులో తెలుగు రాష్ట్రాలు

Onam Special Trains 2026 : ఓనమ్ పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకొని భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సౌకర్యార్థం కోసం ఏకంగా 112 ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి ఈ సర్వీసులు నడుస్తాయి.

Published on: Aug 7, 2026, 15:10:28 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Onam Special Trains 2026 : సొంత ఊర్లకు, బంధువుల ఇళ్లకు వెళ్లే ప్రయాణికులతో పండుగ సమయాల్లో రైళ్లు కిక్కిరిసిపోతుంటాయి. ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో అత్యంత వైభవంగా జరుపుకునే ఓనమ్ పండుగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీ సాధారణం కంటే ఊహించని రీతిలో పెరుగుతుంది.

రైల్వే ప్రయాణికులకు అలర్ట్ - 112 ప్రత్యేక రైళ్లు ప్రకటన
రైల్వే ప్రయాణికులకు అలర్ట్ - 112 ప్రత్యేక రైళ్లు ప్రకటన

ఈ నేపధ్యంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వారి ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు భారతీయ రైల్వే భారీ ఏర్పాట్లు చేసింది. రాబోయే ఓనం పండుగ సీజన్ కోసం ఏకంగా 112 ప్రత్యేక రైలు ట్రిప్పులను నడపాలని నిర్ణయించింది. ఈ మొత్తం సర్వీసుల్లో దక్షిణ రైల్వే స్వయంగా 54 ప్రత్యేక సర్వీసులను నిర్వహిస్తుండగా… ఇతర రైల్వే జోన్లు మిగిలిన 58 సర్వీసులను నడపనున్నాయి.

ఆగస్టు 14 నుంచి సర్వీసులు….

రైల్వే శాఖ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం…. ఈ ప్రత్యేక రైళ్లు ప్రధానంగా ఆగస్టు 14 నుంచి సెప్టెంబరు 6 మధ్య కాలంలో అందుబాటులో ఉంటాయి. కేరళ పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లలోని ప్రధాన నగరాల మీదుగా ఈ ట్రైన్స్ రాకపోకలు సాగిస్తాయి.

దక్షిణ రైల్వే తన పరిధిలోని నెట్‌వర్క్‌లోనే 38 ప్రత్యేక ట్రిప్పులను నడుపుతుంది. వీటితో పాటు పొరుగు రైల్వే జోన్‌లతో కేరళను అనుసంధానిస్తూ మరో 16 ఇంటర్-రైల్వే ప్రత్యేక ట్రిప్పులను నిర్వహించనుంది. ఇక సౌత్ వెస్ట్రన్ రైల్వే (నైరుతి రైల్వే), సౌత్ సెంట్రల్ రైల్వే (దక్షిణ మధ్య రైల్వే), సౌత్ ఈస్ట్రన్ రైల్వేలు (దక్షిణ పూర్వ రైల్వే) అన్నీ కలిపి కేరళకు మరో 58 అదనపు ప్రత్యేక సర్వీసులను నడపనున్నాయి.

గత ఏడాదితో పోలిస్తే ఈసారి రైల్వే శాఖ ఓనం పండుగ ప్రత్యేక రైళ్ల సంఖ్యను దాదాపు రెట్టింపు చేసింది. 2025లో ఓనం పండుగ సందర్భంగా రైల్వే శాఖ కేవలం 55 ప్రత్యేక ట్రిప్పులను మాత్రమే నడిపింది. కానీ ఈ సంవత్సరం ఆ సంఖ్య ఏకంగా 112 ట్రిప్పులకు చేరింది. అంటే గతేడాదితో పోలిస్తే రైలు సర్వీసులలో దాదాపు 103 శాతం మేర నమోదైంది. ప్రయాణికుల నుంచి వచ్చిన విపరీతమైన డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

నగరాల మీదుగా రాకపోకలు…

ఈ ప్రత్యేక రైళ్లు చెన్నై, బెంగళూరు, మైసూర్, హుబ్బాళి, హైదరాబాద్, సంత్రాగాచి వంటి ప్రముఖ మెట్రో నగరాలను కేరళలోని ముఖ్యమైన ప్రాంతాలైన తిరువనంతపురం, కొల్లాం, కొట్టాయం, కణ్ణూర్, ఎర్నాకులం, మంగళూరులతో అనుసంధానిస్తాయి. స్వగ్రామాలకు వెళ్లే వేలాది మంది నాన్-రెసిడెంట్ మలయాళీలు, ఉద్యోగులు, విద్యార్థులు, పర్యాటకులకు ఈ నిర్ణయం ఎంతో మేలు చేస్తుందని అధికారులు వెల్లడించారు.

"ప్రధాన మార్గాల్లో వెయిటింగ్ లిస్ట్ ట్రెండ్స్, ప్రయాణికుల డిమాండ్‌ను భారతీయ రైల్వే, దక్షిణ రైల్వే నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. అవసరమైతే మరిన్ని అదనపు రైళ్లను నడిపేందుకు కూడా మేము సిద్ధంగా ఉన్నాం," అని దక్షిణ రైల్వే అధికారులు తెలిపారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More