సముద్రపు అలలు తీరాన్ని తాకి వెనుదిరిగినట్టే.. మనిషి జీవితంలో కొన్ని అనుభవాలు మనసును తాకి చెరిగిపోని జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. అలాంటి అనుభూతులనే కథగా మలిచిన నవల చిరాన్ రచించిన ‘తార తీరం’. ప్రేమ, స్నేహం, అనాథత్వం, తల్లిదండ్రుల అనుబంధం, క్రీడా స్ఫూర్తి.. ఇలా భిన్నమైన భావాలను ఒకే కథలో మేళవిస్తూ సాగిన ఈ నవల పాఠకుడిని సూర్య జీవిత ప్రయాణంలో భాగస్వామిని చేస్తుంది.

కొత్తపట్నం బీచ్‌లో అస్తమిస్తున్న సూర్యుడి వర్ణనతో నవల మొదలవుతుంది. నారింజ రంగు ఆకాశం, బంగారు కాంతులు, తీరాన్ని తాకే అలలు, దూరంగా కనిపించే జాలరి పడవలు.. రచయిత వేసిన ఈ దృశ్యచిత్రం కథకు చక్కని నేపథ్యాన్ని ఏర్పరుస్తుంది. ‘రెక్కల ప్రపంచం’ అనే తొలి అధ్యాయంలో నాలుగేళ్ల సూర్య తన అమ్మ ఆద్యతో కలిసి పేపర్ విమానాలు తయారు చేసి గాలిలోకి ఎగరేస్తాడు. ఆ చిన్నారి ప్రపంచంలో ప్రేమ, భద్రత, ఆనందం తప్ప మరేమీ ఉండదు. కానీ విధి అతని జీవితాన్ని ఒక్కసారిగా మార్చేస్తుంది.
రోడ్డు ప్రమాదంలో ఆద్య మరణించడంతో సూర్య అనాథగా మిగులుతాడు. ఆ తర్వాత అతని జీవితంలోకి ‘చాచా’ అనే స్పోర్ట్స్ కోచ్ వస్తాడు. సూర్యను చేరదీసి అనాథాశ్రమంలో చేర్పించడమే కాకుండా క్రీడల్లో శిక్షణ ఇస్తాడు. అలా మొదలైన అథ్లెటిక్స్ ప్రయాణం క్రమంగా అతని జీవిత లక్ష్యంగా మారుతుంది. జావెలిన్ త్రోలో ప్రతిభ చూపుతూ జాతీయ స్థాయికి ఎదిగి, చివరకు భారతదేశానికి గోల్డ్ మెడల్ సాధించే క్రీడాకారుడిగా సూర్య ఎదగడం నవలలోని ప్రధాన కథా ప్రవాహం.
అయితే సూర్య విజయాన్ని కేవలం క్రీడా కోణంలో మాత్రమే రచయిత చూడలేదు. అతని వ్యక్తిగత జీవితంలోని ఖాళీలను కూడా సమాంతరంగా ఆవిష్కరించారు. తల్లి ప్రేమ కోసం తపించే బాలుడు.. స్నేహితుల మధ్య తనకంటూ ఒక ప్రపంచాన్ని నిర్మించుకుంటాడు. మేఘన, విక్కీ, సోను, కిరణ్ వంటి స్నేహితులతో సాగే సన్నివేశాలు కథలో సరదాను, సహజత్వాన్ని తీసుకొస్తాయి. వారి మధ్య జరిగే చిన్న చిన్న సంఘటనలు పాత్రలను పాఠకుడికి మరింత దగ్గర చేస్తాయి.
ఈ క్రమంలో సారా సూర్య జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఇక్కడి నుంచి కథ ప్రేమకథగా మారినా.. రచయిత దాన్ని కేవలం రొమాంటిక్ కోణంలోనే నడపలేదు. తల్లిదండ్రులెవరో తెలియని అనాథ సూర్య, ముస్లిం యువతి సారాను ప్రేమించడం.. ఆ ప్రేమను నిలబెట్టుకునేందుకు ఎదురయ్యే అడ్డంకులు.. వారి మధ్య ఉన్న అనుబంధం.. కథకు భావోద్వేగ తీవ్రతను పెంచుతాయి.
{{/usCountry}}ఈ క్రమంలో సారా సూర్య జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఇక్కడి నుంచి కథ ప్రేమకథగా మారినా.. రచయిత దాన్ని కేవలం రొమాంటిక్ కోణంలోనే నడపలేదు. తల్లిదండ్రులెవరో తెలియని అనాథ సూర్య, ముస్లిం యువతి సారాను ప్రేమించడం.. ఆ ప్రేమను నిలబెట్టుకునేందుకు ఎదురయ్యే అడ్డంకులు.. వారి మధ్య ఉన్న అనుబంధం.. కథకు భావోద్వేగ తీవ్రతను పెంచుతాయి.
{{/usCountry}}సూర్య జీవితంలోని అసలు మలుపులు మాత్రం కుటుంబ నేపథ్యానికి సంబంధించినవే. చిన్నతనంలో తనను పెంచిన ఆద్య తన కన్నతల్లి కాదని తెలుసుకోవడం, ఆమె మరణం వెనుక దాగిన నిజం, తన అసలు తల్లి గురించి తెలుసుకోవడం వంటి పరిణామాలు కథను మరో స్థాయికి తీసుకెళ్తాయి. ముఖ్యంగా తన కన్నతల్లినే ఆమె ఎవరో తెలియకుండా యాదృచ్ఛికంగా కలుసుకోవడం కథలోని హృద్యమైన ఘట్టం. చివరకు ఆమె సూర్య ప్రేమకు అండగా నిలవడం భావోద్వేగపరంగా బలమైన మలుపుగా నిలుస్తుంది.
ఈ కథలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పాత్ర జానీ. సూర్య-సారా ప్రేమను అర్థం చేసుకుని, వారి బంధాన్ని నిలబెట్టేందుకు జానీ చేసే ప్రయత్నాలు అతడిని కథలో గుర్తుండిపోయే పాత్రగా నిలబెడతాయి. పెద్ద సంఖ్యలో పాత్రలను సృష్టించకుండా.. కొద్దిమంది పాత్రల చుట్టూనే కథను నడిపించడం వల్ల ప్రతి పాత్రకు తగిన ప్రాధాన్యం లభించింది.
నవలలోని మరో విశేషం అధ్యాయాల ముగింపు. కథను అక్కడితో ముగించకుండా.. ఆ అధ్యాయం తాలూకు భావాన్ని ఒక చిన్న వాక్యంతో పాఠకుడి మనసులో వదిలిపెడతారు రచయిత. “కొన్ని కథలు గమ్యాన్ని చేరుకునేందుకు మొదలవుతాయి. కానీ మధ్యలో విధి ఒక కొత్త ముగింపు రాస్తుంది” వంటి వాక్యాలు కథను చదివిన తర్వాత కూడా పాఠకుడి ఆలోచనల్లో నిలిచిపోతాయి. ఈ ముగింపు వాక్యాలు ‘తార తీరం’ ప్రత్యేకమైన సాహిత్య స్పర్శను అందించాయి.
ఇక హైదరాబాద్ డెక్కన్ జీవనశైలి నవలకు మరో అందం. ఇరానీ చాయ్, అత్తరు గుబాళింపులు, కాఫీ హోటళ్లు, బాతాఖానీలు, రైల్వే స్టేషన్ల సందడి.. ఇవన్నీ కథలో సహజంగా కలిసిపోయాయి. రైలు కోసం ఎదురుచూపులు, ప్రేయసిని కలుసుకునేందుకు రైలును అందుకోవాలనే ఆతురత వంటి సన్నివేశాలు కథకు కదలికను మాత్రమే కాదు.. ఒక ప్రత్యేకమైన భావోద్వేగ వాతావరణాన్ని కూడా సృష్టిస్తాయి.
అయితే కొన్ని చోట్ల కథనం సినిమాటిక్‌గా అనిపించినా, అది నవల పఠనానికి పెద్దగా అడ్డంకిగా మారదు. ఎందుకంటే కథను ముందుకు నడిపించే భావోద్వేగ బలం, పాత్రల మధ్య ఉన్న అనుబంధం పాఠకుడిని చివరి వరకు వెంట తీసుకెళ్తాయి.
‘తార తీరం’లో సముద్రం కేవలం నేపథ్యం కాదు.. అది జీవితానికి ఒక రూపకం. అలలు ఎన్ని సార్లు వెనుదిరిగినా మళ్లీ తీరాన్ని చేరినట్టే.. మనిషి ఎన్ని కష్టాలు ఎదురైనా తన గమ్యాన్ని చేరుకునే ప్రయత్నం చేయాలనే భావన నవల అంతటా కనిపిస్తుంది.
ప్రేమలోని గాఢతను, స్నేహంలోని మాధుర్యాన్ని, తల్లిదండ్రుల అనుబంధంలోని విలువను, లక్ష్యాన్ని చేరుకోవాలనే పట్టుదలను ఆస్వాదించాలనుకునే పాఠకులకు ‘తార తీరం’ ఒక మంచి పఠనానుభూతిని అందిస్తుంది. చివరి పేజీ పూర్తయ్యాక కూడా సూర్య, సారా, జానీ పాత్రలు.. వారి ప్రయాణం.. పాఠకుడి మనసులో కొంతకాలం నిలిచిపోవడం ఈ నవల సాధించిన విజయమే.
జీవితంలో ప్రతి ఒక్కరికీ ఒక తీరం ఉంటుంది. ఆ తీరాన్ని చేరే ప్రయాణంలో ఎదురయ్యే ప్రేమ, స్నేహం, కన్నీళ్లు, విజయాల కథే.. ‘తార తీరం’.