బంగాళాదుంపల భోజనం నుంచి 64 పేటెంట్ల దాకా.. స్వీడన్‌లో ఆటోమొబైల్ బ్రాండ్ నిర్మించిన తెలుగు వ్యక్తి!
ఓ తెలుగు వ్యక్తి కేవలం రూ.35 వేలతో స్వీడన్ చేరుకున్నాడు. డబ్బులకు ఇబ్బందై.. తక్కువ ధరలో వచ్చే బంగాళాదుంపలు పూట గడుపుకొనేవాడు. మెట్టు మెట్టు పైకి ఎక్కాడు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఒక వ్యక్తి జీవితంలో గొప్ప ప్రయాణాలు సౌకర్యవంతమైన పరిస్థితుల నుంచి మొదలవ్వవు. ఓ చేతిలో పెట్టె, జేబులో కొన్ని వందల యూరోలు, ఎలాగైనా సరే భవిష్యత్తును మార్చాలనే బలమైన ఆశయంతో మొదలవుతాయి. స్టార్టప్ ప్రపంచంలో వేల కోట్ల నిధులు ఉన్నవారికంటే.. ఏమీ లేని చోట ప్రయాణం ప్రారంభించి, వెనుదిరిగి చూడని వ్యక్తుల కథలే ప్రతి ఒక్కరిలో కొత్త స్ఫూర్తిని నింపుతాయి.

అలాంటి ఓ అసాధారణ ప్రయాణమే అభిరామ్ తురగ అనే వ్యక్తిది. వోల్వో, క్వాల్‌కామ్, క్యాప్‌జెమిని వంటి దిగ్గజ సంస్థల్లో 18 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ఈ సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్ట్, స్వీడన్‌లో తురగ మోటార్స్ ఏబీ, భారతదేశంలో తురగ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలను స్థాపించారు.
ఏజెన్సీలు లేదా వందల మంది ఇంజనీర్లు చేసే పనిని ఒంటిచేత్తో చేస్తూ.. ఏకంగా 64 సాంకేతిక మేధో సంపత్తులను (Technology Assets) తన సొంత ఆలోచనలతో అభివృద్ధి చేశారు. ఇందులో 14 ఏఐ అండ్ సాఫ్ట్‌వేర్ ఆవిష్కరణలు, 10 వాహన హార్డ్‌వేర్ పేటెంట్లు, 14 ట్రేడ్‌మార్క్‌లు, 5 డిజైన్‌లు, 4 రహస్య సాంకేతికతలు ఉన్నాయి. గాల్లో ఎగిరే ఎలక్ట్రిక్ విమానం 'ఫ్లైగా' భావన కూడా ఇందులో భాగమే. కానీ ఈ విజయాల వెనుక ఉన్న అసలు కథ, ఆయన పడిన కష్టాలు ఎంతో మందికి ఆదర్శం.
బంగాళాదుంపల తింటూ..
2010లో భారతదేశం నుంచి స్వీడన్‌లోని లిన్నేయస్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చదివేందుకు అభిరామ్ వెళ్లినప్పుడు ఆయన జేబులో ఉన్నది కేవలం 600 యూరోలు (అప్పట్లో దాదాపు రూ.35,000). చదువుకునేందుకు, రోజువారీ ఖర్చుల కోసం పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తూ కఠినమైన చలి వాతావరణంలో గడిపారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల నెలల తరబడి కేవలం చవకగా లభించే బంగాళాదుంపలు మాత్రమే తింటూ రోజులు వెళ్లదీశారు. 'ఆ రోజులు నాకు జీవితంలో ఎలా బతకాలో నేర్పాయి. ఏమీ లేనప్పుడే మనకు ప్రతి రూపాయి, ప్రతి అవకాశం ఎంత విలువైందో తెలుస్తుంది.' అని అభిరామ్ నాటి రోజులను గుర్తుచేసుకుంటారు.
ఉద్యోగానికి స్వస్తి.. కలల ప్రయాణం
భారతదేశంలో బవినా కార్స్‌లో హార్డ్‌వేర్ ఇంజనీర్‌గా అనుభవం సంపాదించిన అభిరామ్, స్వీడన్ విద్య పూర్తయ్యాక వోల్వో, క్వాల్‌కామ్ వంటి అంతర్జాతీయ దిగ్గజ కంపెనీల్లో కార్ల అసిస్టెంట్ డ్రైవింగ్ (ADAS), ఆటోపైలట్ టెక్నాలజీ విభాగాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. అయితే సొంతంగా వాహనాలు తయారు చేయాలనే కోరిక ఆయనను నిద్రపోనివ్వలేదు. స్వీడన్ పౌరసత్వం రాగానే క్వాల్‌కామ్‌లో వస్తున్న భారీ జీతాన్ని, హోదాను పక్కనపెట్టి బయటకు వచ్చేశారు. ఆ సమయంలో భార్యకు ఉద్యోగం లేకపోవడం, మరోవైపు తనకేమో పార్కిన్సన్స్ వ్యాధి సంకేతాలు కనిపించడం పెద్ద సవాలుగా మారింది. అయినా భయపడలేదు.
ఇల్లు గడిచేందుకు పగటిపూట వోల్వో కార్స్ కంపెనీకి కన్సల్టెంట్‌గా పనిచేస్తూ, రాత్రి వేళల్లో తన ఇంట్లోని చిన్న వర్క్‌షాప్‌లో కొత్త కార్లు, బైక్‌ల డిజైనింగ్ పని చేపట్టేవారు. 'నేను పగలు ఒకరిగా, రాత్రి వేళల్లో సినిమా హీరో బ్యాట్‌మాన్ లాగా రెండు షిఫ్టుల్లో పనిచేశాను.' అని ఆయన నవ్వుతూ చెప్తారు అభిరామ్. ఇంజనీర్లను నియమించుకునే ఆర్థిక శక్తి లేకపోవడంతో.. స్వయంగా CAD డిజైనింగ్, సర్క్యూట్ బోర్డుల తయారీ, ప్రోగ్రామింగ్, మొబైల్ యాప్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోడింగ్.. ఇలా ప్రతిదీ తనే నేర్చుకుని సొంతంగా డిజైన్ చేశారు.
మేడ్ విత్ స్వీడన్-భారత్ మ్యానుఫ్యాక్చరింగ్ పవర్
సాధారణ ఎలక్ట్రిక్ వాహన కంపెనీల లాగా డబ్బులు వృథా చేయకుండ ‘యాంటీ-గిగాఫ్యాక్టరీ’ నమూనాను అభిరామ్ ఎంచుకున్నారు. స్వీడన్ సాంకేతిక నాణ్యత, డిజైన్ పాఠాలు, భారత్ తయారీ విధానంపై అభిరామ్ ఫోకస్ చేశారు. వీటి కలయికతో వాహనాలు రూపొందించారు. తేలికపాటి, బలమైన ఫ్లెక్స్‌ఫ్రేమ్, కర్ణ, ఏఐ సాంకేతికతతో నడిచే కంట్రోల్ యూనిట్, డ్రైవింగ్ శైలిని అర్థం చేసుకునే రైడర్ డిజిటల్ ట్విన్, డబుల్ లేదా సింగిల్ సీటర్ ఎలక్ట్రిక్ టూ-వీలర్లు (WBR Utility, BWR Urban), గాల్లో ఎగిరే ప్రయాణికుల విమానం ఫ్లైగా ఇందులోనివే.
అభిరామ్ శ్రమకు తగిన గుర్తింపుగా ఇటీవలే భారత్‌కు చెందిన ప్రముఖ బొండడ గ్రూప్‌తో తురగ మోటార్స్ కీలక ఒప్పందం కుదుర్చుకుంది. బొండడ గ్రూప్ నెట్‌వర్క్, తురగ మోటార్స్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ కలయికతో భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల విప్లవానికి శ్రీకారం చుట్టబోతున్నారు. బొండడ గ్రూప్ సీఎండీ డాక్టర్ బొండడ రాఘవేంద్రరావు, సీఈఓ అడ్మిరల్ ఆర్. శ్రీనివాస్, సీఎఫ్‌ఓ సత్యనారాయణ తన ఆలోచనను నమ్మి ముందుకు రావడం పట్ల అభిరామ్ ఆనందం వ్యక్తం చేశారు.
అభిరామ్ జీవితం నేర్పే 5 సూత్రాలు
1. మీకు అన్నీ తెలిసే వరకు ఆగకండి. అవసరమే మిమ్మల్ని కొత్త విషయాలు నేర్చుకునేలా చేస్తుంది.
2. మీ గమ్యం ఏంటో మీకు తెలిస్తే ఎంతటి కష్టమైనా మిమ్మల్ని ఆపలేదు.
3. లగ్జరీ ఉద్యోగాలు, సుఖవంతమైన జీవితం మీ కలలను చంపేస్తాయి. రిస్క్ తీసుకోవడం అలవాటు చేసుకోండి. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రండి.
4. పార్కిన్సన్స్ వంటి వ్యాధి ఉన్నప్పటికీ, దాన్ని సాకుగా చూపకుండా ముందుకు సాగారు. ఆరోగ్య సమస్యలు సాకుగా ఉండకూడదు.
5. మీరు కష్టపడి తయారుచేసిన ఆవిష్కరణలకు పేటెంట్లు, చట్టపరమైన రక్షణ పొందడం చాలా ముఖ్యం.
జేబులో రూ.35 వేలతో స్వీడన్ వెళ్లి.. బంగాళాదుంపలు తింటూ రోజులు గడిపిన ఓ సామాన్య తెలుగు యువకుడు, ఈ రోజు 64 అంతర్జాతీయ పేటెంట్లతో ఒక గ్లోబల్ ఆటోమొబైల్ బ్రాండ్‌ను నిర్మించడం నిజంగా అద్భుతం. ఆరోగ్య సమస్యలు, నిధుల కొరత ఉన్నా.. బలమైన సంకల్పం ఉంటే సాధించలేనిది ఏదీ లేదని అభిరామ్ తురగ జీవితం చెబుతుంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


