ఫెయిల్ అయ్యేది పరీక్షలో మాత్రమే, జీవితంలో కాదు.. మళ్ళీ కొట్లాడదాం.. విద్యార్థులకు ధైర్యాన్నిచ్చే షార్ట్ స్టోరీ!

Telangana Inter Results 2026 : తెలుగు రాష్ట్రాల్లో ఫలితాల ప్రకటనలు మెుదలయ్యాయి. ఈ సమయంలో విద్యార్థుల ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. కొందరు క్షణికావేశంలో చేయకూడని తప్పులు చేస్తారు. జీవితాన్ని నాశనం చేసుకుంటారు. కానీ అలాంటి తప్పు చేయాల్సిన అవసరం లేదు.

Published on: Apr 12, 2026 7:42 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రతీ ఏటా పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల ఆత్మహత్యల గురించి వింటుంటాం. పరీక్షలో ఫెయిల్ అయితే జీవితంలో ఫెయిల్ అయ్యామనే బాధలో ఉంటారు చాలా మంది విద్యార్థులు. కానీ పరీక్షలు తప్పితే మళ్లీ రాసుకోవచ్చు.. కానీ జీవితాన్ని ఎవరూ తిరిగి తీసుకురాలేరు. జీవితమనే పరీక్షను.. ఎన్ని కష్టాలు ఎదురైనా ఎదుర్కొనేవాడే నిజమైన మనిషి. పరీక్షలు అనేవి వస్తుంటాయ్.. పోతుంటాయ్.. కానీ జీవితం ఒక్కసారి పోతే తిరిగిరాదు. ఫెయిల్ అయిన విద్యార్థులు నాలుగు రోజులు సైలెంట్‌ ఉంటే మళ్లీ పాత రోజులు తిరిగివస్తాయి. క్షణికావేశంలో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

పరీక్షలో ఫెయిల్ అవ్వడం అనేది జీవితంలో ఒక చిన్న మలుపు మాత్రమే, అది జీవితాంతం కాదు. నిరాశలో ఉన్న విద్యార్థులకు ధైర్యాన్నిచ్చే ఒక చిన్న కథ ఇక్కడ ఉంది..

రుద్ర చిన్నప్పటి నుండి చదువులో ఎప్పుడూ ముందే ఉండేవాడు. కానీ, తను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన పోటీ పరీక్షలో ఆశించిన ఫలితం రాలేదు. తను ఫెయిల్ అయ్యానని తెలియగానే రుద్ర లోకం చీకటి అయిపోయింది. 'ఇక నా జీవితం వృథా, నా తల్లిదండ్రుల ముఖం ఎలా చూడాలి?' అనే ఆలోచనలతో తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. ఆత్మహత్యే ఏకైక మార్గం అని అనుకుని ఫ్యాన్ వైపు చూశాడు.

అదే సమయంలో అతని తాతయ్య గది తలుపు తట్టారు. రుద్ర అయిష్టంగానే తలుపు తీశాడు. తాతయ్య చేతిలో ఒక చిన్న మొక్క ఉంది. రుద్రకు ఈ మెుక్కను ఎందుకు తెచ్చాడో అర్థం కాలేదు. తాతయ్య అతడి పక్కన కూర్చుని ఇలా చెప్పారు:

'రుద్ర, నీకు తెలుసా? ఈ మొక్కను నేను ఆరు నెలల క్రితం నాటాను. మొదటి మూడు నెలలు ఇది అసలు పెరగనే లేదు. అందరూ ఇది చనిపోయింది పీకేయమన్నారు. కానీ నేను నీళ్లు పోస్తూనే ఉన్నాను. ఇప్పుడు చూడు, ఇది ఎంత బలంగా ఉందో! ఇది మొదట భూమి లోపల తన వేర్లను గట్టిగా పాతుకోవడానికి సమయం తీసుకుంది. నీ ఓటమి కూడా అటువంటిదే.' అని తాతయ్య చెప్పాడు.

తాతయ్య మాటలు వింటున్న రుద్ర కళ్ళలో నీళ్లు తిరిగాయి. తాతయ్య తన మాటలు అలాగే కొనసాగించారు:

'ఒక పరీక్షా పత్రం నీ విలువను నిర్ణయించలేదు. ప్రపంచంలో గొప్ప గొప్ప వ్యక్తులైన థామస్ ఆల్వా ఎడిసన్, అబ్రహం లింకన్, స్టీవ్ జాబ్స్.. వీరంతా ఎన్నో సార్లు విఫలమైనవారే. ఓటమి నిన్ను కిందకు పడేయడానికి రాదు, నిన్ను మరింత బలంగా మార్చడానికి వస్తుంది. నువ్వు ప్రాణాలు తీసుకుంటే నీ తల్లిదండ్రుల గుండెల్లో మిగిలేది ఆరని మంట మాత్రమే. నీ మీద మాకున్న ప్రేమ నీ మార్కుల కంటే వేల రెట్లు ఎక్కువ.' అని వివరించాడు తాతయ్య.

రుద్రకు అప్పుడు అర్థమైంది.. తాను చేయాలనుకున్నది ఎంత పెద్ద తప్పో! తన తప్పులను దిద్దుకుని, రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ చదవడం ప్రారంభించాడు. మరుసటి ఏడాది అదే పరీక్షలో అత్యుత్తమ ర్యాంక్ సాధించాడు. ఆ తర్వాత సివిల్స్ వైపు ఫోకస్ చేశాడు. కొన్నేళ్లకు ఓ జిల్లాకు కలెక్టర్ అయ్యాడు.

ఓడిపోవడం అంటే జీవితం ఆగిపోవడం కాదు అని మనకు రుద్ర స్టోరీ చెబుతోంది.

విద్యార్థులకు కొన్ని ముఖ్యమైన సూచనలు

నిశ్శబ్దాన్ని వీడండి: పరీక్షలో ఫెయిల్ అయి మీ మనసులో బాధ ఉంటే మీ తల్లిదండ్రులతో లేదా నమ్మకమైన స్నేహితులతో మాట్లాడండి. సమస్యను పంచుకుంటే సగం భారం తగ్గుతుంది.

ఒక్క పరీక్షే జీవితం కాదు: ఈ రోజు మీకు పెద్ద సమస్యగా అనిపించేది, ఐదేళ్ల తర్వాత తిరిగి చూసుకుంటే చాలా చిన్న విషయంగా కనిపిస్తుంది. ఆ తర్వాత విషయాలను గుర్తుచేసుకుని మీరే నవ్వుతారు.

తల్లిదండ్రుల ప్రేమను గుర్తించండి: మీ మార్కుల కంటే మీ ప్రాణమే వారికి ముఖ్యం. మీ విజయం కంటే మీ క్షేమమే వారి మొదటి ప్రాధాన్యత. ఆ సమయానికి రెండు మాటలు అన్నా.. అది మీ మంచి కోసమే అన్నది. వాటిని పట్టించుకుని ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకొవద్దు.

స్నేహితులతో ఉండండి : ఫెయిల్ అయినంత మాత్రన స్నేహితులతో ఉండకూడదనే రూలేమీ లేదు. స్నేహితులతో హాయిగా గడపండి. దాదాపు సగం టెన్షన్ మీకు తగ్గిపోద్ది.

ప్రత్యామ్నాయ మార్గాలను వెతకండి: ఒక దారి మూసుకుపోతే, మరో వెయ్యి దారులు తెరుచుకుంటాయి. క్రియేటివిటీ, క్రీడలు, వ్యాపారం వంటి ఎన్నో రంగాల్లో రాణించవచ్చు.

'జీవితం అంటే కేవలం గెలవడం మాత్రమే కాదు, పడిన ప్రతిసారీ తిరిగి లేవడం. ఆత్మహత్య అనేది సమస్యకు పరిష్కారం కాదు, అది ఒక శాశ్వతమైన, సరిదిద్దుకోలేని తప్పు. ధైర్యంగా ఉండండి, మళ్ళీ ప్రయత్నించండి!'

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More