Heart health : మీ గుండె ఆరోగ్యంగా ఉందా? లేదా? ఈ 3 సింపుల్ టెస్ట్‌లతో ఇంట్లోనే తెలుసుకోండి..
మీ హృదయ సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి ఎల్లప్పుడూ ఆస్పత్రులకు పరుగెత్తాల్సిన అవసరం లేదు. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ నవీన్ భమ్రీ సూచించిన 3 సులువైన స్వీయ పరీక్షల వివరాలు ఇక్కడ పరిశీలించండి.
సాధారణంగా శరీర ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి ప్రతీ ఏటా బ్లడ్ టెస్టులు చేయించుకోవడం, డిజిటల్ స్కేల్‌పై బరువును సరిచూసుకోవడం మనకు అలవాటే. అయితే మన గుండె ఎంత బలంగా, ఆరోగ్యంగా ఉంది? రోజువారీ ఒత్తిళ్లను తట్టుకోగలదా? అని తెలుసుకోవడానికి ప్రతిసారీ ల్యాబ్‌ల చుట్టూ, భారీ వైద్య పరికరాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని గుండె వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇంట్లోనే ఉంటూ కేవలం కొన్ని శారీరక కదలికలతో మీ హృదయ స్పందనలు, ఫిట్‌నెస్ స్థాయిని సులభంగా కొలవవచ్చని చెబుతున్నారు.

దిల్లీలోని బ్లాక్-మాక్స్, మాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ నవీన్ భమ్రీ ఇటీవల ఒక పోస్ట్‌లో.. గుండె ఆరోగ్యాన్ని, కండరాల దృఢత్వాన్ని పరీక్షించుకునేందుకు మూడు సులువైన స్వీయ పరీక్షలను పరిచయం చేశారు. అవి..
1. మెట్ల పరీక్ష..
శరీర ఆక్సిజన్ నిల్వలను, హృదయ స్పందన సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఇది ఒక ప్రామాణిక మార్గం.
ఈ పరీక్ష కోసం మీరు కంటిన్యూస్‌గా 60 మెట్లను 60 సెకన్ల వ్యవధిలో ఎక్కాల్సి ఉంటుంది. ఈ క్రమంలో గోడను గానీ, మెట్ల పక్కన ఉన్న రైలింగ్‌ను గానీ పట్టుకోకూడదు, మధ్యలో ఆగకూడదు.
"ఈ రీతిలో వేగంగా మెట్లు ఎక్కినప్పుడు మీకు తీవ్రమైన ఆయాసం రాకుండా, ఛాతీలో ఎలాంటి నొప్పి లేకుండా ఉంటే మీ గుండె పంపింగ్ సామర్థ్యం, శారీరక ఫిట్‌నెస్ అద్భుతంగా ఉన్నట్లే," అని డాక్టర్ నవీన్ భమ్రీ వివరించారు.
2. కుర్చీ పరీక్ష..
ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన వారిలో శరీర కింది భాగపు కండరాల బలం, గుండె సత్తువను కొలవడానికి ఈ పరీక్ష ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఒక మామూలు కుర్చీపై కూర్చుని, మీ రెండు చేతులను ఛాతీకి అడ్డంగా పెట్టుకోవాలి. కుర్చీ హ్యాండిల్స్ ఆధారంగా లేకుండా కూర్చోవాలి, నిలబడాలి. 40 ఏళ్లు దాటిన వారు ఎలాంటి విరామం లేకుండా వరుసగా 16 సార్ల కంటే ఎక్కువసార్లు కూర్చుని లేవగలిగితే వారి ఫిట్‌నెస్ మెరుగ్గా ఉన్నట్లు లెక్క. ఒకవేళ 14 సార్ల కంటే తక్కువ మాత్రమే చేయగలిగితే శారీరక దృఢత్వాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని అర్థం.
3. హార్ట్ రేట్ రికవరీ టెస్ట్..
వ్యాయామం చేసిన తర్వాత మన నాడీ వ్యవస్థ ఎంత వేగంగా సాధారణ స్థితికి చేరుకుంటుందో కొలిచే పరీక్ష ఇది.
కనీసం 3 నుంచి 5 నిమిషాల పాటు రన్నింగ్, వేగంగా నడవడం లేదా మెట్లు ఎక్కడం వంటి కార్డియో వ్యాయామం చేయాలి. వెంటనే మీ పల్స్ (హృదయ స్పందనల రేటు) కొలవాలి. ఆ తర్వాత సరిగ్గా ఒక నిమిషం పాటు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుని, మళ్లీ పల్స్ చెక్ చేయాలి.
"ఒక నిమిషం విశ్రాంతి తర్వాత మీ హార్ట్ రేట్ 25 బీట్ల కంటే ఎక్కువగా తగ్గితే మీ హృదయ రికవరీ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తున్నట్లే. అదే సమయంలో ఆ తగ్గుదల 12 బీట్ల కంటే తక్కువగా ఉంటే మీ గుండె రికవరీ మందగించిందని, హృదయ ఫిట్‌నెస్ బలహీనంగా ఉందనడానికి అది సంకేతం," అని డాక్టర్ నవీన్ తెలిపారు.
జాగ్రత్తలు తప్పనిసరి..
ఈ ప్రాథమిక పరీక్షలు కేవలం మీ ఫిట్‌నెస్ స్థాయిపై ఒక అవగాహన తెచ్చుకోవడానికి మాత్రమే ఉపయోగపడతాయి. ఇవి పూర్తిస్థాయి వైద్య నిర్ధారణలు కావు. ఈ స్వీయ పరీక్షలు చేస్తున్న సమయంలో ఛాతీలో నొప్పి, విపరీతమైన కళ్లు తిరగడం, లేదా అసాధారణమైన ఆయాసం అనిపిస్తే వెంటనే పరీక్షను నిలిపివేసి, అనుభవజ్ఞులైన వైద్యుడిని సంప్రదించడం శ్రేయస్కరం.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


