...
...
Next Story

Oesophageal cancer : వేడి వేడి కాఫీ, టీ తాగే వారిలో క్యాన్సర్​ ముప్పు అధికం!

బాగా వేడిగా ఉన్న టీ, కాఫీలు తాగడం వల్ల ఫుడ్​ పైప్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం మూడింతలు అవుతుందని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ అధ్యయనం హెచ్చరిస్తోంది. టీ, కాఫీల వల్ల కాకుండా.. తాగే ఉష్ణోగ్రత వల్లే ఈ ముప్పు పెరుగుతుందని దాదాపు 10 లక్షల మందిపై జరిపిన పరిశోధనలో తేలింది.

Published on: Sep 11, 2026, 07:29:37 IST
Advertisement

ఉదయాన్నే లేవగానే పొగలు కక్కే వేడివేడి టీ లేదా ఫిల్టర్ కాఫీ తాగడం మన ఇళ్లలో ఒక దినచర్య. ఇరానీ చాయ్ అయినా, కాఫీ అయినా నోరు కాలేంత వేడిగా ఉంటేనే ఆ మజా అనుకుంటారు చాలామంది. అయితే బాగా వేడిగా ఉన్న పానీయాలు తాగడం వల్ల ప్రాణాంతకమైన ఫుడ్​పైప్ క్యాన్సర్ బారిన పడే ప్రమాదం దాదాపు మూడు రెట్లు పెరుగుతుందని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ తాజా పరిశోధన హెచ్చరిస్తోంది.

మీకు వేడి వేడి కాఫీ, టీ తాగే అలవాటు ఉందా?
మీకు వేడి వేడి కాఫీ, టీ తాగే అలవాటు ఉందా?

యూకే బయోబ్యాంక్, మిలియన్ ఉమెన్ స్టడీ ఆధారంగా దాదాపు 9.8 లక్షల మందిపై 10 ఏళ్లకు పైగా నిర్వహించిన ఈ సుదీర్ఘ అధ్యయన వివరాలను ‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్యాన్సర్’ ప్రచురించింది. పానీయాలను గోరువెచ్చగా తాగేవారితో పోలిస్తే, బాగా వేడిగా తాగే అలవాటు ఉన్నవారికి 'ఒసోఫాగియల్ స్క్వామస్ సెల్ కార్సినోమా' (ఎస్​సీసీ) అనే ఆహారనాళ క్యాన్సర్ వచ్చే ముప్పు మూడు రెట్లు ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు లెక్క తేల్చారు. సాధారణ వేడితో తాగేవారికి కూడా ఈ ప్రమాదం 1.7 రెట్లు పెరుగుతున్నట్లు గుర్తించారు.

రోజుకు ఆరు కప్పులు దాటితే మరింత ప్రమాదం!

కేవలం పానీయాల ఉష్ణోగ్రత మాత్రమే కాకుండా, రోజులో ఎన్నిసార్లు తాగుతున్నారనేది కూడా కీలకమేనని అధ్యయనం వెల్లడించింది. రోజుకు ఆరు లేదా అంతకంటే ఎక్కువ కప్పుల వేడి పానీయాలు తాగే వ్యక్తులకు ఈ క్యాన్సర్ ముప్పు 71 శాతం పెరుగుతోంది. అయితే ఎంత తరచుగా తాగుతున్నామనే దానికంటే పానీయాన్ని ఎంత వేడిగా తాగుతున్నామనేదే ప్రధాన ప్రమాదకారకమని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.

టీ, కాఫీల తప్పు కాదు.. ఉష్ణోగ్రతే శాపం!

ఈ పరిశోధన ఫలితాలు టీ లేదా కాఫీ ఆరోగ్యానికి హానికరమని చెప్పడం లేదని పరిశోధకులు విస్పష్టంగా తెలిపారు. "ఫుడ్​ పైప్ క్యాన్సర్ రావడానికి టీ, కాఫీలలో ఉండే కాంపౌండ్లు కారణం కాదు. వాటిని తాగే అధిక ఉష్ణోగ్రత మాత్రమే అసలు కారణం," అని పరిశోధన బృందం స్పష్టం చేసింది.

హోటళ్లు, చాయ్ కొట్ల వద్ద పొయ్యి మీద నుంచి దించిన వెంటనే పొగలు కక్కే టీని తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. టీ, కాఫీలను కప్పులో పోసుకున్న తర్వాత కనీసం రెండు నుంచి మూడు నిమిషాల పాటు చల్లారనివ్వాలని, అది గోరువెచ్చగా మారిన తర్వాతే తాగాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల టీ ఇచ్చే రిఫ్రెష్‌మెంట్‌ను ఆస్వాదించడంతో పాటు ఫుడ్​ పైప్ క్యాన్సర్ ముప్పు నుంచి కాపాడుకోవచ్చు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON