ORS Day: ఓఆర్‌ఎస్ వాడకంపై అపోహలు - డబ్ల్యూహెచ్‌ఓ సిఫార్సు చేసిన ఫార్ములా ఎందుకు ముఖ్యం?
ప్రపంచ ఓఆర్‌ఎస్ దినోత్సవం (World ORS Day) సందర్భంగా, సిప్లా హెల్త్ మెడికల్ ఎక్స్‌పర్ట్ డాక్టర్ ఉషా చెన్నూరు రాసిన ప్రత్యేక వ్యాసం ఇది. డీహైడ్రేషన్ బారిన పడినప్పుడు ఓఆర్‌ఎస్ వాడకంపై ప్రజల్లో ఉన్న పలు అపోహలను ఈ వ్యాసం తొలగిస్తుంది. W.H.O. ఫార్ములా ఎందుకు కీలకమో ఇందులో స్పష్టంగా వివరించారు.
డీహైడ్రేషన్ (శరీరం నీటిని, ద్రవాలను కోల్పోవడం) అనేది తక్షణమే శ్రద్ధ వహించాల్సిన ఆరోగ్య సమస్య. కానీ, చాలామంది దీనిని ఒక సాధారణ అసౌకర్యంగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. విరేచనాలు (డయేరియా), వాంతులు, జ్వరం, ఎండ దెబ్బ లేదా విపరీతమైన చెమట కారణంగా శరీరం నీటితో పాటు ముఖ్యమైన ఎలక్ట్రోలైట్లను కూడా కోల్పోతుంది. అందుకే సరైన విధానంలో శరీరానికి తిరిగి హైడ్రేషన్ అందించడం చాలా ముఖ్యం.

దశాబ్దాలుగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ, ఓఆర్‌ఎస్ విషయంలో ఇప్పటికీ కొన్ని అపోహలు కొనసాగుతూనే ఉన్నాయి. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (NFHS-5) నివేదిక ప్రకారం.. చిన్న పిల్లలున్న తల్లులలో 98% మందికి ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల గురించి తెలుసు. కానీ, విరేచనాలతో బాధపడుతున్న పిల్లల్లో కేవలం 74% మందికి మాత్రమే ఓఆర్‌ఎస్ అందిస్తున్నారు. ఈ గణాంకాలు అవగాహనకు, ఆచరణకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని స్పష్టంగా చూపుతున్నాయి.
ఓఆర్‌ఎస్‌పై ఉన్న సాధారణ అపోహలు – అసలు నిజాలు
అపోహ: విరేచనాలు (Diarrhoea) ఉన్నప్పుడు మాత్రమే ఓఆర్‌ఎస్ వాడాలి.
నిజం: ఓఆర్‌ఎస్ ఉపయోగం కేవలం విరేచనాలకే పరిమితం కాదు. వాంతులు, జ్వరం, ఎండ దెబ్బ లేదా విపరీతమైన చెమట వల్ల శరీరం ద్రవాలు, ఎలక్ట్రోలైట్లను కోల్పోయిన ప్రతి సందర్భంలోనూ ఓఆర్‌ఎస్ అవసరం.
అపోహ: ఓఆర్‌ఎస్ కేవలం పిల్లల కోసమే.
నిజం: వయసుతో సంబంధం లేకుండా పిల్లలు, పెద్దలు ఎవరైనా డీహైడ్రేషన్ బారిన పడవచ్చు. అనారోగ్యం లేదా ఎండ తీవ్రత వల్ల నీటి శాతాన్ని కోల్పోయినప్పుడు పెద్దలకు కూడా ఓఆర్‌ఎస్ ఎంతో అవసరం.
అపోహ: కేవలం నీరు తాపితే ప్రతి డీహైడ్రేషన్ సమస్య తగ్గిపోతుంది.
నిజం: రోజూ తగినంత నీరు తాగడం ఆరోగ్యానికి మంచిదే. కానీ విరేచనాలు, వాంతులు లేదా జ్వరం వచ్చినప్పుడు నీటితో పాటు సోడియం, పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్లను కూడా శరీరం కోల్పోతుంది. ఆ సమయంలో కేవలం నీరు తాగడం వల్ల ఎలక్ట్రోలైట్ల సమతుల్యత పునరుద్ధరణకు నోచుకోదు.
అపోహ: మార్కెట్లో దొరికే అన్ని హైడ్రేషన్ డ్రింక్స్ ఓఆర్‌ఎస్‌లాగే పనిచేస్తాయి.
నిజం: అన్ని రకాల డ్రింక్స్ ఓఆర్‌ఎస్‌తో సమానం కావు. శాస్త్రీయంగా తయారు చేసిన డబ్ల్యూహెచ్‌ఓ ఫార్ములా మాత్రమే డీహైడ్రేషన్ సమయంలో శరీరం కోల్పోయిన ఎలక్ట్రోలైట్లను సరైన మోతాదులో తిరిగి అందిస్తుంది.
అపోహ: అన్ని ఓఆర్‌ఎస్ ఫార్ములాలు ఒకేలా ఉంటాయి.
నిజం: ఓఆర్‌ఎస్ ఫార్ములా తయారీ చాలా కీలకమైనది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (W.H.O.) 245 mOsm/l ఆస్మోలారిటీ ఉన్న ఫార్ములాను సిఫార్సు చేస్తుంది. ఇది శరీరం ద్రవాలను త్వరగా గ్రహించేలా చేస్తుంది. అయితే చాలామందికి ఈ కొలత లేదా ఫార్ములా ప్రమాణాల గురించి అవగాహన ఉండటం లేదు.
సరైన ఓఆర్‌ఎస్‌ను ఎంచుకోవడం ఎందుకు ముఖ్యం?
అవగాహన ఉండటం ఒక్కటే సరిపోదు, సరైన నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం. ఓఆర్‌ఎస్ ఫార్ములాల మధ్య వ్యత్యాసాలు ఉంటాయని గ్రహించి, డబ్ల్యూహెచ్‌ఓ సిఫార్సు చేసిన 245 mOsm/l ఆస్మోలారిటీ ప్రమాణాన్ని గుర్తించడం అవసరం.
షాపుల్లో ఓఆర్‌ఎస్ ప్యాకెట్ కొనుగోలు చేసేటప్పుడు, అది "W.H.O. Recommended Formula" ప్రకారం తయారైందో లేదో తనిఖీ చేసుకోవడం చాలా ముఖ్యం. సరైన ఫార్ములాను ఉపయోగించడం ద్వారానే డీహైడ్రేషన్ నుంచి వేగంగా, సురక్షితంగా కోలుకోవడానికి వీలవుతుంది.
వ్యాసకర్త:
- డాక్టర్ ఉషా చెన్నూరు
మెడికల్ ఎక్స్‌పర్ట్, సిప్లా హెల్త్
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

E-Paper


