గర్భధారణలో టీకాల ప్రాముఖ్యత: తల్లి, పుట్టబోయే బిడ్డ రక్షణకు శ్రీరామరక్ష

గర్భధారణ సమయంలో టీకాలు తీసుకోవడం వల్ల తల్లితో పాటు పుట్టబోయే బిడ్డకు కూడా అంటువ్యాధుల నుంచి బలమైన రక్షణ లభిస్తుంది. టీకాల ప్రాముఖ్యత, ఏ సమయాల్లో ఏ వ్యాక్సిన్లు వేయించుకోవాలో ఈ ప్రత్యేక కథనంలో సీనియర్ కన్సల్టెంట్, ఆబ్‌స్టెట్రిక్స్ & గైనకాలజీ డాక్టర్ శారదా వాణి వివరించారు.

Published on: Aug 26, 2026, 12:02:16 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గర్భధారణ అనేది ప్రతి స్త్రీ జీవితంలోనూ ఎంతో కీలకమైన ఘట్టం. ఈ సమయంలో తల్లిని వివిధ రకాల ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుకోవడం అంటే, పుట్టబోయే బిడ్డకు సురక్షితమైన భవిష్యత్తును అందించడమే. కొన్ని ఇన్ఫెక్షన్లు గర్భధారణ సమయంలో సోకితే తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీయడమే కాకుండా, కాబోయే పసికందుపైనా ప్రతికూల ప్రభావం చూపుతాయి.

సీనియర్ కన్సల్టెంట్, ఆబ్‌స్టెట్రిక్స్ & గైనకాలజీ డాక్టర్ శారదా వాణి
సీనియర్ కన్సల్టెంట్, ఆబ్‌స్టెట్రిక్స్ & గైనకాలజీ డాక్టర్ శారదా వాణి

గర్భధారణ సమయంలో తల్లి వేయించుకునే టీకాల ద్వారా ఆమె శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి 'యాంటీబాడీలు' తయారవుతాయి. ఇవి 'ప్లాసెంటా' (మాయ) ద్వారా బిడ్డకు చేరతాయి. ఫలితంగా శిశువు జన్మించిన తొలి నెలల్లో.. అంటే సొంతంగా టీకాలు తీసుకునే వయసు వచ్చేవరకు ఈ యాంటీబాడీలే రోగనిరోధక కవచంగా పనిచేస్తాయి.

గర్భధారణ సమయంలో ఇచ్చే ముఖ్యమైన టీకాలు

ప్రతి మహిళ ఆరోగ్య పరిస్థితి, గతంలో తీసుకున్న టీకాల వివరాలు, ఇన్ఫెక్షన్ల ప్రమాద తీవ్రత ఆధారంగా గైనకాలజిస్టులు వ్యాక్సినేషన్ ప్రణాళికను ఖరారు చేస్తారు.

1. టీడీ / ధనుర్వాతం (Tetanus) టీకా

ధనుర్వాతం (టెటానస్) అనేది నరాల వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదకర బాక్టీరియల్ ఇన్ఫెక్షన్. గర్భధారణ సమయంలో తల్లికి టెటానస్ టీకా ఇవ్వడం వల్ల తల్లితో పాటు, నవజాత శిశువుల్లో వచ్చే 'నియోనాటల్ టెటానస్' వ్యాధిని సమర్థవంతంగా అరికట్టవచ్చు. గతంలో టీకాలు తీసుకోని వారు లేదా వ్యాక్సినేషన్ రికార్డులు లేని గర్భిణులు వైద్యుల సలహా మేరకు నిర్ణీత వ్యవధిలో రెండు డోసుల టీకా వేయించుకోవాల్సి ఉంటుంది.

2. టీడాప్ (Tdap) వ్యాక్సిన్

ఈ టీకా ధనుర్వాతం (Tetanus), డిఫ్తీరియా (Diphtheria), కోరింత దగ్గు (Pertussis) అనే మూడు రకాల వ్యాధుల నుంచి రక్షణ ఇస్తుంది. సాధారణంగా గర్భధారణలోని 27 నుంచి 36 వారాల మధ్య ఈ టీకాను ఎంచుకోవాలని వైద్యులు సూచిస్తారు. ఈ సమయంలో టీకా తీసుకోవడం వల్ల ఉత్పత్తయ్యే యాంటీబాడీలు ప్రసవానికి ముందే బిడ్డకు బదిలీ అవుతాయి. దీనివల్ల నవజాత శిశువులకు తీవ్రమైన కోరింత దగ్గు నుంచి ముందస్తు రక్షణ దక్కుతుంది.

3. ఇన్‌ఫ్లుయెంజా (ఫ్లూ) వ్యాక్సిన్

గర్భధారణ సమయంలో ఫ్లూ ఇన్ఫెక్షన్ సోకితే దాని తీవ్రత అధికంగా ఉంటుంది. కాబట్టి గర్భధారణ ఏ దశలోనైనా క్లినికల్ అవసరాలను బట్టి ఇన్-యాక్టివేటెడ్ (నిర్వీర్యం చేసిన) ఇన్‌ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను నిరభ్యంతరంగా వేయించుకోవచ్చు.

ఇతర టీకాల అవసరం ఉందా?

గర్భిణి ఆరోగ్య పరిస్థితి, వ్యాధి ముప్పు ఆధారంగా మరికొన్ని టీకాలను పరిశీలిస్తారు. ఉదాహరణకు, హెపటైటిస్-బి ఇన్ఫెక్షన్ ప్రమాదం ఉన్నవారికి ఆ వ్యాక్సిన్ ఇస్తారు. అలాగే ఆర్‌ఎస్‌వి (RSV) వ్యాక్సిన్‌ను కూడా నిర్దిష్ట గర్భధారణ వారాల ఆధారంగా వైద్యులు నిర్ధారిస్తారు. ఏ టీకా వేయించుకోవాలన్నా చికిత్స అందిస్తున్న గైనకాలజిస్ట్ సలహా తప్పనిసరి.

గర్భధారణ సమయంలో టీకాలు సురక్షితమేనా?

గర్భధారణ సమయంలో సిఫార్సు చేసే మెజారిటీ టీకాలు 'నాన్-లైవ్' (సజీవంగా లేని క్రిములతో చేసే) వ్యాక్సిన్లు. వీటి భద్రతను అంతర్జాతీయ పరిశోధనలు ధ్రువీకరించాయి. టీకా వేసుకున్న చోట స్వల్ప నొప్పి, అలసట, స్వల్ప జ్వరం వంటి లక్షణాలు కనిపించినా, ఇవి సాధారణమైనవి మరియు తాత్కాలికమే.

అయితే గర్భధారణ సమయంలో అన్ని రకాల టీకాలు సురక్షితం కావు. ఎంఎంఆర్ (MMR), చికెన్‌పాక్స్ (Varicella) వంటి 'లైవ్' (సజీవ క్రిములతో కూడిన) వ్యాక్సిన్లను గర్భధారణ సమయంలో పూర్తిగా నివారిస్తారు. వీటివల్ల కడుపులోని బిడ్డకు ముప్పు ఉండే అవకాశం ఉన్నందున, వీటిని గర్భధారణకు ముందే లేదా ప్రసవం పూర్తయిన తర్వాత మాత్రమే వేయించుకోవాలి.

గర్భిణులు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు

  1. గర్భధారణ ఆరంభంలోనే మీ గైనకాలజిస్ట్‌ను కలిసి వ్యాక్సినేషన్ షెడ్యూల్‌పై చర్చించండి.
  2. మీరు గతంలో వేయించుకున్న టీకాల రికార్డులను వైద్యులకు చూపించండి.
  3. మీకు ఉన్న అలర్జీలు, ఇతర ఆరోగ్య సమస్యలు లేదా గతంలో టీకాల వల్ల వచ్చిన ప్రతికూల ప్రభావాల గురించి స్పష్టంగా వివరించండి.
  4. ఏదైనా టీకా వేయించుకోవడం మర్చిపోతే ఆందోళన చెందవద్దు. వైద్యుల సలహాతో గర్భధారణ తర్వాతి దశలో లేదా ప్రసవానంతరం కూడా వాటిని పూర్తి చేసుకోవచ్చు.
  5. గర్భధారణ సమయ సంరక్షణలో టీకాలు అత్యంత కీలకమైన భాగం. సరియైన టీకాల పట్టికను పాటించడం ద్వారా అంటువ్యాధుల నుంచి తల్లి సురక్షితంగా ఉండటంతో పాటు, పుట్టబోయే బిడ్డకు ఆరోగ్యకరమైన లభ్యం అవుతుంది.

వ్యాసకర్త:

— డాక్టర్ శారదా వాణి,

సీనియర్ కన్సల్టెంట్, ఆబ్‌స్టెట్రిక్స్ & గైనకాలజీ,

మినిమల్ యాక్సెస్ సర్జన్ (లాపరోస్కోపీ),

హై-రిస్క్ ప్రెగ్నెన్సీ స్పెషలిస్ట్,

యశోద హాస్పిటల్స్, హైదరాబాద్.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More