World Book Day 2026 : పుస్తకం ఉన్న చోటే ప్రజ్ఞ… పఠనం ఉన్న చోటే పురోగతి
World Book Day 2026 : పుస్తకం కేవలం కాగితాల కుప్ప కాదు.. అది మనిషిని శిల్పంలా తీర్చిదిద్దే జ్ఞాన భాండాగారం. నేటి డిజిటల్ యుగంలో పుస్తక పఠనం ఆవశ్యకతపై విశ్లేషణ….
ఇల్లు ఎంత పెద్దదో కాదు… అందులో ఉన్న పుస్తకాలే ఆ ఇంటి విలువను నిర్ణయిస్తాయి. సమాజం ఎంత అభివృద్ధి చెందిందో కాదు… ఎంత విజ్ఞానంతో ముందుకు సాగుతోందో అదే అసలు ప్రమాణం. ఈ వాక్యాలు కేవలం భావోద్వేగపు మాటలు కావు. నాగరిక సమాజ నిర్మాణానికి పునాది అయిన శాశ్వత సత్యాలు. ప్రపంచ పుస్తక దినోత్సవం మనకు గుర్తు చేసే గొప్ప సందేశం ఇదే.పుస్తకం తెరిస్తే మనసు తెరుచుకుంటుంది… జ్ఞానం వెలుగుతుంది… భవిష్యత్తు మెరుగవుతుంది.

ప్రపంచ నాగరికతను ముందుకు నడిపించిన అద్భుత సాధనం ఏదైనా ఉందంటే అది పుస్తకం. మనిషి ఆలోచనకు ఆకారం ఇచ్చింది, అనుభవాలకు అక్షరరూపం ఇచ్చింది, తరతరాల జ్ఞానాన్ని తరలించింది పుస్తకమే. శతాబ్దాలు మారినా, సాంకేతిక పరిజ్ఞానం ఎంత వేగంగా అభివృద్ధి చెందినా, పుస్తకానికి ఉన్న స్థానం మాత్రం ఎప్పటికీ తగ్గదు. ఎందుకంటే పుస్తకం కేవలం కాగితపు అట్ట కాదు ఓగురువు,ఓమిత్రుడు, ఓ మార్గదర్శి, ఓ మౌన విప్లవం.
మనిషి ఒంటరిగా ఉన్నప్పుడు అతనితో మాట్లాడేది పుస్తకం. అయోమయంలో ఉన్నప్పుడు దారి చూపేది పుస్తకం. రాయిలాంటి మనిషిని శిల్పంలా తీర్చిదిద్దేది కూడా పుస్తకమే. ఒక మంచి పుస్తకం మన ఆలోచనలను మార్చగలదు; ఒక గొప్ప పుస్తకం మన జీవిత దిశనే మార్చగలదు. అందుకే “పుస్తకం ఉన్న చోటే ప్రజ్ఞ ఉంటుంది” అని పెద్దలు చెప్పిన మాట నేటికీ అక్షర సత్యమే.
ప్రతి సంవత్సరం ఏప్రిల్ 23న ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని జరుపుకుంటారు. పుస్తకాల ప్రాముఖ్యతను గుర్తు చేయడం, పఠన సంస్కృతిని ప్రోత్సహించడం, రచయితల కృషిని గౌరవించడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం. గతాన్ని, భవిష్యత్తును కలిపే వారధిగా, తరాల మధ్య మరియు సంస్కృతుల మధ్య అనుసంధానకర్తగా పుస్తకాల పాత్ర అపారమైనది. వాస్తవ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడమే కాదు, కల్పిత ప్రపంచాలను సృష్టించే మానవ సామర్థ్యానికి కూడా పుస్తకాలు గొప్ప నిదర్శనం.
మన భారతీయ సంస్కృతిలో పుస్తకాలకు అపారమైన గౌరవం ఉంది. వేదాలు, ఉపనిషత్తులు, రామాయణం, మహాభారతం, భాగవతం వంటి గ్రంథాలు కేవలం ఆధ్యాత్మిక పుస్తకాలు మాత్రమే కాదు; అవి జీవన మార్గదర్శకాలు. ధర్మం, నీతి, సామాజిక బాధ్యత, మనుష్యత్వం వంటి విలువలను తరతరాలకు అందించిన మహోన్నత గ్రంథ సంపద అవి. తెలుగు సాహిత్యంలోనూ నన్నయ, తిక్కన, యేర్రప్రగడ నుంచి గురజాడ, శ్రీశ్రీ, విశ్వనాథ, సినారె వరకు ఎన్నో మహనీయులు తమ రచనలతో సమాజాన్ని మేల్కొలిపారు. పుస్తకం మార్పుకు ఆయుధమని వారు నిరూపించారు.
నేటి డిజిటల్ యుగంలో సమాచారానికి కొదవ లేదు. మొబైల్ ఫోన్ చేతిలోకి వచ్చాక ప్రపంచం వేలిముద్రలోకి వచ్చింది. ఒక క్లిక్‌తో వేలాది విషయాలు తెలుసుకోవచ్చు. కానీ సమాచారం పెరగడం ఒకటైతే, జ్ఞానం పెరగడం మరోటి. సోషల్ మీడియా పోస్టులు, చిన్న వీడియోలు, తాత్కాలిక వినోదం మనసును ఆకట్టుకోవచ్చు గాని, ఆలోచనను పదును పెట్టేది మాత్రం పుస్తక పఠనమే. పుస్తకం మనల్ని ఆలోచింపజేస్తుంది. మనలో ప్రశ్నలు రేకెత్తిస్తుంది. సమాధానాల కోసం లోతుగా వెతకడం నేర్పుతుంది.
ఒక పుస్తకాన్ని శ్రద్ధగా చదివితే ఏకాగ్రత పెరుగుతుంది. భాషా పటిమ మెరుగవుతుంది. విశ్లేషణాత్మక దృష్టి పెరుగుతుంది. సహనం, లోతైన ఆలోచన, అభిప్రాయ నిర్మాణం వంటి లక్షణాలు అలవడతాయి. ముఖ్యంగా విద్యార్థి దశలో పఠనం ఒక వ్యక్తిత్వ నిర్మాణ ప్రక్రియ. పరీక్షల కోసం మాత్రమే కాదు, జీవితాన్ని అర్థం చేసుకోవడానికి కూడా చదవాలి. పాఠ్యపుస్తకాలు ఉద్యోగాన్ని ఇవ్వొచ్చు; మంచి పుస్తకాలు జీవితాన్ని నిర్మిస్తాయి.
నేటి యువతలో చదివే అలవాటు తగ్గిపోతుందనే ఆందోళన సమాజంలో స్పష్టంగా కనిపిస్తోంది. పుస్తకంతో గడిపే సమయం తగ్గి, స్క్రీన్ ముందు గడిపే సమయం పెరుగుతోంది. ఇది కేవలం అలవాటు మార్పు కాదు ఆలోచనా విధానంపై ప్రభావం చూపే పరిణామం. వేగవంతమైన సమాచార వినియోగం వల్ల లోతైన పఠనం తగ్గిపోతోంది. ఫలితంగా సహనం, విమర్శనాత్మక దృష్టి, భావవ్యక్తీకరణ సామర్థ్యం కూడా దెబ్బతింటున్నాయి.
ఇక్కడ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వాల బాధ్యత ఎంతో ఉంది. చిన్ననాటి నుంచే పిల్లల్లో కథల పుస్తకాలు చదివే అలవాటు పెంచాలి. ప్రతి ఇంట్లో చిన్న లైబ్రరీ ఉండాలి. పాఠశాలల్లో గ్రంథాలయాన్ని చైతన్యవంతం చేయాలి. విద్యార్థులు వారానికి కనీసం ఒక పుస్తకం చదివేలా ప్రోత్సహించాలి. పుస్తక సమీక్షలు, రచయితలతో సమావేశాలు, పఠన పోటీలు, సాహిత్య సభలు నిర్వహించాలి. పుస్తక పఠనం కూడా ఒక పండుగగా మారాలి.
గ్రంథాలయాల పాత్రను కూడా విస్మరించలేం. ఒక మంచి లైబ్రరీ అంటే అది ప్రాంతానికి జ్ఞాన కేంద్రం. అక్కడ పుస్తకాలు మాత్రమే కాదు, ఆలోచనలు పెరుగుతాయి. పట్టణాల్లోనే కాదు, గ్రామాల్లోనూ ఆధునిక సౌకర్యాలతో గ్రంథాలయాలు అవసరం. డిజిటల్ యుగానికి అనుగుణంగా ఈ-లైబ్రరీలు, ఆడియో బుక్స్, మొబైల్ లైబ్రరీలు అందుబాటులోకి రావాలి. చదవాలనే ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ పుస్తకం చేరాలి.
తెలుగు పుస్తకాల ప్రోత్సాహం కూడా అత్యవసరమైన అంశం. మాతృభాషలో చదివిన జ్ఞానం మనసుకు దగ్గరగా ఉంటుంది. భావోద్వేగానికి, సంస్కృతికి, సామాజిక చైతన్యానికి అది బలమైన పునాది. తెలుగు రచయితలను ఆదరించాలి. స్థానిక చరిత్ర, సంస్కృతి, విజ్ఞానం, సామాజిక అంశాలపై మరిన్ని రచనలు వెలువడాలి. కొత్త రచయితలకు వేదికలు కల్పించాలి. పుస్తక ప్రచురణ రంగానికి ప్రభుత్వ ప్రోత్సాహం అవసరం. పుస్తక ప్రదర్శనలు మరింత విస్తరించాలి.
ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా మనం ఒక ప్రశ్న మనల్ని మనం అడగాలి.గత ఏడాదిలో ఎన్ని పుస్తకాలు చదివాం? ఎన్ని పిల్లలకు పుస్తకాలు బహుమతిగా ఇచ్చాం? ఇంట్లో ఎంత సమయం మొబైల్‌కు ఇస్తున్నామో, అందులో కొంత సమయం పుస్తకానికి కేటాయిస్తున్నామా? ఈ ప్రశ్నలకు నిజాయితీగా ఇచ్చే సమాధానాలే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి.
పుస్తకం మనిషిని ఒంటరిగా ఉండనివ్వదు. బాధలో ధైర్యం ఇస్తుంది. సందేహంలో దారి చూపుతుంది. విజయానికి ప్రేరణ ఇస్తుంది. అపజయంలో ఆదుకుంటుంది. మనిషి చనిపోయినా అతని ఆలోచనలు చిరంజీవిగా నిలిచే మార్గం పుస్తకమే. అందుకే గొప్ప రచయితలు కాలాన్ని జయిస్తారు. పుస్తకం ద్వారా మనిషి తనకోసమే కాదు, సమాజం కోసం కూడా ఆలోచించడం నేర్చుకుంటాడు. ఈ సందర్భంగా ప్రతి పౌరుడు కనీసం నెలకు ఒక పుస్తకం చదవాలని సంకల్పించాలి. పుట్టినరోజులకు, శుభకార్యాలకు పుస్తకాలను బహుమతిగా ఇవ్వాలి. పిల్లలకు స్క్రీన్ టైమ్ తగ్గించి రీడింగ్ టైమ్ పెంచాలి. చదివిన విషయాన్ని కుటుంబంతో పంచుకోవాలి. సమాజంలో పఠన సంస్కృతిని మళ్లీ పునరుద్ధరించాలి.
చివరగా చెప్పాల్సిందల్లా ఒక్కటే...ఇల్లు ఎంత పెద్దదో కాదు, అందులో ఉన్న పుస్తకాలే ఆ ఇంటి విలువను నిర్ణయిస్తాయి. సమాజం ఎంత అభివృద్ధి చెందిందో కాదు, ఎంత చదువుతో ముందుకు సాగుతోందో అదే అసలు ప్రమాణం.ఎందుకంటే పుస్తకం ఉన్న చోటే ప్రజ్ఞ ఉంటుంది. పఠనం ఉన్న చోటే పురోగతి ఉంటుంది. జ్ఞానం ఉన్న చోటే నిజమైన స్వేచ్ఛ ఉంటుంది.
విశ్లేషణ : అమరవాజీ నాగరాజు, జర్నలిస్ట్
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

E-Paper


