ఫిట్‌గా కనిపిస్తున్నా గుండెపోటు ముప్పు తప్పదా? యువతకు నిపుణుల సూచనలు ఇవీ
యువతలో గుండెపోటు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆరోగ్యంగా ఉన్నామన్న భ్రమలో పరీక్షలు చేయించుకోకపోవడం, జీవనశైలి లోపాలు దీనికి ప్రధాన కారణాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
బయటికి ఎంతో ఆరోగ్యంగా, ఫిట్‌గా కనిపిస్తారు.. జిమ్‌కు వెళ్తారు, చురుగ్గా ఉంటారు. కానీ అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోతున్నారు. ఇటీవల భారత్‌లో 18 నుంచి 45 ఏళ్ల యువతలో పెరిగిన ఈ ఆందోళనకర ధోరణిపై ఎయిమ్స్-ఐసీఎంఆర్ (AIIMS-ICMR) 2025లో చేపట్టిన అధ్యయనం సంచలన విషయాలను వెల్లడించింది. యువతలో సంభవిస్తున్న ఆకస్మిక మరణాల్లో 42.6 శాతం మరణాలకు గుండె సంబంధిత సమస్యలే కారణమని ఈ పరిశోధన తేల్చింది.

ఆరోగ్యంగా కనిపిస్తున్నా.. ముప్పు పొంచే ఉంటుంది
చాలామంది యువకులు తాము ఆరోగ్యంగా ఉన్నామని, తమకు ఎలాంటి లక్షణాలు లేవని భావిస్తుంటారు. అయితే, ముంబైలోని డాక్టర్ ఎల్.హెచ్. హిరానందని హాస్పిటల్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రతీక్ గిరి ఈ విషయంలో కీలక హెచ్చరికలు చేశారు.
"బయటికి ఆరోగ్యంగా కనిపించడం అంటే గుండె సంపూర్ణంగా పనిచేస్తోందని అర్థం కాదు. చాలా సందర్భాలలో ముప్పు కారకాలను ప్రాథమిక దశలో గుర్తించకపోవడమే ప్రమాదాలకు దారి తీస్తోంది" అని డాక్టర్ ప్రతీక్ వివరించారు.
లక్షణాలు లేని ‘బ్లాకేజీలు’.. ప్రాణాంతకం
ధమనుల్లో కొవ్వు, కొలెస్ట్రాల్ పేరుకుపోవడాన్ని ‘అథెరోస్క్లెరోటిక్ కార్డియోవాస్కులర్ డిసీజ్’ (ASCVD) అంటారు. ఇది చాలా నెమ్మదిగా జరిగే ప్రక్రియ.
50 శాతం కంటే తక్కువ బ్లాకేజీలు: ఉన్నప్పుడు శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపించవు.
70 శాతం దాటితేనే: విశ్రాంతి తీసుకునే సమయంలో కూడా గుండె నొప్పి లేదా అసౌకర్యం తెలుస్తుంది. అందువల్ల, అంతవరకు ఆరోగ్యంగా ఉన్న యువకుడిలో ఒక్కసారిగా ఈ కొవ్వు నిల్వలు (Plaque) చిట్లిపోతే అది తీవ్రమైన గుండెపోటుకు దారితీస్తుందని డాక్టర్ హెచ్చరించారు.
యువతను దెబ్బతీస్తున్న జీవనశైలి కారకాలు
మారుతున్న జీవనశైలి కారణంగానే యువతలో ఈ ముప్పు పెరుగుతోందని డాక్టర్ గిరి పేర్కొన్నారు. ప్రధానంగా:
- ధూమపానం, ఈ-సిగరెట్లు, మాదకద్రవ్యాల వాడకం.
- విపరీతమైన ఒత్తిడి, నిద్రలేమి.
- శారీరక శ్రమ లేకపోవడం, ఊబకాయం.
- జంక్ ఫుడ్, మితిమీరిన మద్యపానం.
ఎసిడిటీ అని భ్రమపడవద్దు
యువత చేసే పెద్ద తప్పు ఏమిటంటే.. గుండెలో వచ్చే అసౌకర్యాన్ని, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని లేదా వికారాన్ని కేవలం ‘ఎసిడిటీ’ లేదా ‘యాంగ్జైటీ’ (ఆందోళన) అని అనుకోవడం. ఈ పొరపాటు వల్ల సకాలంలో ఆసుపత్రికి వెళ్లలేక ప్రాణాలు కోల్పోతున్నారని వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ముందుగా ఏం చేయాలి?
గుండె జబ్బులను నివారించడం సాధ్యమేనని వైద్యులు భరోసా ఇస్తున్నారు. ఇందుకోసం చిన్న వయస్సు నుంచే కొన్ని జాగ్రత్తలు పాటించాలి:
రెగ్యులర్ స్క్రీనింగ్: బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాలి.
అధునాతన పరీక్షలు: అవసరాన్ని బట్టి ఈసీజీ (ECG), ఎకోకార్డియోగ్రఫీ లేదా ట్రెడ్‌మిల్ టెస్ట్ వంటివి డాక్టర్ల సలహాతో చేయించుకోవాలి.
సీటీ స్కాన్: గుండెలో దాగి ఉన్న బ్లాకేజీలను గుర్తించడానికి సీటీ కరోనరీ కాల్షియం స్కోరింగ్ వంటి పరీక్షలు ఎంతో ఉపయోగపడతాయి.
ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, ఒత్తిడి లేని జీవితం, సకాలంలో ఆరోగ్య పరీక్షలు.. ఇవే మీ గుండెను భద్రంగా ఉంచే ఆయుధాలు అని వైద్య నిపుణులు చెబుతున్నారు.
(గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. మీకు ఏదైనా అనారోగ్య సమస్య ఉన్నట్లు అనిపిస్తే వెంటనే నిపుణులైన వైద్యుడిని సంప్రదించండి.)

E-Paper












