...
...
Next Story

దిల్లీలో దారుణం.. షోరూమ్ ట్రయల్ రూమ్‌లో యువతి గొంతుకోసి హత్య!

దేశ రాజధాని దిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మోతీ నగర్ మెట్రో స్టేషన్ సమీపంలోని ఒక బట్టల షోరూమ్ ట్రయల్ రూమ్‌లో 18 ఏళ్ల యువతిని పరిచయస్తుడు గొంతుకోసి హత్య చేశాడని తెలుస్తోంది. ప్రేమ వ్యవహారం, వ్యక్తిగత విభేదాలే ఈ ఘాతుకానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

Published on: Nov 15, 2026, 15:15:27 IST
Advertisement

దేశ రాజధాని దిల్లీలో అత్యంత రద్దీగా ఉండే వాణిజ్య ప్రాంతంలో జరిగిన దారుణ హత్య కలకలం రేపింది! పశ్చిమ దిల్లీలోని మోతీ నగర్ మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్న ఒక వస్త్ర దుకాణం ట్రయల్ రూమ్‌లో ఒక 18 ఏళ్ల యువతి రక్తపు మడుగులో విగతజీవిగా కనిపించింది. పదునైన ఆయుధంతో ఆమె గొంతుకోసి అత్యంత కిరాతకంగా హతమార్చారు. మృతురాలిని పశ్చిమ దిల్లీకి చెందిన షబ్నమ్‌గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సూరజ్ అనే యువకుడే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని ఆరోపించారు.

మాట్లాడాలంటూ ట్రయల్ రూమ్‌లోకి తీసుకెళ్లి..!

దిల్లీలో దారుణం!
దిల్లీలో దారుణం!

పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, శనివారం సాయంత్రం షబ్నమ్ తన షిఫ్ట్ ముగించుకుని ఇంటికి బయలుదేరే సమయానికి నిందితుడు సూరజ్ షోరూమ్‌కు వచ్చాడు. అప్పటికే అతడు తన వెంట పదునైన ఆయుధాన్ని తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. షబ్నమ్‌తో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్న నెపంతో ఆమెను దుస్తులు మార్చుకునే ట్రయల్ రూమ్ లోపలికి తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు భావిస్తున్నారు. అనంతరం సూరజ్ తన వెంట తెచ్చుకున్న ఆయుధంతో షబ్నమ్ గొంతుకోసి, బయటి నుంచి గడియ పెట్టి అక్కడి నుంచి పరారయ్యాడు.

రాత్రి 9 గంటలకు బయటపడిన ఘోరం!

రాత్రి సుమారు 9 గంటల సమయంలో షోరూమ్ మూసివేయడానికి ఇతర సిబ్బంది సిద్ధమవుతుండగా ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది! దుకాణం అంతా తనిఖీ చేస్తున్న క్రమంలో ట్రయల్ రూమ్ తలుపు బయటి నుంచి వేసి ఉండటాన్ని గమనించారు. అనుమానంతో తలుపు తెరిచి చూడగా లోపల షబ్నమ్ రక్తపు మడుగులో పడి ఉండటం చూసి సిబ్బంది షాక్‌కు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువతి మెడపై పదునైన ఆయుధంతో కోసిన గాయాలను గుర్తించారు. మరణానికి గల కచ్చితమైన కారణాలను నిర్ధారించేందుకు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

గతంలోనూ వేధింపులు.. వెలుగులోకి కీలక వీడియో

హత్య అనంతరం దుకాణం యజమాని లోపలికి వెళ్లగా తీసిన మొబైల్ వీడియో ఒకటి బయటకు వచ్చింది. ట్రయల్ రూమ్ తలుపు కింది భాగంలో ఉన్న ఖాళీ నుంచి రక్తం ధారగా బయటకు రావడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. తలుపు బయటి నుంచి గడియ పెట్టి ఉందని, వెంటనే పోలీసులకు ఫోన్ చేయాలని అక్కడే ఉన్న ఒక మహిళ చెబుతున్న మాటలు ఆ వీడియోలో రికార్డయ్యాయి.

కుటుంబంతో సహా పరారీలో నిందితుడు.. సీసీటీవీల జల్లెడ

ఈ దారుణానికి పాల్పడిన తర్వాత సూరజ్ తన కుటుంబ సభ్యులతో సహా ఇంటికి తాళం వేసి పరారైనట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. నిందితుడిని పట్టుకునేందుకు దిల్లీ పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఇప్పటికే సూరజ్ బంధువుల్లో కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటన జరిగిన తీరును నిర్ధారించడానికి, నిందితుడు ఏ మార్గంలో పారిపోయాడో గుర్తించడానికి షోరూమ్ లోపల, పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సాంకేతిక ఆధారాల సాయంతో నిందితుడి ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks