Honda Elevate facelift : హోండా ఎలివేట్​ ఫేస్​లిఫ్ట్- 3 ప్లస్​లు, 2 మైనస్​లు..

ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 2026 హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ భారత మార్కెట్లో రూ. 11.80 లక్షల ప్రారంభ ధరతో ఇటీవలే లాంచ్ అయింది. వెంటిలేటెడ్ సీట్లు, 360 డిగ్రీ కెమెరా వంటి అప్‌డేట్లతో వచ్చిన ఈ ఎస్‌యూవీలో ఉన్న ప్రధాన ప్లస్, మైనస్ పాయింట్లపై ప్రత్యేక కథనం..

Published on: Oct 10, 2026, 16:04:04 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

భారత మిడ్-సైజ్ ఎస్‌యూవీ మార్కెట్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం ‘హోండా’.. ఎంతో కాలంగా వేచి చూస్తున్న 2026 ‘హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్’ వర్షన్‌ను ఇటీవలే మార్కెట్లో అధికారికంగా పరిచయం చేసింది. ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 11.80 లక్షల నుంచి రూ. 18.40 లక్షల శ్రేణిలో ఈ మోడల్ లభిస్తోంది. స్ట్రక్చర్, వెలుపలి కొలతల్లో పెద్దగా మార్పులు చేయనప్పటికీ, ఇంటీరియర్, ఫీచర్ల పరంగా వినియోగదారులు ఆశించిన కీలక అప్‌డేట్లను హోండా అందించింది.

హోండా ఎలివేట్ ఫేస్​లిఫ్ట్..
హోండా ఎలివేట్ ఫేస్​లిఫ్ట్..

మీరు కొత్త హోండా ఎలివేట్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, ఈ కార్లలో ఉన్న టాప్-3 ప్లస్ పాయింట్లు, 2 ప్రధాన లోపాలు ఏంటో ఇక్కడ వివరంగా చూద్దాము..

హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్: టాప్-3 ప్లస్ పాయింట్లు..

1. ముందు, వెనుక వరుసలకు వెంటిలేటెడ్ సీట్లు

పాత ఎలివేట్ మోడల్‌లో తీవ్రంగా లోపించిన ఫీచర్లలో వెంటిలేటెడ్ సీట్లు ఒకటి. భారతదేశ వాతావరణ పరిస్థితుల్లో డ్రైవర్లకు, ప్రయాణికులకు ఇది ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. ఈ విషయాన్ని గ్రహించిన హోండా, కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో ఏకంగా ముందు వరుసతో పాటు వెనుక సీట్లకు కూడా వెంటిలేషన్ సదుపాయాన్ని అందించి కాంపిటీటర్లకు సవాలు విసిరింది.

2. పవర్డ్ ఫ్రంట్ సీట్లు

మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో కార్లు కొనుగోలు చేసే వినియోగదారులు ఎలక్ట్రానిక్ అడ్జెస్టెబుల్ సీట్లను కోరుకుంటారు. ఈ విభాగంలో ఉన్న ఇతర ప్రత్యర్థి కార్లలో ఈ ఫీచర్ ఇప్పటికే ఉండటంతో, పాత ఎలివేట్ కొంత వెనుకబడింది. అయితే తాజా ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో డ్రైవర్, కో-ప్యాసింజర్ సీట్లను ఎలక్ట్రానిక్‌గా సర్దుబాటు చేసుకునే 'పవర్డ్ ఫ్రంట్ సీట్స్' సదుపాయాన్ని జోడించి ఆ లోటును భర్తీ చేశారు.

3. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ ఫీచర్లు

ఆధునిక కార్లలో కస్టమర్లు ఆశించే హైటెక్ ఫీచర్లను హోండా ఇందులో పొందుపరిచింది. ఇందులో 360-డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరా, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, ఆటో-హోల్డ్ ఫంక్షన్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటివి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇవి ఇరుకైన ప్రదేశాల్లో కారును పార్క్ చేయడానికి, ట్రాఫిక్‌లో ప్రయాణించడానికి డ్రైవర్‌కు ఎంతో సులువుగా ఉంటాయి.

హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్: 2 ప్రధాన లోపాలు..

1. డిజైన్ పరంగా కొత్తదనం లేకపోవడం

ఎక్స్‌టీరియర్ పరంగా చూస్తే ఈ హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో చెప్పుకోదగ్గ విప్లవాత్మక మార్పులేవీ కనిపించవు. అదే బాక్సీ షేప్ డిజైన్‌ను యథాతథంగా కొనసాగించారు. ఫ్రంట్ గ్రిల్‌లో స్వల్ప మార్పులు చేయడంతో పాటు ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, ఫాగ్ లాంప్ హౌసింగ్‌లను మాత్రమే కొద్దిగా రీ-డిజైన్ చేశారు. పాత మోడల్‌కి, దీనికి పెద్దగా తేడా గుర్తించడం కష్టమే.

2. పాత ఇంజిన్.. ఆప్షన్ల కొరత

హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ మెకానికల్ విభాగంలో ఎలాంటి మార్పులు జరగలేదు. ఇది కేవలం 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో మాత్రమే లభిస్తోంది. ఈ ఇంజిన్ 119 బీహెచ్​పీ పవర్, 145 ఎన్​ఎం టార్క్‌ను మాత్రమే విడుదల చేస్తుంది.

ఈ విభాగంలోని హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, టాటా నెక్సాన్ వంటి ప్రత్యర్థులు టర్బో-పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ఆప్షన్లను ఇస్తున్నాయి. మరోవైపు మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్ వంటివి అత్యధిక మైలేజ్ ఇచ్చే స్ట్రాంగ్-హైబ్రిడ్ సాంకేతికతను కలిగి ఉన్నాయి. హోండాలో కేవలం ఒక్క పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ మాత్రమే ఉండటం కొనుగోలుదారులకు కొంత నిరాశ కలిగించే అంశం.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More