...
...
Next Story

Mahindra XUV 3XO : మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్​ఓలో సీఎన్జీ వేరియంట్? ఇంకొన్ని రోజుల్లో లాంచ్!

పెరుగుతున్న ఇంధన ధరలకు ఊరటగా మహీంద్రా తమ ప్రసిద్ధ కాంపాక్ట్ ఎస్‌యూవీ 'ఎక్స్‌యూవీ 3ఎక్స్​ఓ'లో సీఎన్జీ వేరియంట్‌ను అక్టోబర్ 15న పరిచయం చేయడానికి సిద్ధమైందని తెలుస్తోంది. పెట్రోల్, డీజిల్, ఈవీ ఆప్షన్లతో పాటు ఇప్పుడు సీఎన్జీ విభాగంలోకి ఎంట్రీ ఇస్తూ టాటా నెక్సాన్, మారుతీ బ్రెజ్జాలకు సవాలు విసురుతోంది.

Published on: Oct 9, 2026, 06:45:55 IST
Advertisement

ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం 'మహీంద్రా అండ్ మహీంద్రా' తమ పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ‘ఎక్స్‌యూవీ 3ఎక్స్​ఓ’ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించేందుకు సిద్ధమైంది. అక్టోబర్ 15న ఒక కొత్త ప్రొడక్ట్‌ను మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు కంపెనీ ఇటీవల ఒక టీజర్ ద్వారా సంకేతాలు ఇచ్చింది. అందుతున్న సమాచారం ప్రకారం.. ఇది ఎక్స్‌యూవీ 3XO సీఎన్జీ వేరియంట్‌గా వాహన రంగ నిపుణులు భావిస్తున్నారు.

నాలుగో పవర్‌ట్రెయిన్ ఎంపికగా సీఎన్జీ!

మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ
మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ

2024లో భారత మార్కెట్లోకి అడుగుపెట్టిన మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్​ఓ, తక్కువ సమయంలోనే అద్భుతమైన అమ్మకాలతో దూసుకెళ్తోంది. ఇప్పటికే ఈ కారులో పెట్రోల్, డీజిల్, పూర్తి ఎలక్ట్రిక్ (ఈవీ) ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఫ్యాక్టరీ-ఫిట్టెడ్ సీఎన్జీ కిట్‌ను జోడించడం ద్వారా ఇది కంపెనీ లైన్-అప్‌లోనే కాకుండా, విభాగంలోనే అత్యధిక పవర్‌ట్రెయిన్ ఆప్షన్లు కలిగిన కారుగా నిలుస్తుంది. టాటా నెక్సాన్ తర్వాత పెట్రోల్, డీజిల్, ఈవీ, సీఎన్జీ నాలుగు ఆప్షన్లలో లభిస్తున్న రెండో ఎస్‌యూవీగా ఇది రికార్డు సృష్టించనుంది.

సిటీ డ్రైవింగ్ చేసే వారికి, నిత్యం ఎక్కువ దూరం ప్రయాణించే వారికి తక్కువ రన్నింగ్ కాస్ట్‌తో ప్రయాణ సౌకర్యాన్ని అందించడమే మహీంద్రా ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్​ఓ ఇంజిన్ సామర్థ్యం, గేర్‌బాక్స్ వివరాలు..

ప్రస్తుతం ఎక్స్‌యూవీ 3ఎక్స్​ఓ మోడల్‌లో 1.2-లీటర్, 3-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఎంపీఎఫ్​ఐ ఇంజిన్, 1.2-లీటర్ mStallion డైరెక్ట్ ఇంటేక్ పెట్రోల్ ఇంజిన్, 1.5-లీటర్ టర్బో-డీజిల్ ఇంజిన్లు ఉన్నాయి.

రాబోయే సీఎన్జీ వర్షన్‌ను 1.2-లీటర్ ఎంపీఎఫ్​ఐ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ ఆధారంగానే రూపొందించే అవకాశం ఉంది. ఈ ఇంజిన్ సాధారణ పెట్రోల్ మోడ్‌లో 111 బీహెచ్‌పీ పవర్, 200 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. సీఎన్జీ మోడ్‌లోకి మారినప్పుడు పవర్, టార్క్ అవుట్‌పుట్ స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది.

ట్యూనింగ్ అప్‌డేట్స్: సీఎన్జీ సిలిండర్ బరువును తట్టుకోవడానికి వెనుక సస్పెన్షన్ సెటప్‌ను బలోపేతం చేయడంతో పాటు, ఈసీయూ మ్యాపింగ్‌లో మార్పులు చేయనున్నారు.

ట్విన్ సిలిండర్ టెక్నాలజీ ఉంటుందా?

ప్రస్తుతం సీఎన్జీ కార్లలో అతిపెద్ద సమస్య డిక్కీలో స్పేస్ తగ్గిపోవడం. టాటా మోటార్స్, హ్యుందాయ్ కంపెనీలు 'ట్విన్-సిలిండర్' (రెండు చిన్న సీఎన్‌జీ ట్యాంకులు) టెక్నాలజీని ఉపయోగించి స్పేస్‌ను సద్వినియోగం చేస్తున్నాయి. ఎక్స్‌యూవీ 3ఎక్స్​ఓలో ఇప్పటికే బూట్ స్పేస్ కాస్త తక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో మహీంద్రా కూడా రెండు చిన్న ట్యాంకుల విధానాన్ని పాటిస్తుందా లేక సంప్రదాయ పెద్ద సిలిండర్‌నే అమరుస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.

కేఫ్ 3 నిబంధనల ప్రభావం..

మహీంద్రా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక భవిష్యత్తు నిబంధనలు కూడా ఒక కారణం. రాబోయే కేఫ్ 3 (CAFE 3) కార్బన్ ఉద్గార నిబంధనలను అందుకోవడానికి, కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించడానికి సీఎన్జీ మోడళ్లు ఆటోమొబైల్ కంపెనీలకు ఎంతగానో సాయపడతాయి.

మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్​ఓ సీఎన్జీ- ధర, పోటీ..

ఈ మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్​ఓ సీఎన్జీ.. మార్కెట్లో టాటా నెక్సాన్ సీఎన్జీ, మారుతీ సుజుకీ బ్రెజ్జా సీఎన్జీలకు నేరుగా పోటీ ఇస్తుంది. వీటితో పాటు హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్ మోడళ్లకు కూడా సవాలు విసరనుంది. ఇక సాధారణ పెట్రోల్ వేరియంట్లతో పోలిస్తే సీఎన్జీ వేరియంట్ల ధర సుమారు రూ. 1 లక్ష వరకు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks